Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బీటలు వారుతున్న కాంగ్రెస్ కంచుకోట

– ఇంతవరకు ఈ సీట్ గెలవని బీఆర్ఎస్
– ఈసారి ఎలాగైనా గెలవాలని టార్గెట్ పెట్టుకున్న బీఆర్ఎస్
-గ్రూప్ తగాదాలకు కేరాఫ్ గా మారిన కాంగ్రెస్
-ప్రస్తుత ఎంపీ ఉత్తమ్ అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం…?

-నజరు పెంచిన బిజెపి

ప్రత్యేక కథనం సి.హెచ్.ప్రతాప్

కరుడు గట్టిన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన నల్గొండ పార్లమెంట్ రాజకీయం ఆసక్తి రేపుతోంది. నల్గొండ ఎంపీ సీటు గెలిచి రికార్డ్ బ్రేక్‌ చేయాలని బీఆర్ఎస్‌ పావులు కదుపుతుంటే.. కంచుకోటపై పట్టు సాధించాలని కాంగ్రెస్‌ వ్యూహాలు రచిస్తోంది. రెండు పార్టీల్లో లుకలుకలపై నజర్ పెంచిన బీజేపీ.. ఆపరేషన్ ఆకర్ష్ అంటుంటే.. టీడీపీ కూడా పోటీకి సై అంటోంది.

నల్గొండ లోక్‌సభ నియోజకవర్గానికి దేశస్థాయిలో గుర్తింపు ఉంది. 1952లో ఏర్పడిన ఈ పార్లమెంట్ నియోజకవర్గం ఆది నుండి కాంగ్రెస్‌కు కంచుకోట. బి ఆర్ ఎస్ పార్టీ నుండి ఇప్పటివరకు ఒక్కరు కూడా నల్గొండ ఎంపీ గెలవలేదు. మొత్తం మీద ఏడేసి సార్లు కాంగ్రెస్, వామపక్షాలు విజయం సాధించగా.. రెండుసార్లు మాత్రం టీడీపీ విజయం దక్కించుకుంది. అయితే గత రెండు ఎన్నికలలో నల్గొండ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను బి ఆర్ ఎస్ పార్టీ కైవసం చేసుకున్నా.. పార్లమెంట్‌ స్థానంలో మాత్రం గెలవకపోవదం ఆ పార్టీకి అసంతృప్తిని మిగిల్చింది.. నల్గొండ అంటేనే కాంగ్రెస్‌కు కంచుకోట. ఎందరో ఉద్దండులు, తలలు నెరసిన రాజకీయ యోద్ధులు ఆ పార్టీ తరుఫున ప్రాతినిధ్యం వహించారు. అలాంటి కోటకు ఇప్పుడు బీటలు వారదం కాంగ్రెస్ ను కలవర పెట్టే అంశం. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని కాంగ్రెస్ పావులు కదుపుతుంటే.. ఎంపీ సీటుతో పాటు అసెంబ్లీ స్థానాలను క్లీన్‌స్వీప్‌ చేయాలని బీఆర్ఎస్‌ టార్గెట్‌గా పెట్టుకుంది. బీజేపీకి బలం తక్కువే అయినా.. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిని ముందు పెట్టి చక్రం తిప్పాలని కమలం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. దీంతో నల్గొండ రాజకీయం ఆసక్తికరంగా మారింది.

మానుకోటలో కరోనా కలకలం

నల్గొండ పార్లమెంట్‌కు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సిట్టింగ్‌ ఎంపీగా ఉన్నారు. ఈసారి ఆయన అసెంబ్లీకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఎంపీ టికెట్‌ రేసులో పార్టీ సీనియర్ నేతలు జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయ్. బీఆర్ఎస్‌ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన వేమిరెడ్డి నర్సింహ్మారెడ్డితో పాటు.. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డిలో ఒకరు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయ్. అయితే జాతీయస్థాయి పొత్తులు, అవసరాలకు అనుగుణంగా వామపక్షాలకు సీటు కేటాయించాలన్న డిమాండ్లు కూడా వినవస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో బలమైన నేతగా ఉన్న సంకినేని వెంకటేశ్వరరావు కమలం పార్టీ నుంచి రేసులో నిలిచే అవకాశం ఉంది. అంతే కాకుండా బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ లలో వున్న అసంతృప్తులను టార్గెట్ చేసి వారిని తమ తరుఫున ఎన్నికల బరిలోకి దింపాలని కూడా బి జె పి యోచిస్తొంది. మునుగోడు ఎన్నికల తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బి జె పి ఇప్పుడు నల్గొండ కోటలో పాగా వేసేందుకు దీతైన వ్యూహాలు రచిస్తోంది. కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ కంచుకోట. గత ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేయగా.. ఆయన తీరుతో ఈసారి కాంగ్రెస్ టికెట్ ఇస్తుందా లేదా అనే అనుమానాలు వినిపిస్తున్నాయ్. ఎన్నికల ముందు కోమటి రెడ్డితో పాటూ భారీగా కాంగ్రెస్ కాడర్ పార్టీ మారేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారన్న వార్తల నేపధ్యంలో కాంగ్రెస్ బలహీన పడుతోంది.

ఎమ్మెల్యే మీద జనాల్లో వ్యతిరేకత ఉందని.. అదే తమకు అనుకూలంగా మారుతుందని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. దీంతో కోదాడ నుంచి పోటీకి ఉత్తమ్ ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో రీబౌన్స్‌ అయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టిన టీడీపీ.. కోదాడ మీద స్పెషల్‌ నజర్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు కంచుకోట అయిన కోదాడలో.. ఈసారి అభ్యర్థిని నిలిపేందుకు టిడిపి సిద్ధం అవుతుందనే ప్రచారం నడుస్తోంది. పార్టీలో గ్రూప్ తగాదాలు కాంగ్రెస్‌కు ఇబ్బందిగా మారుతోంది..నేతలంతా ఎవరికి వారే అన్నట్లుగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా జిల్లా రాజకీయాలపై పట్టు ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్‌లో ఒకరు బీజేపీలో చేరగా.. మరొకరు పార్టీ మీద అసంతృప్తితో కనిపిస్తున్నారు. ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందని ఆసక్తికకరంగా మారింది.