Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రాష్ట్రంలో మరొక వైరస్ పంజా

తస్మాత్ జాగ్రత్త అంటున్న వైద్యులు
రాష్ట్రంలో ఇప్పుడు వైరల్ జ్వరాల బెడద ఎక్కువవుతొంది. దాదాపుగా ప్రతీ ఇంటిలో కనీసం ఒక్కరు ఒకరు జ్వరంతో బాధపడుతున్నారు. అదే పనిగా దగ్గు.. తోడుగా శ్వాసకోశ సమస్యలు.. జ్వరం. దీనికి దేశవ్యాప్తంగా పంజా విసురుతోన్న ఇన్‌ఫ్లుయెంజానే కారణం. కొవిడ్‌ వైరస్‌తో సుదీర్ఘ పోరాటం జరిపి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటుండగా.. దాదాపు అదే లక్షణాలతో..
మరోసారి ఇబ్బంది ఎదురవుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాగా, తాజా కేసులకు చాలావరకు ఇన్‌ఫ్లుయెంజా-ఏ ఉప రకం ‘హెచ్‌3ఎన్‌2’ వైరస్‌ కారణమని గుర్తించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తెలిపింది. ప్రతీ నలుగురిలో ఒకరు వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారు.

ఇతర ఉప రకాలతో పోలిస్తే ఈ వైరస్‌ ప్రభావం ఎక్కువని, దీంతో ఆస్పత్రుల్లో చేరికలు పెరుగుతున్నాయని పేర్కొంది.రాష్ట్రంలో ప్రతి నలుగురిలో ఒకరు జ్వరం,శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ లక్షణాలతో నల్లకుంటలోని ఫీవర్‌ ఆస్పత్రికి రోజూ వందల మంది వస్తున్నారు.ఇక్కడ తాకిడికి రోగులందరినీ పరీక్ష చెయ్యలేక ఆస్పత్రి యజమాన్యం చేతుల్లెత్తేసింది. దానితో బాధితులు ఇప్పుడు ప్రైవెట్ ఆస్పత్రుల వెంట పడ్డారు.
దేశవ్యాప్తంగా దగ్గు, జలుబు, వికారం వంటి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విచక్షణారహితంగా యాంటీబయాటిక్స్‌ వాడొద్దని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) సూచించింది. వైరస్‌ బారిన పడకుండా పాటించాల్సిన జాగ్రత్తల జాబితాను ఐఎంసీఆర్‌ విడుదల చేసింది.

అయితే కొత్తగా వైరల్ జ్వరాలు పెరుగుతున్న నేపధ్యంలో మరో కొత్త వైరస్ ఉనికి ప్రపంచాన్ని భయపెడుతోంది. మరో ముప్పు పొంచి ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ ఆఫ్రికా దేశం ఘనాలో తాజాగా ఓ కొత్త వైరస్ వ్యాపిస్తోంది. ‘మార్ బర్గ్’ గా వ్యవహరిస్తున్న ఈ వైరస్ కేసులు ప్రస్తుతం ఘనాలో రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) అప్రమత్తమైంది. ఈ వైరస్ పట్ల కేంద్ర ప్రభుత్వం కూదా అప్రమత్తమయ్యింది.ప్రస్తుతం వైరల్ జ్వరాలకు, మార్బర్గ్ కు ఎటువంటి సంబంధం లేదని, జాతీయ వైద్య మండలి పేర్కొంది.

వాతావరణంలో హఠాత్తుగా చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా వైరల్‌ ఇన్ఫెక్షన్స్‌ తాకిడి తీవ్రమవుతోందని డాక్టర్లు అంటున్నారు. ఈ వైరస్‌ కారణంగా గొంతులో నొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జలుబు, జ్వరం వంటి లక్షణాలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. వీటి నుంచి బయటపడాలంటే నెల రోజులు పడుతుంటే అర్థం చేసుకోవచ్చు ఈ వైరస్‌ ఎంతటి ప్రమాదకారో. ఇంజెక్షన్లు, యాంటీ బయోటిక్స్‌ ఎన్ని తీసుకున్నా ఉపశమనం కనిపించడం లేదని చాలా మంది ఆందోళన చెందుతున్నారు.

కాలుష్యంతో పాటు కొవిడ్‌ కారణంగా చాలా మందిలో రోగనిరోధక శక్తి సన్నగిల్లడం ఈ బాధలకు కారణమని డాక్టర్లు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి రోగుల సంఖ్య గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణాల్లో అధికంగా కనిపిస్తోంది. కొందరిలో స్వైన్‌ ఫ్లూ లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ లక్షణాలు వృద్ధులు, బలహీనతతో బాధపడే వారిలో కనిపిస్తున్నాయి.

సి.హెచ్.ప్రతాప్