తెలంగాణలో టి ఆర్ ఎస్ పేరిట మరొక పార్టీ
| తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన టీఆర్ఎస్ దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ఇప్పుడు బీఆర్ఎస్ గా కొత్త అవతారం ఎత్తింది.ఇప్పటివరకు రాష్ట్ర రాజకీయాలకే పరిమితం అయిన కేసీఆర్ బి జె పి ని సమర్ధవంతంగా ఢీ కొట్టేందుకు దేశ రాజకీయాల్లో అడుగుపెట్టారు. అంతటితో టీఆర్ఎస్ అనే పేరు రాష్ట్రవ్యాప్తంగా తెరమరుగైనట్టేనని అందరూ భావించారు. అయితే, ఇక్కడే ఎవరూ ఊహించని ట్విస్ట్ జరిగింది. తెలంగాణలో టీఆర్ఎస్ పేరుతో మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ వదిలేసిన టీఆర్ఎస్ పేరుతో రాష్ట్రంలో మరో కొత్త పార్టీ అవతరించనుందని రాజకీయ వర్గాలలో వార్తలు వస్తున్నాయి. టృశ్ అనే పేరు ద్వారా తెలంగాణ సెంటిమెంట్ ను తమకు అనుకూలంగా మార్చుకోవాలని బి ఆర్ ఎస్ లో అసంతృప్తితో వున్న కొందరు కీలక నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ రాజ్య సమితి లేదా తెలంగాణ రైతు సమాఖ్య పేరుతో రిజిస్ట్రేషన్ కు ప్రయత్నాలు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఉమ్మడి నల్గొండ, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలకు చెందిన కొందరు అసంతృప్త నేతలు ఈ పార్టీ ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే జరిగితే రాష్ట్ర రాజకీయాల్లో మరో పెను సంచలనం చోటు చేసుకోనుంది.
ఎందుకంటే తెలంగాణ ప్రజల నోళ్లలో టీఆర్ఎస్ పేరు నేటికీ నానుతుంది. ఈ క్రమంలో ఆ పేరుతో పార్టీ పెడితే బీఆర్ఎస్ కు నష్టం తప్పదు. ఒకవేళ టీఆర్ఎస్ పేరుతో పార్టీ రిజిస్టర్ చేయిస్తే బీఆర్ఎస్ కు నష్టం వాటిల్లే అవకాశాలు లేకపోలేదు. కారు గుర్తును కేటాయించనప్పటికీ కూడా టీఆర్ఎస్ పేరును కేటాయిస్తే మాత్రం రాజకీయంగా బీఆర్ఎస్ కు ఇబ్బందులు తప్పవు.
ఒకవేళ టీఆర్ఎస్ పేరుతో పార్టీ ఏర్పాటు జరిగితే అది రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనంగా మారనుంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పేరు ఫలితాలను తారుమారు చేసే అవకాశం లేకపోలేదు.
కొత్త పార్టీలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలు చేరే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక భాగస్వాములు కూడా కొత్త పార్టీలోకి వస్తారని తెలుస్తోంది. అంతేకాదు ఇటీవల బీజేపీలో చేరికకు రంగం సిద్ధం చేసుకుని మనీ కొందరు నాయకులు ఆగిపోవడానికి కారణం కొత్త పార్టీ టి ఆర్ ఎస్ అంటున్నారు. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో సెన్సెషన్‌గా మారిన పార్టీ వ్యవహారంలో పార్టీ పేరు, జెండా, అజెండా కూడా ఇంకా సంచలనం రేపుతున్నాయి.
సి.హెచ్.ప్రతాప్