Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తోటకు జగన్ మంత్రివర్గంలో పీట !

*తోట త్రిమూర్తులకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే ఫ్యాను స్పీడు పెంచుతాడన్న ధీమా
*ప్రతిపక్షాల విమర్శలకు దీటుగా సమాధానం చెప్పగలిగే ఫైర్ బ్రాండ్ మంత్రులు ఎవరూ మంత్రివర్గంలో లేకపోవడం లోటు
*తోట గాలితో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని ఫ్యాన్ కిందకి తీసుకురావొచ్చన్న ఉద్దేశ్యం.
*మంత్రి పదవి ఇచ్చినట్లయితే ఉమ్మడి గోదావరి జిల్లాలలో వైసీపీ జెండాను రెపరెపలాడించే బాధ్యతను తోట భుజాన వేసుకుంటాడన్న నమ్మకం.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇన్చార్జి; గవర వెంకటరమణ రామచంద్రపురం, ఫిబ్రవరి 21 (నిజం న్యూస్)

“తోట త్రిమూర్తులు” తన పేరులోనే త్రిమూర్తులను పెట్టుకున్న నాయకుడు, ఏ పార్టీ కైనా తను కావాలని అనిపించే నాయకుడు. ఉమ్మడి గోదావరి జిల్లాల లోనే కాక, ఉభయ తెలుగు రాష్ట్రాల లోనూ కాపు సామాజిక వర్గానికి ప్రతినిధిగా ఉన్న ఏకైక నాయకుడు తోట. మంత్రి పదవి లేకపోయినా మంత్రి దర్పంతోనే తిరిగే నాయకుడు. తోట త్రిమూర్తులకు మంత్రి పదవి నాటి తెలుగుదేశం పాలన నుంచీ తీరని కోరికగానే మిగిలింది. మరోవైపు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికలలో 175 కి 175 సీట్లను సాధించాలని ‘వై నాట్’ అనే పాలసీతో ముందుకు సాగుతున్నారు. అందుకు అనుగుణంగానే నిర్ణయాలు వేగవంతంగా తీసుకుంటున్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సైతం తిరుగులేని సామాజిక సమన్వయాన్ని పాటించారు. దీనిలో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం మంత్రి వర్గం లో భారీగానే మార్పులు, చేర్పులు చేసేందుకు సమాయత్తమవుతున్నారు సీఎం జగన్. అయితే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా వచ్చే ఎన్నికల్లో సత్ఫలితాలను సాధించగలుగుతారన్న భరోసా కనిపించిన నాయకులను ఉన్నపలంగా మంత్రివర్గంలో చేర్చుకుని వారికి పూర్తిస్థాయి పార్టీ బాధ్యతలను అప్పగించే యోచనలో ఉన్నట్టు సమాచారం. అదే టైములో కోస్తా కి చెందిన నలుగురు మంత్రుల పనితీరూ ఆశాజనకంగా లేదని ఇప్పటికే అధిష్టానానికి నివేదికలందాయి. మరోవైపు విపక్షాల విమర్శలను వెనువెంటనే తిప్పికొట్టగలిగే సత్తా ప్రస్తుత మంత్రులు ఎవరికీ లేదన్న అంశం అధిష్టానానికి స్పష్టమై పోయింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మంత్రులు దాడిశెట్టి రాజా, పినిపే విస్వరూప్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ ల పనితీరు అనుకున్నంత ఆశాజనకంగా లేదన్న సమాచారం నివేదికలు సైతం ఇప్పటికే అధినాయకునికి చేరినట్టు తెలుస్తోంది. దాంతో ఈ మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణలో ఎవరెవరికి మంత్రి గిరీలు ఉంటాయో, ఎవరి మంత్రి గిరీలు ఊడతాయో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో పార్టీకి మరింత వెన్నుదన్నుగా నిలిచి, వచ్చే ఎన్నికలలో సత్ఫలితాలను సాధిస్తారని నమ్మకమున్న మరో నలుగురు ఎమ్మెల్సీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రతిపక్షాలకు సింహ స్వప్నం, ఫైర్ బ్రాండ్ తోట త్రిమూర్తులని భావించి నాడు సీఎం జగనే నేరుగా ఆయన్ను ఎమ్మెల్సీ కుర్చీలో కూర్చోబెట్టారు. అలాగే కాపు సామాజిక వర్గంలో రాష్ట్రవ్యాప్తంగా మంచి పట్టు ఉన్న తోట త్రిమూర్తులకు మంత్రివర్గంలో సముచిత స్థానాన్ని కల్పించే యోచనలో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుత పరిస్థితులలో వైసిపి కి కాపు నాయకులు ఉన్నప్పటికీ చరిష్మా కలిగిన తోట త్రిమూర్తులకు మంత్రి పదవి ఇచ్చి నట్టైతే రాజకీయ ప్రత్యర్థులకు సింహ స్వప్నంలా ఉంటాడనీ, రాష్ట్రంవ్యాప్తంగా ఉన్న తన అనుచరులు, అభిమానులు, కాపు సంఘాలతో పార్టీని మరింత బలోపేతం చేస్తారని, ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన మంచి ఊపు మీద ఉన్నప్పటికీ తోట తన సామాజిక వర్గాన్ని అటువైపుకు చూడకుండా చూసుకో గలరన్న ఆశావాదంతో ఉండవచ్చని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఈ బరోసా తోనే తన అభిమాన కాపువర్గాన్ని తోట వైకాపా పఠిష్టతకు వాడుకుంటారనే వాదన వినిపిస్తోంది. అదే విధంగా విపక్షాల విమర్శలకు దీటైన సమాధానం చెప్పగలిగే సత్తా ఉన్న తోటకు బడుగు, బలహీన సామాజిక వర్గాల అండ సైతం ఉంది. ఈ అంశాలన్నిటిని బేరీజు వేసుకొని తోట చిరకాల కోరికైన మంత్రి పదవి ఆయన్ను వరించబోతుందా అంటే నిజమేనన్న సమాధానం వస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తోట త్రిమూర్తులు అభిమానులు సైతం ఇదే ఆశిస్తున్నారు. తమ నాయకునికి మంత్రి పదవి తప్పనిసరిగా దక్కుతుందని ఆకాంక్షిస్తున్నారు.