Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

టార్గెట్‌ తెలుగు రాష్ట్రాలు

ప్రత్యేక కథనం: సి.హెచ్.ప్రతాప్

బిజెపి ఇప్పుడు తన దృష్టి ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో పెట్టింది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా వ్యూహాలు కదుపుతోంది. మిషన్ 90 పేరిట తెలంగాణాలో ఇప్పటికే ఒక పటిష్టమైన కార్యాచరణకు నడుం కట్టిన బి జె పి ఇప్పుడు తన ఫోకస్ ఆంధ్రాపై కూడా పెట్టింది. ఇందుకోసం ఏం చేయాలనే దానిపై ఫోకస్‌ పెట్టారు కమలనాథులు. ఈ క్రమంలో ఢిల్లీలో ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దక్షిణ భారతదేశంలో బీజేపీ మూలమూలకు విస్తరిస్తోందన్నారు ప్రధాని మోదీ. కర్ణాటకలో చాలా ఏళ్ల నుంచి బలంగా ఉన్నాం. ఈనాటికీ అక్కడ నెంబర్ 1గా ఉన్నాం. తెలంగాణ ప్రజలకు బీజేపీ మీద మాత్రమే భరోసా ఉంది. ఏపీ ప్రజల్లో రోజురోజుకూ పార్టీ పట్ల ఆదరణ పెరుగుతోంది. తమిళనాడు, కేరళలో రోజురోజుకూ పార్టీ బలోపేతం అవుతోంది.. అంటూ ఢిల్లీ మీటింగ్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలలో , ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో బి జె పి పై- ప్రజలకు నానాటికీ పెరుగుతున్న ఆదరణ వలన అధికారం అందుకునే రోజు ఎంతో దూరంలో లేదని ప్రధాని భరోసా వెలిబుచ్చారు. ఏక్ భారత్ – శ్రేష్ఠ్ భారత్ నినాదాన్ని నిజం చేస్తూ సీట్ల సంఖ్య, ఓట్ల శాతంలో బీజేపీని సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లాలంటూ శ్రేణులకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ.

 

2014 తర్వాత క్రమక్రమంగా ఉత్తర , ఈసాన్య భారతాలలో పూర్తి పట్టూ సాధింహిన బి జె పి ఇప్పుడు దక్షిణ భారతంపై పూర్తిగా దృష్టి సారించింది. మిషన్‌ సౌత్‌ పేరుతో ఆ పార్టీ నేతలు దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య పెంచుకునే దిశగా పావులు కదుపుతున్నారు. కర్నాటక మొదలు తమిళనాడు వరకు అన్ని రాష్ట్రాల్లో తమ బలం పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే దక్షిణ భారత దేశంలో పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతోంది. దాన్ని పెంచుకుంటూ పోతూ, సీట్లు, ఓట్లు శాతం పెరిగేలా కసరత్తు చేయాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ.

 

ఇక తాజా పరిణామాలు చూస్తుంటే.. షర్మిల బాణాన్ని తెలుగు రాష్ట్రాలపై ఎక్కుపెట్టినట్లు కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మోదీనే స్వయంగా ఆపరేషన్‌ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మిషన్‌ మరింత ఉద్ధృతంగా కొనసాగే అవకాశాలున్నాయి. ఈ పరిణామలతో … తెలుగు రాష్ట్రాల రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది.

 

తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. మంచి ఫలితాలు వస్తాయని ఆశ పడుతోంది. దానికి తగ్గట్లుగా కష్టపడాలని నేతలకు హితబోధ చేస్తోంది. కానీ నేతల మధ్య పూర్తి స్థాయిలో సమన్వయ లోపం కనిపిస్తోంది. దీన్ని హైకమాండ్ సరిదిద్దడానికి సమయం తీసుకుంటోంది. ఎంత ఆలస్యం అయితే బీజేపీకి అంత నష్టం జరుగుతుంది.

 

తెలంగాణలో రాబోయేది రామ రాజ్యం, పేదల రాజ్యం రాబోతోంది. పెద్దోళ్ల రాజ్యం నాశనం కాబోతోంది. తెలంగాణ ఏ లక్ష్యం కోసం ఏర్పాటు చేసుకున్నామో ఆ లక్ష్యం నెరవేరలి అంటే భాజపా ప్రభుత్వం రావాలి. భాజపా రాబోతుంది. ఇప్పుడు ఉన్న సంక్షేమ పథకాలు కంటిన్యూ చేస్తూ ఇంకా అభివృద్ధి పథకాలు ఏర్పాటు చేస్తాం. అప్పుల్లో ఉన్న తెలంగాణ కాపాడాలి అంటే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాలి. తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం భాజపా అంటూ ఢంకా బజాయించి చెబుతున్నారు కమలనాధులు.