Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

జగన్ క్యాబినెట్లో ఆనలుగురు డౌటేనా?

*ఉగాది అనంతరం జగన్ క్యాబినెట్ ను మరోసారి విస్తరించనున్నారా?
*ఎన్నికల టీమ్ ను ఏర్పాటు చేయనున్న సీఎం జగన్.
*బట్టు రాజులతో పనిలేదు. గెలుపు సాధించే వారితోనే జగన్ కు పని
*క్రియాశీలంగా వ్యవహరిస్తూ వచ్చే ఎన్నికలలో పార్టీ గెలుపును భుజాలపై వేసుకునే నేతలకు మంత్రిమండలిలో స్థానం కల్పించనున్నారా?
*అందులో భాగంగానే సీఎం జగన్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు క్యాబినెట్ లో బెర్త్ ను ఖాయం చేస్తున్నారా?
*ఈ కూడికలు తీసివేతల్లో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి నలుగురు మంత్రులకు ఉద్వాసన పలకనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా , రామచంద్రపురం (నిజం న్యూస్) మార్చి 18, జిల్లా బ్యూరో :
ఎన్నికల వ్యూహంలో భాగంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గాన్ని మరో మారు పునర్వ్యవస్థీకరించనున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలను, సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని సీఎం జగన్ తన ఈసారి మంత్రివర్గాన్ని భారీగానే మార్పులు చేర్పులు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందులో భాగంగానే ఇటీవల జగన్ ఉమ్మడి జిల్లాకు చెందిన క్యాబినెట్ సభ్యులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. దానితోపాటు వీరికి కొన్ని లక్ష్యాలను నిర్దేశించారు. దీంతో ఈ నలుగురిలోనూ క్యాబినెట్లో కొనసాగే అవకాశాలపై అయోమయ పరిస్థితి నెలకొంది. గోదావరి జిల్లాకు చెందిన ప్రస్తుత మంత్రులపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి జిల్లాకు సంబంధించి మంత్రులు వినిపే విశ్వరూప్, తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, దాడిశెట్టి రాజా వీరెవరి పనితీరూ ముఖ్యమంత్రికి సంతృప్తికరంగా లేనట్లు వార్తలొస్తున్నాయి. రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న శాఖ రహదార్లు, భవనాల శాఖ. రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా రహదార్లు శిథిలావస్థకు చేరుకుని రోడ్ల పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఆ శాఖకు చెందిన మంత్రి దాడిశెట్టి రాజా ఈ విషయంలో ఇప్పుటికే జనానికి పాపాల భైరవుడిలా కనిపిస్తున్నాడు. కొన్ని రహదార్లకు తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నా విపక్షాలకు రాష్ట్రంలోని రహదార్ల దుస్థితే ఎన్నికల ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. ముఖ్యంగా జనసేన రోడ్లపై గోతుల్ని పూడ్చడం తమ ఎన్నికల ప్రచార అజెండాలో ప్రధానాంశంగా పరిగణిస్తోంది. జనసేన నాయకత్వం ఈ గోతుల్ని పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టిన ప్రతి సారి ప్రభుత్వం మేల్కొని ముందస్తుగా ఆయా రోడ్లకు మరమ్మతుల్ని చేపట్టినప్పటికీ ఈ శాఖకు ప్రజల పట్ల ఏమాత్రం నిబత్తత లేదన్న విషయం తేటతెల్లమవుతోందన్న విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ మంత్రి దాడిశెట్టి రాజా దృష్టికి తెచ్చినట్లు సమాచారం. అలాగే మంత్రి విశ్వరూప్ గతకొంతకాలంగా అనారోగ్యంతో సతమతమౌతున్నారు. అంతకు ముందు నుంచీ సొంత శాఖపై ఆయనకు పట్టుసడలిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తన బదులు కుమారుడ్ని బరిలో దింపే యోచనలో ఆయన ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హోమ్ మంత్రి తానేటి వనిత తీరుపై కూడా జగన్ అసహనంగా ఉన్నట్లుతెలుస్తోంది. శాంతిభద్రతలకు విఘాతం తలెత్తిన పలు సందర్భాల్లో నేరుగా జగన్ లేదా ప్రభుత్వ రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెరపైకొచ్చి వివరణివ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. హోమ్ మంత్రిగా జరిగిన సంఘటనపై వివరణ ఇవ్వడంతో పాటు దాన్ని ప్రభుత్వానికి, పార్టీకి అనుకూలంగా మలచడంలో ఆమె సఫలం కాలేక పోతున్నారన్న భావన సర్వత్రా నెలకొంది. సాధారణంగా వేణు వేగంగా పనిచేస్తారు. అయితే శాసనసభ్యుడిగా ఆయన సమర్ధవంతమైన సేవలందించగలిగారు. కానీ మంత్రయ్యాక పత్రికా ప్రకటనలకీ, ఫోటోలకే పరిమితమయ్యారన్న విమర్శలున్నాయి. పార్టీలో తలెత్తిన అంతర్గత విభేదాలకు ఆయన చెక్ పెట్టలేకపోయారు. సమాచార శాఖను ఆయనకు జతకలిపినప్పటికీ ఆ శాఖపై కనీస స్థాయిలో కూడా ఆయన ప్రభావం చూపలేక పోయారు. మీడియాను ఆకట్టుకోవడంలో విఫలం చెందారన్న వాదన బలంగా వినిపిస్తోంది. సినిమాటోగ్రఫి మంత్రి హోదాలో సినిమా పరిశ్రమ ప్రముఖుల్ని ప్రభుత్వానికి అనుకూలంగా మార్చడంలోనూ ఆయన విజయం సాధించలేక పోయారన్న వాదన సైతం వినిపిస్తోంది. దాంతో అంచెలంచెలుగా సొంత నియోజకవర్గంలోనే పట్టు కోల్పోతున్నారనేది నమ్మలేని నిజం. సంక్షేమ పథకాల్ని పదే పదే ఉచ్చరించడం మినహా మంత్రిగా తన ప్రాభల్యాన్ని నిరూపించుకోలేక పోయారన్న అభిప్రాయం వైకాపా పెద్దల్లోనూ, ఇటు జనంలోనూ నెలకొంది. ఇంటెలిజెన్సీ నివేదికలు సైతం అధినాయకునికి ఇవే సంకేతాలను అందించాయని తెలుస్తోంది.

మంత్రివర్గంలో మార్పులు అనివార్యమా?

జిల్లాకు చెందిన నలుగురు మంత్రుల్లో కనీసం ఒకరిద్దర్నైనా మార్చే అవకాశాలుంటాయని రాజధాని వర్గాల బోగట్టా. అయితే సామర్ధ్యం కంటే సామాజిక సమీకరణాలకే ప్రాధాన్యతనివ్వాల్సిన నేపధ్యంలో ఓ సామాజికవర్గానికి చెందిన మంత్రిని తొలగిస్తే అదే సామాజిక వర్గం నుంచి మరొకరికి ఆవకాశం కల్పించక తప్పదు. దాడిశెట్టి రాజా స్థానంలో మంత్రి పదవి కోసం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అయితే తోటకు గ్రీన్ సిగ్నల్ అందినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కూడా తన -స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. శెట్టిబలిజ సామాజికవర్గం నుంచి వేణు తప్ప ఈ ప్రాంతంలో మరెవరూ ఆమాత్రం గుర్తింపు కలిగిన నాయకుల్లేరు. అయితే ఇప్పుడిప్పుడే ఎమ్మెల్సీగా ఖరారైన కుడుపూడి సూర్యనారాయణరావు కూడా అదే సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కాగా ఆయన చట్టసభలో ప్రవేశించడం ఇదే తొలిసారి. పాలనాపరంగా ఆయనకింత వరకు ఏమాత్రం అనుభవంలేదు. అయితే కోనసీమ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల వెన్నుదన్ను ఆయనకుంది. కుడుపూడి విషయంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చక్రం తిప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే పి. గన్నవరం నుంచి కొండేటి చిట్టిబాబు కూడా మంత్రి పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. వీరిలో ఎవరెవర్ని ఏరి వేస్తారో, ఎవరిని కొనసాగిస్తారో అన్నది ఉగాది నాటికి ఓ స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.