Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

క్లారిటీ లేని పయనం

_కాంగ్రెస్ నా.. బిజెపీనా.. బిఎస్ పి నా, బీఆర్ ఎస్ నా.

-స్వచ్ఛంద సంస్థ పేరుతో ప్రజల వద్దకు

_ ఆ తర్వాత రాజకీయాల వైపు అడుగులు.

_వీరి లక్ష్యం ఏమిటి..?

-ప్రజాసేవ లేక స్వసేవనా..!

_ మోసపోతున్నది ఎవరు… లాభపడుతున్నది ఎవరు?

హైదరాబాద్, జనవరి 21, నిజం న్యూస్:

తెలంగాణలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చాలామంది స్వచ్ఛంద సంస్థలను నెలకొల్పి, ఆ పేరుతో ప్రజలకు సేవ చేస్తామని నమ్మబలికి అంతో ఇంతో దానధర్మాలు చేసి, మంచి పేరు తెచ్చుకొని ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. యువతను కోచింగ్ సెంటర్లకు పంపి కోచింగ్ లను ఇప్పిస్తున్నారు. స్టడీ మెటీరియల్ లను ఇచ్చి, వారి అభివృద్ధి కోసమే తాము పుట్టినట్లుగా నమ్మ పలుకుతున్నారు. దీని వెనుక వారి అంతర్ధానం మాత్రం యువతను, ప్రజలను ఆకట్టుకుని ఎలా ఓటు బ్యాంకుగా మలుచుకోవాలన్నదే. స్వచ్ఛంద సంస్థలను అడ్డుపెట్టుకొని రాజకీయాల వైపు అడుగులు వేయడం ఈ మధ్య నడుస్తున్న లేటెస్ట్ ట్రెండ్.

*ఓటు బ్యాంకుగా మలుచుకోవడానికే ప్రయత్నం*

హుజూర్ నగర్ నియోజకవర్గంలో గతంలో ఒక స్వచ్ఛంద సంస్థ స్థాపించి, ప్రజలకు యువతకు దగ్గరై ఎమ్మెల్యేగా గెలవడంతో చాలామందికి రాజకీయాల్లోనికి రావడానికి ఇది సులభమైన పద్ధతి లాగా తోచింది. ప్రజలకు దగ్గర కావడానికి ఏకైక పద్ధతి స్వచ్ఛంద సంస్థను స్థాపించడమేనని భావించిన మరో వ్యక్తి నూతనంగా మరో ఫౌండేషన్ ను స్థాపించి దానిని ప్రజల్లోకి తీసుకు పోవడంలో సఫలమయ్యారు. తన టార్గెట్ చేరుకోవడానికి చేయాల్సినంత చేశారు. ఇక మిగిలింది 2013 అసెంబ్లీ ఎన్నికలో ఎమ్మెల్యేగా పోటీ చేయడమే. దానికి ఎక్కువ సమయం కూడా లేదు. అసెంబ్లీకి సాధారణ ఎన్నికల సమీపిస్తుండటంతో ఇన్నాళ్లు ప్రజలకు, విద్యార్థులకు, యువతకు చేసిన దానధర్మాలు, స్టడీ మెటీరియల్ ల పంపిణీ, కోచింగ్ సెంటర్లకు పంపే ఏర్పాట్లను కలగలిపి ఓటు బ్యాంకుగా ఎలా మలుచుకోవాలన్న ప్రయత్నాలు మొదలయ్యాయి.

 

*అవగాహన లేని పయనం…*

ఇన్నాళ్లు నియోజకవర్గ ప్రజలకు చేసిన దానధర్మాలకు, సేవలను ఓటు బ్యాంకుగా మార్చుకోవాలంటే ఎలా..! ఏ విధంగా తాను కోరుకున్న గమ్యాన్ని చేరుకోవాలి. దానికి ఏ పార్టీ సహకారాన్ని అందిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి పోదామంటే మోస్ట్ సీనియర్ లీడర్ ఉత్తమ్ ఉన్నాడు. టీఆర్ఎస్ కు పోదామంటే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు. బిజెపికి పోదామంటే బిజెపి జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ అధ్యక్షుల పోస్ట్ లు నిండి పోయాయి. బిఎస్పీలో అవకాశం కనిపించడం లేదు. ఇండిపెండెంట్గా పోటీ చేద్దామంటే ప్రజలు ఆదరిస్తారని నమ్మకం లేదు. మరి ఏ పార్టీకి దగ్గరైతే… ఏ పార్టీలో చేరితే తను కోరుకున్న కలలు నెరవేరుతాయో అర్థం కాక ప్రతి గడపను తొక్కుతున్నాడని బిఆర్ఎస్ నాయకులు అంటున్నారు. స్వచ్ఛంద సంస్థకు చెందిన నాయకులైతే మాత్రం ఒక మంచి పార్టీలో అవకాశం వస్తుందని ఆ పార్టీ నుంచి తమ నాయకుడు పోటీ చేస్తాడని ఈసారి కచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తాడన్న ఆశతో ఉన్నారు.