Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పల్లెల్లో తిరిగి యధేచ్చగా నాటుసారా తయారీ

నాటు సారాతో గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. దానితో గతంలో సారాను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలను చేపట్టింది. సారా తయారీ కేంద్రాలను పూర్తిగా నిర్మూలిస్తూ సారా తయారు చేసే వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను చూపి పూర్తిగా సారారహిత రాష్ట్రంగా తయారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది.సారా తయారీ దారులకు ఆర్థికసహాయం చేసి పలు ఉపాధి మార్గాలను చూపించింది.

అయితే ఈ కార్యక్రమం కొంత కాలం పాటు ఫలితం ఇచ్చిన్నా.. మళ్ళీ తిరిగి సారా కేంద్రాలు పురుడు పోసుకుంటున్నాయి. తెలంగాణా రాష్ట్రంలో మారుమూల గ్రామాల్లో విచ్చలవిడిగా సారా తయారీ ప్రారంభం అయ్యింది..
సారా తయారీ కేసుల్లో పట్టుబడి ప్రత్యామ్నాయ ఉపాధి కింద సాయం పొందినవారు సైతం మళ్లీ సారా తయారీదారులుగా అవతారం ఎత్తుతున్నారు. గ్రామీణ ప్రాంతాలు తండాలో యదేచ్చగా సారా తయారీ జరుగుతూనే ఉంది. ఏటా వందల సంఖ్యలో కేసులు నమోదవుతుండడంతో పూర్వస్థితి వచ్చే ప్రమాదం ఉందని రెవెన్యూ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సారాకు ప్రత్యామ్నాయంగా మద్యం ఉన్నప్పటికీ ఇటీవల రెండు సార్లు మద్యం ధరలు పెరగడం, అనధికారికంగా బెల్ట్ దుకాణాల్లోనూ ధరలు మరింత పెరిగి, మద్యంపైఅధిక ధరలు వసూలు చేస్తుండదం వలన గతంలో సారా తాగేవారు మళ్లీ సారా కొనుగోలు చేసి తాగేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

మద్యం నిషేధం ఆబ్కారీ శాఖ అధికారులు సారా తయారీ స్థావరాలపై పలుమార్లు దాడి చేసి కేసులు నమోదు చేస్తున్నా మార్పు రావడం లేదు.
రాష్ట్రంలో పలు మండలాల్లో కొత్తవారు సైతం సారా తయారీ, విక్రయాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. సార తయారీపై అధికారులు ఉక్కు పాదం మోపడంతో జిల్లాలో ఏటా వందల సంఖ్యల కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. వేలాది లీటర్ల సారా సీజ్ చేస్తుండడం సారా తయారీలో ఉపయోగించే బెల్లం పానకాన్ని ధ్వంసం చేయడం జరుగుతూనే ఉంది. అయినప్పటికీ తయారీదారులు విక్రయాల్లో మార్పు రావడం లేదు.
రాష్ట్రంలోని పల్లెల్లో సారా మళ్లీ ఏరులై పారుతోంది. నల్లబెల్లం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. సారాకు బానిసై జనం అటు జేబులను ఇటు ఆరోగ్యాన్ని గుల్ల చేసుకుంటున్నారు. అధికారుల అమ్యామ్యాలతో సారా తయారీ మళ్లీ ఊపందుకుంటోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.కొన్ని ప్రాంతాల్లో నల్లబెల్లం దొరక్కపోవడంతో చక్కెర వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని చోట్ల మొలాసిస్‌తో నాటు సారా కాస్తున్నారు. కల్తీ సారాతో కొందరు ఆస్పత్రుల పాలవుతుంటే ఇంకొందరు ప్రాణాలు కోల్పోతున్నారు.
అయితే సారా మహమ్మారి మళ్ళీ పెరిగితే ప్రజల ఆరోగ్యంపై ఆర్థిక స్థితిగతులపై తీవ్రమైన ప్రభావం పడే ప్రమాదం ఉంది. ఎక్సైజ్ అధికారులు దృష్టి పెట్టి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

సి.హెచ్.ప్రతాప్