Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బీఆర్ఎస్-ఎంఐఎం ల మధ్య చిచ్చు రగులుతోందా ?

– మిత్రులే శత్రువులైన వేళ
– బీఆర్ఎస్‌ దోస్తీకి ఎంఐఎం కటీఫ్ చెప్పనునుందా..!
తెలంగాణ వ్యాప్తంగా 50 అసెంబ్లీ స్థానాల్లోపోటీ చేసేందుకు సిద్ధమవుతోందా..?
బీజేపీ పదేపదే చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టే వ్యూహంలో భాగమా..!
హైదరాబాద్, జనవరి 7, నిజం న్యూస్:
తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు మిత్ర పక్షాలుగా వ్యవహరిస్తూ వచ్చిన బీఆర్ఎస్-ఎంఐఎం ల మధ్య ఇప్పుడు చిచ్చు రగులుతోందా ? అసెంబ్లీ సమావేశాలలో ఒక్కసారిగా ఇరువురు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేటట్లు ఎందుకు వ్యవహరిస్తూ వచ్చారు ? అన్న ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణా లో రాజకీయ విశ్లేషకులను వేధిస్తున్నాయి.

ఈసారి బీఆర్ఎస్‌ దోస్తీకి ఎంఐఎం కటీఫ్ చెప్పనున్నట్టు తెలుస్తోంది. అందుకు ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన పరిణామాలే నిదర్శనంగా కన్పిస్తున్నాయి. ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ వర్సెస్ మంత్రి కేటీఆర్‌గా జరిగిన చర్చ.. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వ అసమర్ధ విధానాలపై అక్బరుద్దీన్‌ ఆవేశపూరిత వ్యాఖ్యలు బీజేపీ వ్యూహాత్మకమా లేక ఎంఐఎం కూడా ప్లాన్డ్‌గానే కామెంట్‌ చేసిందా అన్న విషయాలపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో ఎం ఐ ఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్‌ ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయి ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై మంత్రి కేటీఆర్ ను నిలదీసి ప్రశ్నించారు. హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాల్లో వేగంగా జరుగుతున్న పనులు పాతబస్తీలో ఎందుకు జరగడం లేదని, మైనారిటీలు నివాసం ఉంటున్న ప్రాంతం కారణంగానే ఈ వివక్షత చూపిస్తోందని మంత్రిపై రెచ్చిపోయారు. చార్మినార్ పాదాచారుల ప్రాజెక్టు సంవత్సరాలుగా ఆలస్యం అవుతొందని, పాతబస్తీ మెట్రో ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని, పాతబస్తీ ప్రజల వెతలు ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శల జల్లు కురిపించారు.

దీనికి కె టి ఆర్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఏడుగురు సభ్యులున్న ఎంఐఎంకే ఇంత సమయం ఇస్తే..వందపైన సీట్లున్న పార్టీకి ఎంత సమయం ఇవ్వాలని కేటీఆర్‌ ప్రశ్నించారు. పాత బస్తీ ప్రజల సమస్యలు తీర్చడం పై ప్రభుత్వానికే ఎక్కువ చిత్తశుద్ధి వుందని ఎదురుదాడి చేసారు.

ఎంఐఎం ఇప్పటి వరకు పాత బస్తీకే పరిమితమైన పార్టీ.. అయితే తమకు వస్తున్న ఆదరణ, తెలంగాణాలో వున్న ముస్లిం మతస్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ వ్యాప్తంగా 50 అసెంబ్లీ స్థానాల్లోపోటీ చేసేందుకు సిద్ధమవుతోంది

వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు, ఎంఐఎంకు మధ్య మంచి సంబంధాలున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో టీఆర్ఎస్‌ మెజార్టీ సీట్లు సాధించిన తర్వాత.. కేసీఆర్‌కు దగ్గరయ్యారు ఎంఐఎం నేతలు.. అన్నింటికీ మద్దతు ఇస్తూ వచ్చారు.. అయితే, టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారిన తర్వాత కాస్త గ్యాప్‌ వచ్చిందనే చర్చ సాగుతోంది.. .

పాత బస్తీ పార్టీ గత ఎన్నికల్లో 2.7 శాతం ఓట్లు దక్కించుకుంది..ఎనిమిది స్థానాల్లో పోటీ చేసి ఏడుగురిని గెలిపించుకుంది.. ప్రస్తుతం ఎంఐఎం బలం..ఓల్డ్‌సిటీలోనే ఉందని చెప్పుకుంటున్నా..ఎమ్మెల్యేలు ఏడుగురే అని సర్ది చెప్పుకున్నా.. ఫ్యూచర్‌లో వీళ్ల బలం పెరిగే అవకాశాలు లేకపోలేదు.. ఎందుకంటే.. ఎంఐఎం ఎంచుకున్న ప్రాంతాల్లో ముస్లింల జనాభా ఎక్కువగా ఉంది..మైనార్టీ వర్గాలు ఓవైసీ మాటలకు ఫిదా అయితే..వచ్చే ఎన్నికల్లో అద్భుతాలు జరగొచ్చు..అసెంబ్లీలో అక్బర్‌ చెప్పినట్లు.. 15 సీట్ల కంటే ఎక్కువ రావచ్చు.. ఏమో గుర్రం ఎగరా వచ్చు.. అక్బరుద్దీన్‌ మాటలు నిజం కావొచ్చు. పాత బస్తీ పార్టీ..ఊహించని స్థానాల్లో గెలిచి..అన్ని పార్టీలను పరేషాన్‌ చేయొచ్చు.

ఎం ఐఎం గనుక 50 స్థానాల్లో పోటీ చేస్తే బీఆరెస్‌కు చెమటలు పట్టడం ఖాయమంటున్నారు పొలిటికల్‌ విశ్లేషకులు.ఇన్నాళ్లూ కాంగ్రెస్‌ పార్టీ కి పడుతూ వస్తున్న మైనార్టీ వర్గాల ఓట్లన్నీ ఇప్పుడు 50 స్థానాల్లో పోటీ చేసే ఎంఐఎంకు గంపగుత్తగా పడతాయి.అప్పుడు కేసీఆర్‌ ఆంచనాలు కూడా తారుమారు కావొచ్చునన్నది రాజకీయ పండితుల అభిప్రాయం. ఇప్పటి వరకు మిత్ర పక్షంగా ఉన్న బీఆర్ఎస్, ఎంఐఎం దోస్తీ..ఇక తెగిపోయినట్లేనా అన్న చర్చకు తెరలేచింది. మరోవైపు.. బీజేపీ పదేపదే చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టే వ్యూహంలో భాగమే ఈ ప్రకటననా.. లేక నిజంగానే విడివిడిగా పోటీ చేయనున్నారా అన్నది క్లారిటీ రావాల్సిఉంది. ఒకవేళ ఎంఐఎం విడిగా పోటీ చేస్తే.. బీఆర్ఎస్‌కు నష్టం జరగనుందా, అన్నది కూడా విశ్లేషిస్తున్నాయి రాజకీయ శ్రేణులు.
సి.హెచ్.ప్రతాప్