Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నిరర్ధక ఆస్థుల వలన 12 లక్షల కోట్ల ప్రజాధనం నష్టం ?

రచన: సి.హెచ్.ప్రతాప్

గత ఎనిమిది సంవత్సరాలలో దాదాపుగా రూ.12 లక్షల కోట్ల రుణాలను బ్యాంకులు మాఫీ చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదిక పేర్కొంది. ఇందులో 85 శాతం రుణాలు మేజర్ కార్పొరేట్‌ కంపెనీలు తీసుకున్నవే అని తెల్లుస్తోంది. అయితే ఈ పన్నెండు లక్షల కొట్ల రూపాయలు శాశ్వతంగా దేశ ఖజానాకు గండి పడినట్లేనని, వివిధ కార్పొరేట్ కంపెనీలు చట్టబద్ధంగానే ఒక పద్ధతి ప్రకారం చేసారని ఆర్ధిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

ఇవాళ దేశంలో బ్యాంకులను మొండి బాకీలకు సంబంధించిన సమస్యలు వేధిస్తున్నాయి. పారుబాకీల ముప్పుముందెన్నడు లేనంతగా నేడు బ్యాంకులను వెన్నాడుతోంది. రాని బాకీలు, లేదా పారు బాకీలు లేదా మొండిబాకీలు- వీటిని బ్యాంకింగ్‌ పరిభాషలో నిరర్ధక ఆస్తులు (నాన్‌ పెర్ఫార్మింగ్‌ అసెట్స్‌) అంటారు. ఈ రుణాల మీద రుణ గ్రహితలు తాను తీసుకున్న రుణం మీద వడ్డీని గానీ రుణ వాయిదాలను గానీ లేదా రెండింటిని గడువు తేది నుంచి 90 రోజుల్లోగా చెల్లించలేనట్లయితే ఆ రుణం నిరర్ధక ఆస్థి అవుతుంది. వీటిని స్టూల నిరర్ధక ఆస్తులు (జిఎన్‌పిఎ), నికర నిరర్ధక ఆస్తులు (ఎన్‌ఎన్‌పిఎ) అని రెండు గ్రూపులుగా లెక్కిస్తారు. బ్యాంకుల మొత్తం ఆస్తుల్లో వాటి మొత్తం ఎంత శాతం ఉన్నది జిఎన్‌పిఎలు వెల్లడిస్తాయి. వీటి ప్రమాదాన్ని డిపాజిటర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులు కొంత నిధిని ప్రత్యేకంగా కేటాయించి పక్కన పెడుతాయి. ఇలా కేటాయించిన ప్రత్యేక నిధి నుంచి జిఎన్‌పిఎను తీసివేస్తే మిగిలింది ఎన్‌ఎన్‌పిఎలుగా భావిస్తారు.

 

 

పరిశ్రమల స్థాపన పేరుతో రుణాలు తీసుకోవడం, ఆ పరిశ్రమలు నష్టాలలో కూరుకుపోయాయని ఆడిట్ రిపోర్ట్ తయారు చేయించి వాటిని నిరర్థక ఆస్తులుగా (ఎన్‌పీఏలుగా) ప్రకటించి, అనంతరం ఆ రుణాల ను మాఫీ చేయించుకోవటం సర్వ సాధారణంగా కంపెనీలు ఆచరిస్తున్న విధానం. అయితే కంపెనీలకు కొత్త పరిశ్రమల కోసం ఋణాలు ఇస్తున్నప్పుడు నిపుణులచే డి పి ఆర్ తయారు చేయించడం, వాటిని ఆర్ధిక, సాంకేతిక నిపుణులచే తనిఖీ చేయించడం అనేది బ్యాంకుల నిబంధనలలో ముఖ్యమైనది. ప్రపోజల్ అందాక ఆ డి పి ఆర్ ను తటస్థ సంస్థ( థర్డ్ పార్టీ వెట్టింగ్) చేత తనిఖీ చేయించి, ఆ పరిశ్రమ డి పి ఆర్ లో పేర్కొన్న ప్రకారం నిర్ధారిత లాభాలను ఇస్తుందనే నిర్ధారణకు వచ్చాకే బ్యాంకులు ఋణాలను పంపిణీ చేస్తాయి. ఇటువంటి కఠినతర నిబంధనలు వున్నా,ఋణాలు ఎలా మంజూరు అవుతున్నాయి, పరిశ్రమ స్థాపన అయ్యాక అవి నష్టాల్లో కూరుకుపోయి, నిరర్ధక ఆస్థులుగా ఎలా మారుతున్నాయనేది బిలియన్ డాలర్ల ప్రశ్న.

తాజా ఆర్ బి ఐ నివేదిక ప్రకారం దేశంలో ఎన్‌పీఏలు అంతర్జాతీయంగా అంగీకరించిన ప్రమాణాల కన్నా 4-6 రెట్లు అధికంగా ఉంటున్నా యి. అయితే మొత్తం రుణాల్లో 1-2 శాతం ఎన్‌పీఏలుగా మారే అవకాశం ఉందని అంతర్జాతీయంగానే అంగీకరించిన విషయం. వీటిలో సగం (0.5-1 శాతం) వరకు రుణాలు రద్దు చేయబడతాయి కూడా. ఐఎంఎఫ్‌-2021 నివేదిక ప్రకారం మొత్తం రుణాల్లో ఎన్‌పీఏల నిష్పత్తి అమెరికాలో, బ్రిటన్‌లో దాదాపు ఒక శాతం. కెనడాలో 0.4 శాతం, దక్షిణ కొరియాలో 0.2 శాతం, స్విట్జర్లాండ్‌లో 0.7 శాతం ఉంది. ఆర్థిక అక్రమాలపై అత్యంత కఠినంగా వ్యవహరించటం వల్లే ఈ దేశాల్లో పరిస్థితులు ఇంత మెరుగ్గా ఉన్నాయి.

తాజా నివేదిక ప్రకారం 2023 సెప్టెంబరుకు ప్రభుత్వరంగ బ్యాంకుల ఎన్‌పీఏలు 9.4 శాతానికి, ప్రైవేటు బ్యాంకుల ఎన్‌పీఏలు 5.8 శాతానికి చేరుకోవచ్చని అంచనా వేసింది.

ఈ పరిస్థితిని బ్యాలెన్స్‌ చేసుకోవటానికి లాభాలను ఆర్జించే ప్రభుత్వరంగ బ్యాంకుల చేత నష్టాలు వస్తున్నట్లుగా ప్రభుత్వం చూపిస్తున్నది అన్నది ఆర్ధిక శాస్త్రవేత్తల అభిప్రాయం.2009- 2014 మధ్య ప్రభుత్వరంగ బ్యాంకులు ఏటా రూ.35 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్ల లాభాలు సగటున ఆర్జించాయి. అవే బ్యాంకులు 2015-20) మధ్య రూ.2 లక్షల కోట్ల నష్టాలు చవిచూశాయి. ఎన్‌పీఏలను భరించటం వల్లనే వీటికి ఈ నష్టాలు వచ్చాయన్నది నిర్వివాదాంసం.

2014 నుండి బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి.బ్యాంకింగ్‌ రంగంలో సంక్షోభం స్వయం కృతాపరాదం. రుణ(గ్రహీతల వ్యాపారాలు నూతన పద్ధతిలో ఉంటున్నాయా. పూచీగా సరియైన ఆస్తులు (కోల్లేటరల్స్‌) ఉన్నాయా అనే వాటితో నిమిత్తం లేకుండా, సరైన వసూళ్ల పద్ధతి లేకుండా ఆభ్రితులకు పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వాలనే ఒత్తిడిని ప్రభుత్వ వర్షాల నుండి బ్యాంకులు ఎదుర్కొంటున్నాయి. 2014 నుంచి ఈ పారుబాకీలు పెరుగుతూ ఎంతటి స్థాయికి చేరుకున్నాయంటే ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికికే ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. పారుబాకీలలో 82 శాతం కార్చొరేట్‌ రుణాలకు చెందినవేననే వాస్తవం ఈ సంక్షోభానికి గల మౌళిక కారణాన్ని తెలియజేస్తుంది.

అయితే ఎన్‌పీఏలను రద్దు చేసినప్పటికీ.. కొంత మొత్తాన్ని వేలం ద్వారా, ఇతరత్రా ఎగవేతదారుల నుంచి 20 శాతం వరకు రాబట్టడానికి అవకాశం ఉంది. అంటే మొత్తం రూ.14.5 లక్షల కోట్లలో రూ.2.8 లక్షల కోట్లు మాత్రమే ఏనాటికైనా వసూలయ్యే అవకాశం ఉంది. అంటే, దాదాపు రూ.12 లక్షల కోట్లు శాశ్వతంగా దేశం నష్టపోయినట్లే. ఈ డబ్బు మనవంటి సాధారణ డిపాజిట్‌దారులు, చిన్నస్థాయి ఇన్వెస్టర్లదే. చిన్న చిన్న ఆర్థిక నేరాలపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటున్నప్పుడు.. ఈ భారీ నేరాలపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారు అన్నది దేశ ప్రజల నుండి ఎదురవుతున్న ప్రశ్న.