మహిళలకు రక్షణ ఏది ???
ప్రత్యేక కధనం: సి.హెచ్.ప్రతాప్
మెడికో స్టూడెంట్ ప్రీతి హృదయవిదారక ఘటన మరువకముందే.. ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్థిని బలికావడం తెలంగాణా రాష్ట్రంలో సంచలనంగా మారింది. తోటి విద్యార్థి వేధింపులు తాళలేక అదే వరంగల్ జిల్లాలో..
రక్షిత అనే 20ఏళ్ల ఇంజినీరింగ్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఓ ఉన్మాది ప్రేమ, పెళ్ళి, సహజీవనం అంటూ వేధిస్తుండటంతో రక్షిత ఆత్మహత్య చేసుకున్నదని ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేసారు. భూపాలపల్లికి చెందిన శంకరాచారి, రమ దంపతుల కూతులు రక్షిత నర్సంపేట లోని జయముఖి ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీ మూడవ సంవత్సరం చదువుతోంది. అయితే, రక్షితకు చెందిన ఫొటోలను రాహుల్ అనే వ్యక్తి మార్ఫింగ్ చెసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని వేధించడంతో మనస్తాపం చెందిన యువతి.. వరంగల్ నగరంలోని తన బంధువుల ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
అయితే, అంతకుముందే రాహుల్ వేధింపులు ఎక్కువవ్వడంతో హాస్టల్‌లో ఉండలేనంటూ రక్షిత తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు బంధువుల ఇంట్లో ఉంచి చదివిస్తున్నారు. ఆదివారం బంధువుల ఇంట్లోనే ఉన్న రక్షిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా, సమాచారం అందుకున్న పోలీసులు రక్షిత మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎంజీఎంకి తరలించారు.
ప్రీతి లాగే తమ కూతురు కూడా సీనియర్ల వేధింపులకు బలయిందని తల్లిదండ్రులు రోదిస్తున్నారు. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన పీజీ విద్యార్థి ప్రీతి సీనియర్ వేధింపులు తాళలేక లేక ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి నిమ్స్ లో కన్నుమూసింది. ఈ రెండు ఘటనలు వరంగల్ జిల్లాలోనే జరగడం కలకలం రేపుతోంది. రాష్ట్రంలో ఆంటీ రాగింగ్ చట్టం అమలులో దారుణంగా విఫమయ్యిందని అసంఖ్యాక విద్యార్ధులు ఆరోపిస్తున్నారు.
డిజిటల్ మీడియాను ఇష్టం వచ్చినట్లు వాడుకోవదం ఇప్పుడు పరిపాటి అయ్యింది.కొంతమంది పిరికిగాళ్లు సోషల్‌మీడియాలో ఫేక్ నేమ్స్‌తో అమ్మాయిలే టార్గెట్‌గా అడ్డమైన పోస్టులు పెడుతుంటారు. మరికొంతమంది సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్‌ను బెదిరింపులకు వాడుకుంటారు. నేను చెప్పింది చేయకపోతే.. నా మాట వినికపోతే.. నన్ను ప్రేమించకపోతే నీ ఫోటోలు మార్ఫ్ చేసి ఫేస్‌బుక్‌లో పెడతానని..లేకపోతే వేరే అతనితో నువ్వు దిగిన ఫోటోను పబ్లిక్‌గా అప్‌లోడ్ చేస్తానంటూ బ్లాక్‌మెయిలింగ్ చేస్తారు. తాజాగా వరంగల్ జిల్లా నర్సంపేటలో బీటెక్ స్టూడెంట్ రక్షితఆత్మహత్య ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది.
హైస్కూలు రోజుల్లోనే ఆమెకు పరిచయమైన రాహుల్ కొంత కాలంగా ఆమెను వేధిస్తున్నాడు. ప్రేమించకపోతే ఫోటోలు సోషల్‌మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు దిగాడు. భూపాలపల్లి పోలీసులను ఆశ్రయించగా రాహుల్ కు పోలీసులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా రాహుల్‌లో ఏ మార్పు లేదు..కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న రాహుల్ దగ్గర నుంచి మళ్లీ అవే బెదిరింపులొచ్చాయి. అదే సమయంలో రక్షిత మరో స్టూడెంట్‌తో కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రక్షిత వరంగల్ సిటీలోని తన బంధువుల ఇంటికొచ్చింది. అక్కడే ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
రాగ్యింగ్, సొషల్ మీడియా ను తప్పుడు పోకడలకు వాడకుండా ప్రభుత్వాలు చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి.