జోరుగా ఇసుక అక్రమ రవాణా

మాడ్గుల ఫిబ్రవరి 27 (నిజం న్యూస్ ):
మండల పరిధిలోని ఇర్విన్ , కలకొండ , చంద్రాయన్ పల్లి , నాగిళ్ల ,మాడ్గుల , కొలుకులపల్లి , ఆర్కపల్లి , అన్నె బోయినపల్లి , అందుగుల , సుద్దపల్లి గ్రామాల సమీపంలోని వాగుల నుండి ఇసుక మాఫియాకు చెందిన కొందరు వ్యక్తలు విచ్చలవిడిగా ఎలాంటి అనుమతులు లేకుండా పగలు రాత్రి అనే తేడా లేకుండా అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు . ఇదే సమయంలో వెల్దండ మండలం అజిలాపూర్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు , ఆమనగల్లు మండలం శెట్టిపల్లి , ముదివెన్ గ్రామాలకు చెందిన కొందరు వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రి వేళలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని వారు చెప్పారు . మాడుగుల మండలంలో పోలీస్ అధికారులు మూడు వాహనాలలో 24 గంటలు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న వారికి ఈ వాహనాలు కనిపించకపోవడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోంది . అప్పుడప్పుడు పట్టుబడే వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించి నామమాత్రంగా కేసులు నమోదు చేసి తాసిల్దార్ ఎదుట బైండోవర్ చేస్తుండడంతో ఇసుక మాఫియాకు భయం లేకుండా పోతుందని అన్నారు . నిబంధనల మేరకు ఒకటికంటే ఎక్కువసార్లు పట్టుబడిన వాహనాలను సీజ్ చేసి సంబంధిత ఇసుక అక్రమ రవాణా చేసిన వ్యక్తులను కోర్టులో హాజరు పరిచి జైలుకు పంపించాల్సి ఉండగా అధికారులు నామమాత్రపు కేసులు నమోదు చేస్తుండడంతో ఇసుక మాఫియా కు చెందిన వ్యక్తులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా రని వారు పేర్కొన్నారు . కొందరు తమ రాజకీయ అనుభవంతో ఉన్నత స్థాయి అధికారులకు బడా లీడర్లతో ఫోన్ చేయించి పోలీస్ శాఖ వారిపై ఒత్తిడి తెస్తున్నారని విమర్శలు సైతం మండలంలో వినిపిస్తున్నాయి . ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి ఇసుక మాఫియా పై ఉక్కు పాదం మోపాలని పలువురు మండల ప్రజలు కోరుతున్నారు .