రసవత్తరంగా ఖమ్మం BRS రాజకీయాలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్ పార్టీలో విభేదాలు బయట పడుతున్నాయి. మంత్రి అజయ్ వైఖరిపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు. పొంగులేటికి భద్రత కూడా తగ్గించారు. ఈ ఇద్దరు నేతలు ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నప్పటికీ రాజకీయంగా ఎవరికి వారు తమ భవిష్యత్తును వెతుక్కునే పనిలో ఉన్నారు.
ఇటీవల తుమ్మల ఖమ్మం జిల్లా టీడీపీ కార్యకర్తల సమావేశానికి హాజరై తన రాజకీయ జీవితం గురించి, మంత్రిగా జిల్లా అభివృద్ధి కోసం తాను చేసిన కృషి గురించి ఆ సమావేశంలో వివరించారు. అలాగే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా రాజ్యసభ లేదా మండలి సీటు ఆశించారు. కానీ బీఆర్‌ఎస్ అధిష్ఠానం నుంచి గడిచిన నాలుగేళ్లుగా తనకు నిరాశే ఎదురవుతున్నది.
దీంతో ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జరిగినా దాన్ని ఆయన ఖండించారు. కార్యకర్తలు అసంతృప్తికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. రాజకీయంగా మనల్ని అవమానించినా, అణిచివేయాలని చూసినా అధిష్ఠానంపై నమ్మకం తో ఉండాలని, సహనంతో కొంతకాలం భరించాలని అప్పటివరకు వేచి చూడాలన్నటు వ్యాఖ్యానించారు.
పొంగులేటికి భద్రత తగ్గింపు, ఆయనకు, తుమ్మలకు రాజకీయంగా అవకాశాలు రాకుండా మంత్రి అడ్డుపడుతున్నారని, కుట్ర చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఖమ్మం జిల్లా రాజకీయాలపై మంత్రి అజయ్ స్పందించారు. ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలకు 3చోట్ల మాత్రమే జనరల్‌కు అవకాశం ఉన్నది. ఈ మూడు స్థానాల్లో మిగిలిన నేతలంతా పోటీ చేయాలనుకుంటారు. నేతలంతా పోటీ చేయాలని కోరుకోవడంతో తప్పులేదన్నారు. సమస్యలు ఉంటే అధినాయకత్వంతో మాట్లాడి ఒకరికొకరు సర్దుకుపోవాల్సి ఉంటుందని సూచించారు.
ఎవరైనా కొంత సంయమనంతో ఉండాలని కోరుతున్నట్లు మంత్రి చెప్పారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమస్య అధినేత పరిధిలో ఉంటుందని, పార్టీలో ఎలాంటి సమస్య సీఎం కేసీఆర్ పరిష్కరిస్తారని అన్నారు. ఎవరికీ ఇబ్బంది తలెత్తకుండా జిల్లా మంత్రి అందరినీ సమన్వనం చేశానని చెప్పుకొచ్చారు. ప్రొటోకాల్, భద్రత విషయంలో నాకున్న అవకాశాలన్నీ వారికి కల్పించాను. పదవి ఉన్నా.. లేకున్నా పార్టీ, ప్రభుత్వం అందరినీ గౌరవించిందన్నారు.
బేషజాలు వద్దని, సమస్యలు ఉంటే సీఎంతో మాట్లాడుకోవాలని మంత్రి సూచించారు. ఒకే పార్టీలో ఉన్నప్పుడు సంయమనంతో ఉండాలని కోరుతున్నానన్నారు. గతంలో నాపై కుట్రలు చేశారని.. వాటి నుంచి బయటపడ్డానని తెలిపారు. మా పార్టీలో ఉన్నవాళ్లే తనను ఓడించాలని చూసినా ప్రజలు గెలిపించారు. రాజకీయాల్లో కుట్రలు సహజం వాటిని ఎదుర్కొంటూ వెళ్లాలన్నారు.