ట్రైబల్ జర్నలిస్టుల జోలికొస్తే సహించేది లేదు

-టిడబ్ల్యూజేఏ జిల్లా ప్రధాన కార్యదర్శి బానోతు లక్ష్మణ్ నాయక్
తేదీ 07 మహబూబాబాద్ బ్యూరో నిజం న్యూస్
గూడూరు వాస్తవాలను వార్తగా సేకరించే సందర్భంలో ట్రైబల్ జర్నలిస్టుల జోలికి వస్తే ఎంతటి వారినైనా సహించేది లేదని ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టిడబ్ల్యూజేఏ) మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి బానోతు లక్ష్మణ్ నాయక్ హెచ్చరించారు. మంగళవారం గూడూరు మండల కేంద్రంలో నిర్వహించిన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏజెన్సీ మండలమైన గూడూరులో కొంతమంది దళారులతో చేతులు కలిపి అరాచకాలకు పాల్పడుతూ గిరిజన పాత్రికేయులపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తూ అవమానిస్తున్నారని ఆరోపించారు. అన్యాయాలను ఎత్తిచూపే క్రమంలో గిరిజన జర్నలిస్టులపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడేలా కొంతమంది పని కట్టుకొని ప్రేరేపించి తప్పుడు కూతలు కూస్తున్నారని విమర్శించారు. తక్షణమే ఇలాంటి నీతిమాలిన చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. వాస్తవాలను ఈ సమాజానికి అందించడానికి గిరిజన పాత్రికేయులు ఏమి తక్కువ కాదు.. అనే విషయాన్ని గ్రహించుకుంటే మంచిదని సూచించారు. ట్రైబల్ జర్నలిస్టులను అవమాన పరచాలని ప్రయత్నిస్తున్న కొందరి భరతం త్వరలోనే పడతామని ఆయన హెచ్చరించారు. ట్రైబల్ జర్నలిస్టులు అన్యాయాలను ఎత్తిచూపుతుంటే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఆయన ఆరోపించారు. నిజాయితీగా వార్తా సేకరించి ఈ సమాజానికి చేరవేస్తున్న గిరిజన పాత్రికేయులను డి కొనలేక తప్పుడు మార్గంలో అనైతిక విలువలతో కూడిన పిరికిపందల్ల ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ట్రైబల్ జర్నలిస్టుల పట్ల వ్యతిరేక వాక్యాలు, అవహేళన చేసే నీతిమాలిన మూకలు ఇప్పటికైనా మీ తప్పులను తెలుసుకోండి, లేదంటే భవిష్యత్తులో అనేక పరిణామాలను చవి చూడాల్సి వస్తుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రచార కార్యదర్శి బోడరాజు నాయక్, డివిజన్ ఉపాధ్యక్షులు భూక్య నరసింహ నాయక్, జిల్లా కమిటీ సభ్యులు బానోతు నరసింహ నాయక్, భూక్య మోహన్ నాయక్, భూక్య మంగీలాల్ నాయక్, ఈసం సురేష్, రాజు, తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.