టీఎస్ పి ఎస్ సి పేపర్ లీకేజ్ కేటీఆర్ కు ఏం సంబంధం.….?

ఇద్దరు దుర్మార్గుల వల్ల తప్పు జరిగితే పిల్లల్ని రెచ్చ కొట్టడం ఏంటి…?
నోటికొచ్చినట్టు మాట్లాడటం, బాధ్యతారహితంగా మాట్లాడడం సబాబేనా
ఉమ్మడి అదిలాబాద్ బ్యూరో మార్చ్ 18 (నిజం న్యూస్)
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీకి, కేటీఆర్‌కు సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. పేపర్ లీక్ అయితే ఐటీ మినిస్టర్ ను బర్తరఫ్ చేయాలా..? ఇద్దరు దుర్మార్గుల వల్ల తప్పు జరిగితే పిల్లల్ని రెచ్చగొట్టడం, నోటికొచ్చినట్టు మాట్లాడటం ఇష్టమొచ్చినట్లు బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సబబేనా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. పేపర్ లీకేజీ అంశంపై బీఆర్‌కే భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వాలు ఎలా పని చేస్తాయో తెల్వదు. టీఎస్‌పీఎస్సీ ఒక రాజ్యాంగ సంస్థ. దాంట్లో ప్రభుత్వ పాత్ర ఉండదు. మా తరపున ఒక ఐఏఎస్ ఆఫీసర్ మాత్రమే ఉంటాడు. ఒకాయన అంటడు.. ఐటీ మినిస్టర్‌ను బర్తరఫ్ చేయాలంటాడు. ఐటీ మినిస్టర్ అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి కంప్యూటర్‌కు నేనే బాధ్యుడ్నా..? తెలిసి అంటారా..? తెల్వక అంటారా..? తెలిసి కావాలని దురుద్దేశాలు ఆపాదించాలని అంటారా..? ఏం మాట్లాడుతున్నారు అసలు అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఐటీ మంత్రి పనేంటో తెలుసా..?
ఇంటర్మీడియట్ బోర్డు లో ఏదైనా జరిగితే ఐటీ మినిస్టర్ తప్పు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఏదైనా జరిగితే ఐటీ మినిస్టర్ తప్పు అని అడ్డగోలుగా వాగడం సరికాదని కేటీఆర్ సూచించారు. ఐటీ అంటే ఏం చేస్తారో కనీసం వీళ్లకు తెలుసా..? ఐటీ మంత్రి పనేంటో తెలుసా..? ఎప్పుడైనా ప్రభుత్వంలో పని చేసిన అనుభవం ఉందా.? తెలిసీ కూడా కావాలని దురుద్దేశిత పూర్వకంగా మాట్లాడటామా..? టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ ఇద్దరు వ్యక్తుల అపసవ్య పనుల వల్ల జరిగింది. వాళ్లను అల్రెడీ లోపల వేశాం. వాళ్ల వెనుకాల ఎవరున్నారో తవ్వి తీస్తాం. కానీ నోటికొచ్చినట్టు మాట్లాడటం.. బర్తరఫ్ చేయడం దేనికి. నాకేం సంబంధం. అసలు ఐటీ డిపార్ట్‌మెంట్‌కు ఏం సంబంధం..? అసలు మీకేమైనా తెలుసా..? కామన్‌సెన్స్ ఉందా..? ఏది పడితే అది.. మతి లేని మాటలు మాట్లాడడమేనా..? అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
అక్కడ ఏ మంత్రినైనా బర్తరఫ్ చేశారా..?
అట్ల అంటే నేను ఒక మాట అడుగుతున్నా.. గుజరాత్ రాష్ట్రంలో ఎనిమిదేండ్లలో 13 పేపర్లు లీక్ అయ్యాయి. అక్కడ ఏ మంత్రినైనా బర్తరఫ్ చేశారా..? ఏ మంత్రి అయినా రాజీనామా చేసిండా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. మధ్యప్రదేశ్ లో వ్యాపం కుంభకోణం అని చెప్పి ముఖ్యమంత్రిపైనే ఆరోపణలు వచ్చాయి. ముఖ్యమంత్రి రాజీనామా చేసిండా..? అసోం లో నిన్నగాక మొన్న పోలీస్ రిక్రూట్‌మెంట్ పేపర్ లీక్ అయింది. ఎవరన్న మంత్రి రాజీనామా చేసిండా..? ఏం మాట్లాడుతారు నాకు అసలు అర్థం కాదు. ఎటు పడితే అటు.. నోటికొచ్చినట్టు వాగడమేనా..? తొమ్మిదేండ్లు పారదర్శకంగా నడిచిన సంస్థ. ఇద్దరు దుర్మార్గుల వల్ల తప్పు జరిగితే పిల్లల్ని రెచ్చగొట్టడం, నోటికొచ్చినట్టు మాట్లాడటం ఇష్టమొచ్చినట్లు బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సబబేనా..? అని కేటీఆర్ ప్రశ్నించారు