Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

విజయం పై ధీమా… ఎవరి లెక్కలు వారివే

తెలంగాణాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. షెడ్యూలు ప్రకారం మరో పది నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగాల్సి వుంది. కె సి ఆర్ ముందస్తు కు కూడా వెళ్ళవచ్చుననే ఊహాగానాలు ఊపందుకున్న నేపధ్యంలో ప్రధాన పార్టీలన్నీ వ్యూహరచనలో తనమునకలై వున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. పాదయాత్రలు, పబ్లిక్ మీటింగ్స్, స్టేజ్ కార్నర్ మీటింగ్స్ తో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలు పోటా పోటిగా ప్రజల్లోకి వెళ్తున్నారు. . రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీ గా ఉండాలి అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఎవరికి వారే తమదే అధికారం అంటుండగా షర్మిళ పార్టీ సైతం తన పార్టీ ప్రత్యర్ధులకు పెద్ద ఎత్తున సవాల్ విసిరే స్థాయిలో వుందని, కనీసం 40 స్థానాలలో గెలుపోటములను నిఋనయించే స్థితిలో వున్నామన్న ధిమాతో వుంది. ఇక మూడోసారి హ్యట్రిక్ విజయం తో అధికారం ఖాయమంటూ బీఆర్ఎస్ ధీమాతో ఉండగా , టి ఆర్ ఎస్ ను మట్టి కరిపించి తామే అధికారంలోకి వస్తామంటూ ప్రధాన ప్రతిపక్షపార్టీలు కాంగ్రెస్ , బీజేపీలు అధికారపక్షానికి సవాల్ విసురుతున్నాయి. సందెట్లో సడేమియా లా అటు కాంగ్రెస్ ఎంపీ కొమటిరెడ్డి వ్యాఖ్యలతో ఒక్కసారిగా తెలంగాణా పార్టీల్లో అలజడి రేగింది. ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటదు సెక్యూలర్ పార్టీలు పొత్తు పెట్టుకోవాల్సిందేనంటూ కొమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లోనే కాక మిగితా పార్టీలలో కలకలం రేపింది.

మొదటి రెండు ఎన్నికలలో సునాయసంగా విజయం సాధించిన బీఆర్ఎస్ పార్టీ ఇసారి విజయం సాధించడం అనుకున్నంత సులువు కాదన్న విషయం అర్ధం చేసుకుంది. పార్టీ కీలక నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు మంత్రులు ఇప్పటికే మోజార్టీ జిల్లాల్లో పలు అబివృద్ది పనుల ప్రారంభోత్సవం ,శంకుస్థాపనలపేరుతో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. సంక్షేమ ,అభివృద్ది పధకాలు, రైతుబందు, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాలు తమకు మళ్లి విజయాన్ని చేకూరుస్తాయంటున్నారు.తెలంగాణా అభివృద్ధి మోడల్ దేసానికే స్పూర్తిదాయకం అంటూ వందసీట్లు గ్యారంటీ అంటూ పదే పదే ఎమ్మెల్యేల్లో ఆత్మస్తైర్యం నింపుతున్నారు కేసీఆర్ . అయితే దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు హ్యాట్రిక్ గెలుపు కోసం పోరాడాల్సి ఉంది. మెజార్టీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ల పై వ్యతిరేకత ఉందని కె సి ఆర్ చేయించిన సర్వే సారాంశం..

ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను మారుస్తారా లేదా కొత్తవారికి అవకాశం ఇస్తారా అన్నది చర్చనీయాంశమే.. మరో పదిహేను నియోజకవర్గాల్లో ఆదిపత్యపోరు నెలకొని ఉంది. ఎమ్మెల్సీ లు ఎమ్మెల్యేలు గా పోటి చేసేందుకు రెడి అవుతున్నారు. మరికొన్ని చోట్ల కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోచేరిన ఎమ్మెల్యేల సీట్లలో ..అసమ్మతి నెలకొని ఉంది.

టి ఆర్ ఎస్ కు టక్కర్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి హాత్ సే హత్ జోడో పాదయాత్ర ప్రారంబించారు. క్షేత్రస్తాయి లో ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్ కు లాభిస్తోందనే దీమాతో ఉన్నప్పటికి.. పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఒకింత డ్యామెజ్ చేస్తున్నాయనే చెప్పవచ్చు.పార్టీలో క్రమశిక్షణ పూర్తిగా లోపించింది. సీనియర్లందరూ ఎవరికి వారే యమునా తీరే అన్న చందాన వ్యవహరిస్తున్నారు. రేవంత్ రెడ్డి తో పాటు సీనియర్లను సమన్వయం చేసే బాధ్యతను ఇంచార్జీ ఠాక్రే తీసకుంటున్నప్పటికి.. ఆశించిన స్థాయిలో ఐక్యత రావడం లేదు. అటు 2014 తర్వాత ఒక్క ఎన్నికలో కూడా గెలవకుండా వరుస ఓటములతో పార్టీ క్యాడర్ నిస్తేజంలో ఉంది. ఉప ఎన్నికలు,జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో పత్తాలేకుండా పోయింది. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తే.. ప్రత్యామ్నాయ పార్టీగా తమను ఎంచుకొంటారనే ఒక్క దీమాతో పార్టీ కనిపిస్తోంది..

ఇక బీజేపీ హైకమాండ్ జీహెచ్ ఎంసీ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో తెలంగాణ పై దృష్టి పెట్టింది. హైదరాబాద్ ,రంగారెడ్డి తోపాటు ఉత్తర తెలంగాణలో కొన్ని చోట్ల బలంగా ఉంది.. . బండి సంజయ్ పాదయాత్ర పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపింది. ఇప్పుడు స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ తో పదకొండు వేల సమావేశాలు ఏర్పాటు చేశారు. పలునియోజకవర్గాల్లో ఇప్పటికే మీటింగ్స్ సైతం నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో బలమైన క్యాదర్ ను నిర్మించుకొని వరుస సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపి, ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకోవాలని బి జె పి తీవ్రంగా కసరత్తు చేస్తోంది.

సి.హెచ్.ప్రతాప్