మమ్మల్ని ఆదుకోండి మహా ప్రభో !!!!
– వరద నిర్వాసితుల ఆక్రందన
తెలుగు రాష్ట్రాల్లో వరదలు గోదావరి పరీవాహక ప్రాంతాలను ముంచెత్తాయి. వేల కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలిపోయాయి. గోదావరికి వరదలు గతంలో ఎన్నోసార్లు వచ్చాయి.. ఈసారి కూడా వచ్చాయి. అయితే.. వరద బాధితుల కథ మాత్రం మారడం లేదు. ఏళ్ల తరబడి వాళ్ల బతుకులు అలాగే సాగుతున్నాయి. వారం రోజులుగా వరద ముంపుతో ప్రజలు అల్లాడుతున్నా.. వారికి అందుతున్నది అరకొర సాయమే. పేద ప్రజల పక్షపాతినని చెప్పుకునే ప్రభుత్వాలు తమను పట్టించుకోకుండా అనాధల్ని చేసాయని, తమను తక్షనమే ఆదుకోవాలని గోదావరి ముంపు బాధితులు గత 240 రోజులుగా దీక్ష చెస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. వివరాల్లోకి వెళితే….
ఖమ్మం జిల్లా జిల్లా వ్యాప్తంగా గోదావరి వరదలు వేలాది మందిని నిరాశ్రయులను చేస్తున్నాయి.వరదలు వచ్చినప్పుడి పునరావాస కేంద్రాలకు తరలించడం , పరిస్థితులు చక్కబడ్డాక తిరిగి విరిని వారి స్వస్థలాలకు తరలించడం నిత్యకృత్యంగా మారింది. ముఖ్యంగా గత సంవత్సరం ఊహించని రీతిలో వరద ఇళ్లను ముంచెత్తడంతో నిరుపేద ప్రజలు తట్టాబుట్టతో వీధినపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తమకు పునరావాసం కింద మెరక ప్రాంతంలో పక్కా ఇల్లు నిర్మించాలని ప్రధాన డిమాండ్ తో పలు గ్రామాలకు చెందిన వరద ముంపు బాధితులు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో గడిచిన 240 రోజులుగా పినపాక, భద్రాచల నియోజకవర్గ పరిధిలో గోదావరి ముంపు బాధితులు, ఇండ్లు లేని నిరుపేదలు మణుగూరు ప్రధాన రహదారి పక్కన కృష్ణసాగర్ పంచాయితీ పరిధిలో నిరవధిక నిరసన దీక్షను చేపడుతూ.. ఆ ప్రాంతాల్లోనే తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేసుకొని జీవనాన్ని సాగిస్తున్నారు.
ఈ క్రమంలో గడిచిన రెండు రోజులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షానికి వరద ముంపు బాధితులు నిర్మించుకున్న తాత్కాలిక నివాసాలు వర్షపు నీటికి మునిగిపోయాయి. తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక, తినేందుకు తిండి లేక తాత్కాలిక నివాసాలలో ఉంటున్న సుమారు 670 కుటుంబాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసుకున్న ఈ తాత్కాలిక నివాసాల గుండా నిత్యం ప్రయాణించే అధికారులకు కనీసం వీరి బాగోగులను అడిగి తెలుసుకునే తీరిక లేకుండా పోయిందని సామాన్య ప్రజలు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
గతంలో వరద ముంపు ప్రాంతంలో పర్యటించిన ముఖ్యమంత్రి వరద బాధితులకు అండగా ఎత్తైన ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మిస్తానని ప్రకటించి నేటికి ఎనిమిది నెలలు గడుస్తున్నా అవి ప్రకటనకే పరిమితమయ్యాయని, క్షేత్రస్థాయిలో అమలుపరిచేందుకు ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎన్నికల సమయంలో వచ్చి తమను ఆప్యాయంగా పలకరించే రాజకీయ నేతలు గత 240 రోజులుగా తాత్కాలిక ఆవాసాలలో జీవనం సాగిస్తూ, దుర్భరమైన జీవనం గడుపుతున్నా తమను ఒక్కసారైనా వచ్చి పలకరించిన పాపాన పోలేదని వీరు ఆవేదన వ్యక్తం చెస్తున్నారు.
రాబోయే నాలుగు నెలల్లో మళ్లీ వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో తమ జీవితాన్ని ఎలా కొనసాగించేదని ఇక్కడున్న నిర్వాసితులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక అధికారులు, ప్రతినిధులు స్పందించి వరద బాధితులకు న్యాయం చేయాలని వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు.
సి.హెచ్.ప్రతాప్