Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

స్వంత పార్టీలో అసమ్మతి సెగలు

అసమ్మతి సెగలు
ప్రత్యేక కథనం : సి.హెచ్.ప్రతాప్

ఒక పక్క బి ఆర్ ఎస్ పార్టీని దేశవ్యాప్తం చేసేందుకు ముఖ్యమంత్రి కె సి ఆర్ రక రకాల వ్యూహాలను పన్నుతుంటే, మరొక పక్క స్వంత పార్టీలో ముసలం బయలుదేరింది. రాష్ట్రవ్యాప్తంగా పురపాలికల్లో మున్సిపాలిటిల్లో అవిశ్వాస తీర్మానాలు ఎక్కువైతోన్నాయి. కొన్ని పురపాలికలలో విపక్షాలతో స్వంత పార్టీ కౌన్సిలర్లు చేతులు కలిపి కౌన్సిల్ ను పడ దోసేందుకు యత్నాలు చేయడం పట్ల కె సి ఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు. వివిధ మున్సిపాలిటీలలో పాలకవర్గాలు కొలువుదీరి మూడేళ్లు పూర్తికావడంతో ఇప్పటివరకు ఏ పదవి దక్కని అసంతృప్తులు అవిశ్వాసాలకు పదునుపెడుతున్నారు. కొత్త పాలకవర్గాలు కొలువుదీరి మూడేళ్లు పూర్తి కావడంతో కౌన్సిలర్లు తమ డిమాండ్లు సాధించుకోవడంపై దృష్టి పెట్టారు. విపక్షాలతో చేతులు కలిపి అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టడంలో నిమగ్నమై వున్నారు. రాష్ట్ర పురపాలక చట్టం ప్రకారం మూడేళ్ల తర్వాతే అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉండడం, 2020 జనవరి 27వ తేదీన కొలువుదీరిన పాలక వర్గాల మూడేళ్ల కాలపరిమితి ముగియడంతో చాలాచోట్ల అసంతృప్తులు అధికమయ్యాయి. ఎన్నికలలో గెలిచిన తర్వాత పదవులు లభించకపోవడం, ఒకే వర్గం ఆధిపత్యం చెలాయించడం , ఎమ్మెల్యేల జోక్యం వంటి కారణాలతో ప్రస్తుతం పదవులలో వున్న వారిని అవిశ్వాసం ద్వారా తొలగించి తమ అదృష్టం పరీక్షించుకునే దిశగా సింహభాగం మున్సిపాలిటీలలో కౌన్సిలర్లు బిజి బిజి గా వున్నారు. గతంలో ఎన్నికల వేళ ఛైర్‌పర్సన్‌ పదవులు దక్కకపోవటంతో పార్టీ నేతలు, ఎమ్మెల్యేల బుజ్జగింపులతో కొందరు, అధిష్టానం జోక్యంతో మరికొందరు మూడేళ్ల తర్వాత ఛైర్మన్‌, డెప్యూటీ చైమన్ లేదా ఇతర నామినేటెడ్ పదవులు ఇస్తామన్న హామీలతో ఆశావహులు అప్పట్లో వెనక్కి తగ్గారు. మూడేళ్ల కాలపరిమితి 27తో ముగియడంతో అసంతృప్తులు ఒక్కొక్కరుగా అవిశ్వాసాల గళమెత్తుతున్నారు. ఇప్పటికే చాలా జిల్లాలలో అవిశ్వాసం కోసం నోటీస్‌లు జారీ చేసారు. విపక్ష కౌన్సిలర్లతో కలిసి క్యాంపు రాజకీయాలు ప్రారంభించారు. ఇవి ఫలితాలనిచ్చే నేపథ్యంలో కనిసం 20-30 మున్సిపాలిటీలలో బి ఆర్ ఎస్ మెజారిటీ కోల్పోయే ప్రమాదం నెలకొంది..

చైర్ పర్సన్ లపై అసంతృప్తి, ఎమ్మెల్యేలతో విభేదాలు, వ్యక్తిగత కారణాలు లాంటి ఎన్నో అంశాలు ఇందుకు కారణమవుతున్నాయి. ఇప్పటికే ఎనిమిది చోట్ల అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. వచ్చే రెండు రోజులలో మరో నాలుగైదు చోట్ల నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పదవీకాలం మరో ఏడాది మాత్రమే ఉన్నప్పటికీ, అవిశ్వాస తీర్మానాల జోరు మాత్రం తగ్గడం లేదు. అన్నిటి కంటే ముఖ్యంగా క్యాంపు రాజకీయాలు కూడా భారీగా మొదలయ్యాయి. మొత్తానికి ఈ వ్యవహారం రాష్ట్రంలో బి ఆర్ ఎస్ లో చిచ్చురేపేదిగా మారింది.

అవిశ్వాస తీర్మానాల విషయంలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి విషయం తెలంగాణ అంతటా చర్చనీయాంశంగా మారింది. అందరిదీ ఒకే నియోజకవర్గం అందరూ అధికార పార్టీ ప్రతినిధులే ఒక వైపున పట్టు నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యే ఆశ మరో వైపున, అధికారం చేజిక్కించుకోవాలని కౌన్సిలర్ల పోరాటం. ఒకరిని మించి ఒకరు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఇక్కడ కౌన్సిలర్లు ఏకంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై, మున్సిపల్ చైర్ పర్సన్ పసుపుల సునీత రాణి పై తిరుగుబాటు జెండా ఎగురవేసి క్యాంప్ రాజకీయాలు నడిపిస్తున్నారు.కొన్ని మున్సిపాలిటీలలో మరోవైపు ఎమ్మెల్యేలు తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అసమ్మతి పై అధిష్టానం సీరియస్‌గా ఉందన్నట్లు సంకేతాలు ఇచ్చారు. అవకాశం ఉన్న చోట భేరసారాలు లేదంటే అభిదృద్ధి పనుల్లో అవకాశాలు కల్పిస్తామని వ్యవహారాన్ని సద్దుమణిచేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

ఈ పరిణామాలు అధికార పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారుతున్నాయి. ‌అవిశ్వాసంబాట పట్టిన వారిని బుజ్జగించడం, సర్దుబాటు చేయడం కత్తిమీద సాముగా మారింది.