తెలుగు రాష్ట్రాలకు చాన్స్ వస్తుందా.. ???
-త్వరలో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ
-మకర సంక్రాంతి బడ్జెట్ ప్రారంభం రోజున కేంద్ర మంత్రివర్గ విస్తరణ…!
-తెలంగాణలో కీలకంగా మారిన బిజెపి
కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తెలుగు రాష్ట్రాల ఎంపీలకూ మొదటి నుండి మొండి చెయ్యే ఎదురవుతూ వస్తొంది. ఒకానొక సందర్భంలో తెలుగు రాష్ట్రాల నుండి అత్యధిక ఎంపిలను లోక్ సభకు పంపించినా అనుకున్న రీతిలో మంత్రి పదవులు దక్కలేదు. 2014 ఎన్నికలలో బి జె పి తో పొత్తు కుదుర్చుకున్నాక టి డి పి కి మూడు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. అయితే బి జె పి తో తెగతెంపులు చేసుకున్న కారనంగా ఈ పదవులు కూడా తెలుగు రాష్ట్రాలు కోల్పోవలసి వచ్చింది. 2019 ఎన్నికలలో బి జె పి రెండు తెలుగు రాష్ట్రాలలో స్వతంత్రంగా పోటీ చేయగా, ఆంధ్ర ప్రదేశ్ నుండి ఒక్క సీటు కూడా గెలుచుకోకపోగా, తెలంగాణా నుండి నలుగురు ఎంపిలుగా గెలిచారు.వీరిలో కిషన్ రెడ్డికి కీలక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి దక్కింది. కిందటి విస్తరణలో మరొకరికి అవకాశం లభిస్తుందని ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు హహర్దశ పట్టనున్నదని, కనీసం ఒకటి లేదా రెండు పదవులు అదనంగా దక్కవచ్చునని సంకేతాలు బలంగా అందుతున్నాయి.
శుక్రవారం నాడు మంత్రివర్గం విస్తరణ, పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఊహాగానాలు ఊపందుకున్నాయి. మోదీ నేతృత్వంలో రెండోసారి కొలువుదీరిన ఎన్డీయే మూడున్నరేళ్ల పాలన పూర్తి చేసుకుంది. సాధారణ ఎన్నికలకు మరో దాదాపు ఏడాది గడువు ఉంది. ఈనేపథ్యంలో మరింత మెరుగైన పాలనకు వీలుగా మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు. తాజా సమాచారం ప్రకారం మకర సంక్రాంతి బడ్జెట్ సెషన్ ప్రారంభం మధ్య ప్రధాని మోదీ తన మంత్రివర్గాన్ని విస్తరించవచ్చునని, ఇసారి కేంద్ర కేబినెట్‌లో కొత్త ముఖాలకు కూడా చోటు దక్కవచ్చని అంతే కాకుండా త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళబోతున్న రాష్ట్రాలకు ప్రాధాన్యత వుంటుందని సమాచారం.
ఈ నెల 29న మొదలు కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందే కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే ఈ సారి తెలుగు రాష్ట్రాలవారికి పెద్ద పీఠ వేసే అవకాశం ఉందంటున్నారు కమలం నేతలు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి ఒక్కొక్కరికి మంత్రివర్గంలో ఛాన్స్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే తెలంగాణాకు తప్ప ఆంధ్ర ప్రదెశ్ లో బి జె పి కి మనుగడ అంతంత మాత్రంగా వున్నందున ఆంధ్రకు మంత్రి పదవులు దక్కడం కష్టమని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుత కేబినెట్ లో ప్రధానమంత్రితో కలిపి 31 మంది కేబినెట్ మంత్రులు, ఇద్దరు స్వతంత్ర హోదా మంత్రులు, 45 మంది సహాయ మంత్రులు అంటే.. మోదీ కేబినెట్‌లో మొత్తం 78 మంది ఉన్నారు. కేంద్రంలో గరిష్ఠంగా 83 మంది వరకు మంత్రులుగా ఉండే అవకాశం ఉంది. అంటే మరో ఐదుగురి అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలకు ఛాన్స్ ఇస్తారా లేక త్వరలో ఎన్నికలు జరగనున్న కర్నాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లకు ప్రాధాన్యత వుంటుందా అన్నదానిలో ఇంకా స్పష్తత రాలేదు.
ఈ రాష్ట్రాలపై బీజేపీ కన్ను..
2023 అన్ని రాజకీయ పార్టీలకు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే రాబోయే సంవత్సరంలో 9 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో జమ్ము కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం కూడా ఉంది. వచ్చే ఏడాది అంటే 2024లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నందున ఈ ఎన్నికలు మరింత కీలక మారనుంది. ఈ ఏడాది జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది . ఇప్పుడు త్రిపుర, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల ఎన్నికలపై బీజేపీ కన్నేసింది. రాజకీయంగా పట్టూ సాధించేందుకు ఇక్కడి వారికీ ప్రాధాన్యత ఇవ్వాలనేది బి జె పి ఎత్తుగడ అని కొందరిఉ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణలో నలుగురు ఎంపీలలో జి.కిషన్‌రెడ్డి ప్రస్తుతం కేబినెట్ మంత్రిగా ఉన్నారు. మరో ముగ్గురిలో ముందుగా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, అర్వింద్, లక్ష్మణ్, సోయం బాపురావు ఉన్నారు. కిషన్ రెడ్డి.. లక్ష్మణ్ ఇద్దరూ హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వారే. ఎస్టీ వర్గాలకు ఇవ్వాలని భావిస్తే అదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు పేరు పరిశీలనలోకి తీసుకొనే అవకాశం ఉంది. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ నాయకత్వం వద్ద మంచి మార్కులు సంపాదించారు. ఎన్నికల వరకు బండి సంజయ్ ను పార్టీ వ్యవహారాల నుంచి తప్పించకుండా..అదే పదవిలో కొనసాగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. సామాజిక-నాయకత్వ- ప్రాంతీయ సమీకరణాలు పరిగణలోకి తీసుకుంటే ధర్మపురి అర్వింద్ కు ఛాన్స్ కనిపిస్తోంది. అయితే, తెలంగాణలో కేసీఆర్ ను బలంగా కౌంటర్ చేసే నేతకే కేంద్ర కేబినెట్ లో స్థానం దక్కుతుందని కమలం పార్టీ ముఖ్య నేతలు అంచనా వేస్తున్నారు.
ఏపీకి చెందిన సీఎం రమేశ్, జీవీఎల్ నరసింహారావు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఏపీ కంటే తెలంగాణ బీజేపీకి రాజకీయంగా కీలకంగా మారుతోంది. ఏపీలో మూడు ప్రధాన పార్టీలు దాదాపుగా బీజేపీకి అధికార – అనధికార మిత్రపక్షాలుగా ఉన్నాయి. దీంతో, ఏపీలో మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ దక్కటం దాదాపు లేదనే అభిప్రాయ వ్యక్తం అవుతోంది. అనూహ్య మార్పులు జరిగి.. పవన్ కేంద్ర కేబినెట్ లో చేరే అవకాశం ఉంటే జనసేనానికి మినహా ఏపీ నుంచి ఎవరికీ కేంద్ర కేబినెట్ లో ఛాన్స్ దక్కే పరిస్థితి కనిపించడం లేదు. అయితే, అనూహ్య నిర్ణయాలు తీసుకొనే బీజేపీ అగ్రనాయకత్వం ఎటువంటి వ్యూహాలు అమలు చేస్తుందో చూడాలి.
ఏది ఏమైనా రాజకీయ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా సమగ్ర దేశాభివృద్ధిని, సమాఖ్య స్పూర్తిని దృష్టిలో వుంచుకొని, రెండు తెలుగు రాష్ట్రాలకు సముచిత ప్రాధాన్యత ఇచ్చి కనిసం ఒక్కొక్క మంత్రి పదవి ఇవ్వాలని ఇక్కడి ప్రజల ఆకాంక్ష.
సి హెచ్ ప్రతాప్