పాలమూరులో నువ్వా నేనా ?

సై అంటే సై అంటున్న ప్రధాన పార్టీలు
తెలంగాణా లో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా సిద్ధంగా వుండాలన్న సంకేతాలను ప్రధాన రాజకీయ పార్టీలు తమ కేడర్ కు పంపించాయి.
ఈ నేపధ్యంలో ప్రతీ జిల్లాలో తమ ఓట్ బ్యాంకును సుస్థిరం చేసుకీవడం తో పాటు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో బలమైన అబ్యర్ధుల కోసం వేట ప్రారంభించాయి. గత కొద్ది రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే రాజకీయ పార్టీలన్నీ ఉమ్మడి పాలమూరుపైనే ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో బీఆర్ఎస్, దేశంలో బి జె పి పాలిత రాష్ట్రాలలో లాగే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే తెలంగాణ అభివృద్ధి సాధిస్తుందంటూ బీజేపీ, రాహుల్ గాంధీ చేపట్టీన భారత్ జోడో జోష్ తో పార్టీ పునర్వైభవాన్ని చాటుకునేందుకు కాంగ్రెస్ పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో రాజకీయ సందడి నెలకొంది.
ఇప్పుడు ప్రధాన నేతలందరూ పాలమూరు చుట్టూ ప్రదిక్షనలు చేస్తున్నారు. పోటా పోటీ సభలు నిర్వహిస్తున్నారు.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంగా క్రియాశీలక రాజకీయాలకు ఆయా పార్టీలు శ్రీకారం చుట్టడం ఇప్పుడు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.అధికార బి ఆర్ ఎస్ వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల నేతలు నిత్యం ప్రజల్లో ఉంటూ.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. రోజూ ఏదో ఒక సంక్షేమ పధకం ప్రారంభోత్సవం కోసం మంత్రులు ఈ జిల్లాకు వస్తున్నారు. త్వరలో కె సి ఆర్ ఇక్కడ ఒక బహిరంగ సభ కూడా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఇతర పార్టీల నుండి కీలక నేతలను చేర్పించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.. సీఎం కేసీఆర్ ఏడాది మొదటి వారంలో మహబూబ్ నగర్ కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వచ్చారు. మంత్రి కేటీఆర్ ఇటీవలే నారాయణపేటలో వివిధ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. స్థానిక మంత్రి శ్రీనివాస్ గౌడ్ త్వరలోనే మున్సిపాల్ వార్డుల పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఇక బి జె పి విషయానికి వస్తే అధికారంలోకి రావాలనే లక్ష్యంతో దూకుడుగా వ్యవహరిస్తున్న బీజేపీ.. ప్రధానంగా పాలమూరు పైనే దృష్టి పెట్టింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత ప్రజాసంగ్రామయాత్ర ఆలంపూర్ జోగులాంబ ఆలయం నుంచే మొదలుపెట్టారు. యాత్ర సమయంలో ప్రజా సమస్యల్ని నోట్ చేసుకున్నారు. బి జె పి అధికారం లోకి వస్తే పాలమూరు జిల్లా స్వరూపాన్నే మార్చేస్తామని అవాగ్దానాలు గుప్పిస్తున్నారు. అప్పటినుంచే బీజేపీ ముఖ్య నాయకులు తరచు జిల్లాలో ఎక్కడో చోట పర్యటిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు మహబూబ్ నగర్ వేదికవడం కూడా బీజేపీ ఫోకస్ ను తెలియజేస్తోంది. అన్ని రంగాలలో వైఫల్యం అయిన బి ఆర్ ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని ప్రాచారం చేసుకుంటునే కేంద్ర పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించేలా ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో బండి సంజయ్ ఈ జిల్లా అంతటా పర్యటించి ప్రజలతో మమేకం అయ్యేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అంతేకాక చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ పాలమూరు జిల్లాలో ఇతర పార్టీలలో అసంతృప్తులను టార్గెట్ చేసి వారిని బి జె పి వైపుకు తిప్పుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ సైతం పాలమూరుపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ఇటీవల బిజినపల్లిలో జరిగిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభకు భారీ ఎత్తున జనం రావడంతో శ్రేణుల్లో ఉత్సాహం నిండింది. రాహుల్ జోడో యాత్ర జిల్లాలో విజయవంతం కావడంతో ఆ జోష్ తో రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాపంచుతున్నారు. . ఇలా ఎవరికి వారు ఉమ్మడి పాలమూరు కేంద్రంగా రాజకీయంగా పై చేయి సాధించేందుకు వ్యూహాలను పన్నుతున్నారు. మొత్తం మీద పాలమూరు జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కినట్లు కనిపిస్తోంది.
సి.హెచ్.ప్రతాప్