తిరునగరి శ్రీనివాస్‌కు ఉస్మానియా డాక్టరేట్

యదాద్రి భువనగిరిజిల్లా బ్యూరో జనవరి 12(నిజం న్యూస్)
ఆలేరుకు చెందిన తిరునగరి శ్రీనివాస్ ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు విభాగం నుండి సినారె కవిత్వంలో ప్రయోగాలు – ప్రతీకలు అన్న అంశంపై పరిశోధన చేసినందుకు ఆ విశ్వవిద్యాలయం గురువారం డాక్టరేట్ ను ప్రకటించింది. ఈ మేరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం పరీక్షలు నియంత్రణ విభాగం పత్రికా ప్రకటనను విడుదల చేసింది. విశ్రాంత సీనియర్ ప్రొఫెసర్ ఎన్ఆర్ వెంకటేశం పర్యవేక్షణలో జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సినారె (డా.సి నారాయణరెడ్డి) సాహిత్యంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథాన్ని రాసి విశ్వవిద్యాలయానికి సమర్పించి డాక్టరేట్ ను పొందారు. యూజీసీ నిర్వహించిన ఎన్ఈటీ ( నెట్) పరీక్షలో కూడా ఆయన అర్హత సాధించారు. శ్రీనివాస్ రాసిన విభిన్న తెలుగు ప్రక్రియలకు చెందిన ఎన్నెన్నో పరిశోధనాత్మక సాహిత్య రచనలు అనేక పత్రికలలో ప్రచురితమయ్యాయి. సాహిత్య రంగానికి చెందిన సంస్థల నుండి ఎన్నో అవార్డులను అయన అందుకున్నారు. పలు పుస్తకాలను కూడా ఆయన రచించడమే కాక కొన్నింటికి సంపాదకులుగా వ్యవహరించారు. వివిధ జాతీయ సదస్సులలో పాల్గొని పత్ర సమర్పణలు చేశారు. తన పరిశోధనకు మార్గదర్శనం అందించిన తెలుగు శాఖా ధిపతికి, ఆచార్యులకు, పర్యవేక్షణ జరిపిన ప్రొఫెసర్ ఎన్.ఆర్ వెంకటేశంకు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు..జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సినారె సాహిత్యంపై పరిశోధనను చేపట్టి విజయవంతంగా పూర్తిచేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ను పొందిన శ్రీనివాస్ ను పలువురు ఆచార్యులు, విద్యారంగ ప్రముఖులు, పరిశోధకులు, స్థానికులు అభినందించారు.