తెలంగాణాలో దూకుడు పెంచుతున్న వామపక్షాలు

సరిలేరు మాకెవ్వరూ…
మొన్నటి మునుగోడు ఉపఎన్నికల్లో బి జె పి ని ఓడించేం ఏకైక లక్ష్యంగా వామపక్షాలు బి ఆర్ ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చి బి ఆర్ ఎస్ అభ్యర్ధి విషయంలో కీలక పాత్ర వహించాయి.ఆ ఎన్నికల్లో.. గులాబీ పార్టీ తన పూర్తి కేడర్ను వినియోగించినా కేవలం 10 వేల మెజార్టీ మాత్రమే తెచ్చుకోగలిగింది. ఈ నియోజకవర్గంలో వామపక్షాల మద్దతు దారులు 20 వేలకు పైగా వున్నారని, వారి ఓట్లు బి ఆర్ ఎస్ కు గంపగుత్తగా పడడం వలనే బి ఆర్ ఎస్ గెలిచిందనేది విస్పష్టం. అంటే ఇక్కడ విపక్షాలకు బి ఆర్ ఎస్ కంటే ఎక్కువ మద్దతు దార్లు వున్నారు. కేవలం వామపక్షాల దయ వలనే బి ఆర్ ఎస్ అభ్యర్ధి ఒడ్డున పడ్డారనేది ఓపెన్ సీక్రెట్.. అప్పటినుంచి నల్లగొండ జిల్లా సహా తెలంగాణవ్యాప్తంగా కమ్యూనిస్టుల గ్రాఫ్ తోపాటు.. ప్రాధాన్యత అమాంతంగా పెరిగిందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే వామపక్షాల్లో ముఖ్యంగా సీపీఎం అడుగు ముందుకేసి.. అనుబంధ సంఘాలను యాక్టివ్ చేస్తోంది. రైతు సంఘాలు, కార్మిక సంఘాలు సహా అని విభాగాల్లో పునరుజ్జీవం పోస్తోంది. వచ్చే ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా తమకు బలం వున్న నియోజకవర్గాలన్నింటిలో తమ అభ్యర్ధులను నిలబెట్టాలని, ఒకవేళ పొత్తులు కుదరకపోయినా, స్వతంత్రంగానైనా పోటీ చేయాలని ఉమ్మడి వామపక్షాలు నిర్ణయించాయి. మాకు ఎదురే లేదు, మాకు ఎవ్వరి ప్రాపకం అకర్లేదని ఇటీవలి పోలీట్ బ్యూరో సమావేశంలో సి పి ఎం అధినాయకత్వం ఘనంగా ప్రకటించింది.గతంలో నల్లగొండ జిల్లా పరిధిలో.. వామపక్ష పార్టీలైన సీపీఎం, సీపీఐలకు గట్టి పట్టు ఉండేది. “నల్లగొండ”, “నకిరేకల్”, “మిర్యాలగూడ” అసెంబ్లీ సెగ్మెంట్లలో.. సీపీఎం పలుమార్లు విజయం సాధించింది. సీపీఐ సైతం.. దేవరకొండ, మునుగోడు సెగ్మెంట్లలో గెలుపుబావుట ఎగరేసింది. 2014 నుంచి 2022 మునుగోడు ఉప ఎన్నిక వరకు.. గులాబీ పార్టీతో వామపక్షాలకు చాలా గ్యాప్ ఉండేది. కానీ మునుగోడనే బలమైన అవసరం వీళ్లను కలిపింది. ఉప ఎన్నిక షెడ్యూల్ రాగానే కె సి ఆర్ వెళ్ళి వామపక్షాల మద్దతు అర్ధించి విపక్షాల కంటే ఒక అడుగు ముందుకేసారు.
వచ్చే ఎన్నికలను దృష్టిలో వుంచుకొని వామపక్షాలు రాష్ట్రంలో తమ దూకుడు పెంచాయి. గ్రామస్థాయిలో పార్టీ శాఖలను బలోపేతం చేస్తూ.. మండల, నియోజకవర్గస్థాయి పార్టీ కమిటీల అనుబంధ సంఘాల సమావేశాలతో బిజీగా ప్రస్తుతం వామపక్షాలు చురుకుగా వున్నాయి.. దీంతోపాటు స్థానిక ప్రజా సమస్యలపై కూడా దృష్టి సారించి.. పాదయాత్రలు, ఆందోళన కార్యక్రమాలతో దూకుడు పెంచుతున్నాయి. వీటితోపాటు దామరచర్ల ప్రాంతంలో అర్హులైన లబ్ధిదారులకి “పోడు భూములను” ఇవ్వాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. గిరిజనులు ఎక్కువగా ఉన్న మిర్యాలగూడ ప్రాంతంలోనే.. పార్టీ జాతీయ నాయకురాలు బృందాకారత్ ముఖ్యఅతిథిగా.. త్వరలోనే ‘రాష్ట్రస్థాయి గిరిజన మహాసభలు’ ఏర్పాటు చేస్తున్నారు. కమ్యూనిస్టులకు ప్రజాసమస్యల మీద ఆందోళనలు చేపట్టడం కొత్త కాదు. ఇంకా చెప్పాలంటే వారుండబట్టే చాలా సమస్యలు కనీసం పాలకుల దృష్టిలోకి వెళ్తున్నాయనుకోవాలి. అయితే కొత్త మిలీనియంలో మాత్రం వామపక్షాల జోరు బాగా తగ్గింది. వారు కూడా బూర్జువా పార్టీల సరసన చేరి ఒకటో రెండో సీట్లతో సరిపెట్టుకుంటున్నారు. ఉద్యమాలను తగ్గించేశారు అన్న భావన అంతటా ఉంది. కానీ కాలం ఎపుడూ ఒకేలా ఉండదు. తెలంగాణాలో మళ్ళీ మా ప్రాభవం మొదలయ్యింది. వచ్చే ఎన్నికలలో మా సత్తా చాటుతాం అని వామపక్షాలు బల్ల గుద్ది మరీ చెబుతున్నాయి.
సి.హెచ్.ప్రతాప్