ఎమ్మెల్సీ ఎన్నికలు వై సి పి పతనానికి ఆరంభమా ???

2019 ఎన్నికల తర్వాత ప్తతీ ఉప ఎన్నికలో గొప్ప గొప్ప విజయాలను అందుకున్న వై సి పి కి తాజా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఊహించని షాక్ తగిలింది. ఈ ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విపక్షాలు ఎలాగైనా అధికార పార్టీని మట్టి కరిపించాలని కంకణం కట్టుకున్నాయి. విపక్ష ఓటు చీలకుండా పటిష్టంగా వ్యూహం పన్నడంతో ఆ దెబ్బకు వై సి పి కుదేలైపోయింది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించిన ఉత్తరాంధ్రతో పాటుగా కంచుకోటగా భావించే తూర్పు రాయలసీమలొ ఓటమితో ఏం జరిగిందనే చర్చ వై సి పి లో మొదలైంది. ఓటమిపై ఒక్క ముఖ్య నేత నోరు విప్పనప్పటికీ అంతర్గతంగా దీనిపై పెద్ద స్థాయిలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఇంత బలంగా ఉన్న సమయంలో ఓటమి ఏంటనే అంతర్మధనం మొదలైంది. కాగా తమ విజయాన్ని టీడీపీ అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లోనూ తమదే విజయమంటూ ప్రచారం ప్రారంభించింది. వై సి పి ఓటమి ఉత్తరాంధ్ర నుండే ప్రారంభం అయ్యిందని చంద్రబాబు ఘనంగా ప్రకటించారు.
ఈ ఓటమికి ముఖ్య కారణం మంత్రులు..ఎమ్మెల్యే మధ్య సమన్వయం లోపం అని తెలుస్తోంది.. అటు టీడీపీ అధినేత చంద్రబాబు పీడీఎఫ్ తో ఒప్పందం టీడీపీకి బాగా కలిసి వచ్చింది. కానీ, వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం ఓవర్ కాంఫిడెన్స్ తో కనిపించారు. జగన్ పధకాలను చూసి ప్రజలు ఓటేస్తారని, తాము ఏ మాత్రం కష్టపడనవసరం లేదన్న అతి విశ్వాసం కనిపించింది. ఎన్నికల సమయంలో ప్రచారం పేలవం గా, నిర్లక్ష్యంగా జరిగింది. పట్టభద్రుల దగ్గరకు వెళ్లి మద్దతు కోరిన సందర్భాలు చాలా తక్కువగా కనిపించాయి. ఓటర్లను చేర్చటం.. తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకోవటంలో స్థానిక ఎమ్మెల్యేలు విఫలమయ్యారు. ఉత్తరాంధ్రలో నేతల మధ్య ఐక్యత లేకపోవటంఇప్పుడు వైసిపికి పెద్ద ఎదురుదెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు. రాయలసీమలో టీడీపీ నేతలు కలసికట్టుగా పని చేసారు. ఈ ఫలితాలతో పార్టీ నేతలకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల వేళ..ఎటువంటి హెచ్చరికలు చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
ఈ ఎన్నికల్లో గెలుపుపై ఏమాత్రం ఆశల్లేని పరిస్ధితుల్లో అభ్యర్ధులే దొరకని టీడీపీ చివరికి ఘన విజయంతో ఈ ఎన్నికను ముగించడం ఇప్పుడు వైసీపీకి ఏమాత్రం మింగుడుపడటం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్ధానిక ప్రజాప్రతినిధులు అన్ని విధాలా అండగా నిలిచినా వైసీపీ ఓటమిపాలవ్వడం వెనుక టీడీపీ రచించిన భారీ వ్యూహాలే ఉన్నాయి అన్నది నిర్వివాదాంశం. విపక్షాలు కలిసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకుంటే అధికార వైసిపి కు ఓటమి తప్పదని గత కొద్ది నెలలుగా జరుగుతున్న ప్రచారం నిజమని ఈ ఎన్నికలలో తేలిపోయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉత్తరాంధ్రలో బలమైన సామాజిక వర్గమైన కాపులు ఈ ఎన్నికలలో తమ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వై సి పి ని కాదని టి డి పి పిడి ఎఫ్ కు ఓటేసారని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో జనసేన చాప కింద నీరులా పని చేసి వై సి పి ని మట్టి కరిపించడంలో సైలెంట్ కిల్లర్ పాత్ర పోషించింది. ఉత్తరాంధ్రలో లా కాపు సామాజిక వర్గం మొత్తం రాష్ట్రంలో వై సి పి కి వ్యతిరేకమైతే ఇక వచ్చే ఎన్నికలలో వై సి పి పని గోల్ మాల్ గోవిందమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
టి డి పి చిరంజీవిరావు గెలుపుతో ఇటీవలే యాక్టివ్ అయిన గంటా తన సత్తా ఏమీటో నిరూపించుకున్నారు. ఇప్పుడు గంటాను నమ్ముకుని విశాఖలో రాబోయే సార్వత్రిక ఎన్నికలకు టీడీపీ వ్యూహరచన చేసే స్ధాయికి ఆయన చేరిపోయారు. గంటా రీఎంట్రీ ఇప్పుడు ఉత్తరాంధ్రలో టీడీపీ అవకాశాల్ని మరింత మెరుగుపరిచిందనే వాదన వినిపిస్తోంది.
సి.హెచ్.ప్రతాప్