Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సీసీ కెమెరాల పర్యవేక్షణ లో పదవ తరగతి పరీక్షలు విద్యాశాఖ ప్రత్యేక దృష్టి

 

మహబూబాబాద్ బ్యూరో మార్చి 7 నిజం న్యూస్

హైదరాబాద్‌: పదోతరగతి వార్షిక పరీక్షలపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా గట్టి నిఘాకు చర్యలు చేపట్టింది. పరీక్షలన్నింటినీ సీసీ కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు ప్రతీ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలను అమర్చాలని అధికారులను ఆదేశించింది. సీల్‌ చేసిన ప్రశ్నపత్రాలను ఓపెన్‌ చేసినప్పటి నుంచి తిరిగి జవాబు పత్రాలను ప్యాక్‌ చేసే ప్రక్రియనంతా సీసీ కెమెరాలలో రికార్డు చేయాలని సూచించింది.

గత ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సెస్సీ పేపర్ల లీకేజీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కార్పొరేట్‌, ప్రైవేట్‌ సంస్థలలో ఈ తరహా లీకేజీకి పాల్పడవచ్చని అనుమానంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకొన్నది. ఈ కెమెరాలను చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్టుమెంట్‌ అధికారి గదుల్లో బిగించాలని ఆదేశించింది. ప్రభుత్వబడుల సెంటర్లన్నింటిలో సీసీ కెమెరాలు ఉండేలా చూడాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ ఏ కృష్ణారావు డీఈవోలకు ఆదేశాలిచ్చారు. పదో తరగతి పరీక్షలు ఏప్రిల్‌ 3 నుంచి 13 వరకు నిర్వహించనున్నారు. మొత్తం 5.1లక్షల మందికిపైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు.

 

సీసీ కెమెరాల వినియోగం, పర్యవేక్షణ ఇలా

 

పరీక్ష కేంద్రాల్లో 3 మెగా పిక్సెల్‌, 30 మీటర్ల రేంజ్‌, 180 డిగ్రీల వరకు కవర్‌చేసేలా సీసీ కెమెరా ఉండాలి.

పరీక్షల్లో రికార్డు అయిన డాటాను నిక్షిప్తంచేయాలి. పరీక్ష పూర్తయిన తర్వాత సాఫ్ట్‌కాపీని భద్రపరచాలి.

సీసీటీవీ పుటేజీలకు మానిటర్లను ఏర్పాటు చేసుకోవాలి.

ప్రైవేట్‌ బడుల సెంటర్లలో ఆయా యాజమాన్యాలు సొంతంగా సీసీ కెమెరాలను అమర్చుకోవాలి.

చీఫ్‌ సూపరింటెండెంట్లు పరీక్షల ఆఖరు రోజున సీసీటీవీ ఫుటేజీని సీల్డ్‌ కవర్‌లో భద్రపరిచి డీఈవోలకు అందజేయాలి.

సీసీటీవీ కెమెరాల కొనుగోలు లేదా కిరాయి కోసం జిల్లా కలెక్టర్ల సహకారం తీసుకోవాలి.

ఒక్కో కెమెరా కిరాయికి రూ.586, కొనుగోలు చేయాలనుకొంటే రూ.6,900 వెచ్చించవచ్చు.