Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పాత నల్లకుంట మార్గంలో నిలిచిపోయిన రోడ్డు విస్తరణ పనులు

– తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు

ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయ లోపం నల్లకుంట వాసులకు శాపంగా మారింది. ఆర్భాటంగా ప్రారంభించిన రోడ్డు విస్తరణ పనులు అధికారుల మధ్య సమన్వయ లేమి కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఊహించని ప్రమాదాలు పాత నల్లకుంటలో స్థానికుల ఇక్కట్లు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. రోడ్డు విస్తరణ పనులు మధ్యలోనే నిలిచిపోవడం సగం తవ్విన రోడ్లతో ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలు వర్ణనాతీతంగా మారాయి. ఏడాది కాలంగా మూసి డివిజన్ పనులు నడుస్తుండగా, కొన్ని నెలల క్రితం అకస్మాత్తుగా పనులన్ని నిలిచిపోయాయి. పర్మిషన్ ఇచ్చిన గడువు ముగిసిందని, రెన్యువల్ కోసం సంబంధిత శాఖ తిరిగి దరఖాస్తు చేసుకోనందున పనులను తిరిగి కొనసాగించేందుకు అనుమతులు ఇవ్వడం లేదని నగరపాలక సంస్థ పేర్కొంటోంది. రోడ్లను పూర్తిగా తవ్వేయడంతో దుమ్ముధూళి వాహనదారుల కళ్ళలో పడి తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. డస్ట్ ఎలర్జీ వల్ల గొంతునొప్పి, చర్మవ్యాధులు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. .ఇటీవల పడిన అకాల వర్షాల కారణంగా గోతులలో వర్షపు నీరు చేరి అక్కడ గొయ్యి ఉందన్న విషయం తెలీక ఇక సగం తవ్వి వదిలేసిన గుంతల్లో పడి ఎంతో మంది గాయాలపాలవుతున్నారు. ఇక వాయు కాలుష్యం తో పాటూ భూగర్భ జలాలు కూడా కలుషితమవుతున్నాయి అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంతల్లో చెత్తా చెదారం చేరి దోమలకు ఆలవాలంగా మారుతుండటంతో ఇరుగు పొరుగు ఇళ్లల్లోని ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. మరోవైపు రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణదారులు తమ వ్యాపారం పూర్తిగా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

సి.హెచ్.ప్రతాప్