Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

 ఎయిమ్స్‌ నిర్మాణం పూర్తయ్యేదెప్పుడు ?

తెలంగాణలోని బీబీనగర్‌ ఎయిమ్స్‌ పనులు నత్త నడకన సాగుతున్నాయి. ఎయిమ్స్‌ను మంజూరు చేశారు తప్ప.. దాని నిర్మాణాన్ని పట్టించుకోవట్లేదని వైద్య నిపుణులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చెస్తున్నారు. ఈ ఆస్పత్రి గనక సాకారం అయితే రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజలకు అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలు లభ్యమవుతాయి. బీబీనగర్‌లో ఎయిమ్స్‌ నిర్మాణానికి 2018 డిసెంబర్‌ 17న కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది కాగా వేయి కోట్లతో అత్యాధునిక వసతులతో ఆసుపత్రిని 2022 నాటికి నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే ఈ ఆసుపత్రి మొదటి నుండి బాలారిష్టాలను ఎదుర్కొంటొంది. 2022 జూలై వరకు కనీసం పనులు మొదలుపెట్టలేదు.నేటికి కేవలం 5 శాతం పనులు మాత్రం పూర్తవడం ఈ ప్రోజెక్టు అమలు పట్ల కెంద్ర నిర్లక్ష్య వైఖరికి దర్పణం పడుతొంది. తెలంగాణకు ఎయిమ్స్‌ను మంజూరు చేశాం తప్ప..దాని నిర్మాణాన్ని పట్టించుకోవడం లేదని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఒప్పుకోవడం గమనార్హం. బీబీనగర్‌ ఎయిమ్స్‌కు విడుదల చేసిన నిధులపై ఆర్టీఐ కార్యకర్త ఇనగంటి రవికుమార్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా సమాచారం ఇచ్చింది. ఆలశ్యం కారణంగా వ్యయం అంచనాలు 1365 కోట్లకు పెరగగా ఇప్పటివరకూ కేంద్రం విడుదల చేసిన నిధులు కేవలం 156 కోట్లు. మరోవైపు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మంజూరైన ఎయిమ్స్‌లకు మాత్రం భారీగా నిధులు విడుదల చేశారన్న విమర్శలున్నాయి. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఎయిమ్స్‌ నిర్మాణానికి 2019 జనవరి 10న క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. దీని నిర్మాణ వ్యయం రూ.1,195 కోట్లు. తెలంగాణ తర్వాత మంజూరైన ఈ ఎయిమ్స్‌కు కేంద్రం ఇప్పటివరకూ రూ.622 కోట్లు మంజూరు చేసింది. అంటే 52 శాతం నిధులు ఇచ్చేసింది.
హిమాచల్‌ప్రదేశ్‌లో ఎయిమ్స్‌ నిర్మాణానికి 2018 జనవరి 3న కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. అప్పుడు హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వమే ఉన్నది. రూ.1,471 అంచనా వ్యయం కాగా.. ఇప్పటివరకూ రూ.1,407 కోట్లు మంజూరు చేసింది. అంటే 96 శాతం నిధులను ఇచ్చేసింది.
జార్ఖండ్‌కు 2018 మే 16న ఎయిమ్స్‌ను మం జూరు చేసింది. అప్పుడు బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది. 2019 ఎన్నికల నేపథ్యంలో భారీగా నిధులు విడుదల చేసింది. దీని నిర్మాణ వ్యయం రూ.1,828 కోట్లు కాగా, ఇప్పటివరకూ రూ.793 కోట్లు విడుదల చేసింది. అంటే 43 శాతానికిపైగా నిధులు ఇచ్చింది.తాజాగా శుక్రవారం అడిగిన ప్రశ్నకు బదులిస్తూ నిర్మాణ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే నిర్మాణ పనులు ఎప్పటి వరకు పూర్తవుతాయన్న విషయంపై మాత్రం సమాధానంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపర్చిన హామీలను 10 ఏళ్లలోగా పూర్తిచేయాలని ఉందని, అలాంటి హామీల్లో బీబీనగర్ ఎయిమ్స్ ఒకటి. వచ్చే ఏడాది అక్టోబర్‌ నాటికి పూర్తి చేస్తామని కేంద్రం ఇటీవల ప్రకటించింది కాని 20 నెలల్లో 88శాతం నిధులు విడుదల చేసి.. 95 శాతం పనులు పూర్తి చేయడం అసాధ్యమంటున్నారు వైద్య నిపుణులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయ సంఘర్షణ వైఖరిలో ప్రజలు పావులవడం నిజంగా దురదృష్టం.

పేద ప్రజల పాలిటి సంజీవని అయిన ఎయిమ్స్ నిర్మాణం వేగవంతం అయ్యేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలి.

సి.హెచ్.ప్రతాప్