కారులో మొదలైన పోరు

అధికార పార్టీ బి ఆర్ ఎస్ టికెట్ల కుస్తీ మొదలైంది
50 నియోజకవర్గాల్లో టికెట్లకు బీఆర్‌ఎస్ నేతల సిగపట్లు
సిటింగ్‌లున్నచోట్ల పోటాపోటీ.. రాజీపడబోమని స్పష్టం
వలస ఎమ్మెల్యేల స్థానాల్లో తారా స్థాయికి అసమ్మతిమాడ్గుల జనవరి 1( నిజం న్యూస్ ):
అధికార పార్టీ బీఆర్‌ఎస్ లో టికెట్ల కుస్తీ మొదలైంది. కొన్ని చోట్ల బహిరంగంగానే వివాదాలు జరుగుతుండగా, మరికొన్ని చోట్ల అంతర్గతంగా చిచ్చు రాజుకుంటోంది. ఒకటి, రెండు కాదు.. దాదాపు 50 నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. సిటింగ్ ఎమ్మెల్యేలు ఉన్న చోటే… పార్టీకి చెందిన ఇతర నేతలు టికెట్ ఆశిస్తున్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ సభాపతులు, కార్పొరేషన్ పదవుల్లో ఉన్న వారు.. ఇలా చాలా మందే ఈ వరుసలో ఉన్నారు. బరిలో దిగే అవకాశం ఇస్తారా? లేకుంటే కారు దిగి దారి మార్చాలా? అన్న తెగింపుతోనూ కొందరు ఉన్నట్లు సమాచారం. గత రెండు పర్యాయాలు ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన వారు ఈ సారి రాజీపడే ప్రశ్నే లేదని తమ అనుచరులతో అంతర్గతంగా చెబుతున్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన వారిలో 12 మంది ఎమ్మెల్యేలు, టీడీపీ తరఫున గెలిచిన సత్తుపల్లి, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు, వైరాలో స్వతంత్రంగా గెలిచిన రాములు నాయక్, రామగుండంలో ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలిచిన కోరుట్ల చందర్ టీఆర్‌ఎస్ లో చేరారు.
ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి ఓడిన అభ్యర్థులు ఈ సారి టికెట్ తమకే ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నారు. ఈసారి రాష్ట్రంలో రాజకీయం కొంత మారుతున్న పరిస్థితి ఉండడం, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో బలంగా గురిపెట్టడం వంటి పరిణామాలు రేసులో ఉన్న కొంద రు తీవ్ర నిర్ణయాలు తీసుకోవడానికి కారణమవుతున్నాయి. ప్రత్యామ్నాయ అవకాశాలు కళ్లముందు కనిపిస్తుండడంతో ఈసారి టికెట్ తెచ్చుకునుడో… లేక తెగించుడో.. అన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఒక రకంగా చెప్పాలంటే కారు ఓవర్‌లోడ్ పరిస్థితే… ఆ పార్టీకి కొంత సమస్యగా మారనుంది. ఇప్పటికే వినిపిస్తున్న అసమ్మతి రాగాలు, టికెట్ల డిమాండ్లు.. ఎన్నికల నాటికి తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది.
సిటింగ్‌లకు ఇస్తే ఇతర నేతలకు
ఈ సారి అభ్యర్థుల ఎంపిక అంశం.. బీఆర్‌ఎస్ కు అంత ఈజీ కాదన్న వాదన వినిపిస్తోంది. సిటింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ అని అధినేత కేసీఆర్ ప్రకటించినా… అది ఎంతవరకు సాధ్యమవుతుందనేది ఎన్నికల ముందు కానీ తెలియదన్న వాదనలు ఉన్నాయి. ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు ఇతర పార్టీలు ప్రయత్నిస్తుండడంతో… ఆ విధంగా వ్యూహాత్మక ప్రకటన చేసి ఉంటారన్న అనుమానాలున్నాయి. కరవమంటే కప్పకు కోపం… విడవమంటే పాముకు కోపం అనే తీరుగా చాలా నియోజకవర్గాల్లో పరిస్థితి ఉంది. సిటింగ్‌లకు టికెట్ ఇస్తే సీటు ఆశిస్తున్న నేతలు అలకబూనే అవకాశం ఉండగా… ఇతరులకు ఇస్తే సిటింగ్ ఎమ్మెల్యేలు తీవ్ర నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఈసారి ఆశావహుల్లో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లే కాకుండా కొత్త తరం నేతలూ చేరారు. గత రెండు పర్యాయాలు టికెట్ ఆశించకుండా పార్టీ కోసం పని చేసిన వారు ఈ సారి తమకు అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు.
ఈ నియోజకవర్గాల్లో కత్తిమీద సామే
హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్… ఇలా ఏ ఉమ్మడి జిల్లా తీసుకున్నా… బీఆర్‌ఎస్ లో టికెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల విభేదాలు ఇప్పటికే రచ్చకె క్కాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలకంగా ఉన్న పైలట్ రోహిత్‌రెడ్డి తాండూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి ఆ సీటు ఆశిస్తున్నారు. పరిగి నుంచి కొప్పుల మహేశ్‌రెడ్డి సిట్టింగా ఉండగా… డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి ఇక్కడి నుంచే సీటు అడుగుతున్నారు. వికారాబాద్‌లో సిటింగ్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఉండగా.. జడ్పీ వైస్ చైర్మన్ విజయకుమార్ బరిలో నిలవాలనే ఆకాంక్షతో ఉన్నారు. ఇక్కడి నుంచే డాక్టర్ ఆనంద్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. కొడంగల్‌లో పట్నం నరేందర్‌రెడ్డి సిటింగ్‌గా ఉండగా…మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి టికెట్ అడుగుతున్నారు.
చేవెళ్లలో సిటింగ్ ఎమ్మెల్యే కాలె యాదయ్యకు మాజీ మంత్రి కేఎస్ రత్నం పోటీగా ఉన్నారు. రాజేంద్రనగర్‌లో ప్రకా్‌షగౌడ్ సిటింగ్ ఎమ్మెల్యేగా ఉండగా… ఇదే టికెట్ కావాలని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, మంత్రి సబితారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి పట్టుబడుతున్నారు. మహేశ్వరంలో మంత్రి సబిత సిటింగ్‌గా ఉండగా… మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఈసారి తాడోపేడో తేల్చుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నారు. ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా… క్యామ మల్లేశ్, చంద్రశేఖర్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. కుత్బుల్లాపూర్ సిటింగ్ ఎమ్మెల్యేగా కేపీ వివేకానంద ఉండగా… ఇక్కడి నుంచి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు టికెట్ ఆశిస్తున్నారు. ఉప్పల్‌లో ఎమ్మెల్యే బి. సుభాష్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ వర్గాల మధ్య ఇప్పటికే పొసగడం లేదు. అదే సమయంలో బండా లక్ష్మారెడ్డి కూడా ఇక్కడ సీటు అడుగుతున్నారు. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి వచ్చిన దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక్కడ మొదటి నుంచీ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జిగా ఉన్న మన్నె గోవర్ధన్‌రెడ్డి ఈ సీటు దక్కించుకోవాలని బలంగా ప్రయత్నిస్తున్నారు కల్వకుర్తి నియోజకవర్గం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ ఉండగా, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, గోలి శ్రీనివాస్ రెడ్డి, బాలాజీ సింగ్ ఠాగూర్, మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ ఎవరికి వారే టికెట్ దక్కించుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
మహబూబ్‌నగర్, నల్లగొండలో ఇదే పరిస్థితి
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కొల్లాపూర్ నియోజకవర్గ వ్యవహారం గతంలోనే రచ్చకెక్కింది. ఫామ్‌హౌస్ వ్యవహారంలో ఉన్న కొల్లాపూర్ సిటింగ్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డికి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. అచ్చంపేటలో గువ్వల బాలరాజు సిటింగ్ కాగా… ఎంపీ రాములు కుమారుడు భరత్‌ప్రసాద్ ఇక్కడినుంచి ఈ సారి టికెట్ ఆశిస్తున్నారు. అలంపూర్ నుంచి అబ్రహం సిటింగ్‌గా ఉండగా… సింగర్ సాయిచంద్‌తోపాటు మాజీ ఎంపీ మందా జగన్నాథం రేసులో ఉన్నారు. కల్వకుర్తిలో సిటింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎ్‌సలో చేరిన కసిరెడ్డి నారాయణరెడ్డి మధ్య రాజకీయ యుద్ధం నడుస్తోంది. మక్తల్‌లో చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సిటింగ్‌గా ఉన్నా.. బీఆర్‌ఎస్ నేతలు దేవరమల్లప్ప, జగన్నాథరెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు.
జడ్చర్లలో లక్ష్మారెడ్డికి కాకుండా తనకే సీటివ్వాలని మన్నె జీవన్‌రెడ్డి అడుగుతున్నారు. ఉమ్మడి నల్లగొండ పరిధిలోని కోదాడ టికెట్ విషయమై బొల్లం మల్లయ్యయాదవ్‌తో మాజీ ఎమ్మెల్యే చందర్‌రావు, మరికొందరు పోటీపడుతున్నారు. తుంగతుర్తి నుంచి గ్యాదరి కిశోర్ ప్రాతినిధ్యం వహిస్తుండగా.. గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ మందుల సామ్యేల్ సీటు ఆశిస్తున్నారు. నకిరేకల్ సిటింగ్ అభ్యర్థిగా చిరుమర్తి లింగయ్య ఉండగా.. ఇక్కడి నుంచి టికెట్ ఇవ్వాలని వేముల వీరేశం కోరుతున్నారు. ఇటీవల ఎన్నో వ్యయప్రయాసల కోర్చి గెలుపొందిన మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి పోటీగా కంచర్ల కృష్ణారెడ్డి, కర్నె ప్రభాకర్, కర్నాటి విద్యాసాగర్ రేసులో ఉన్నారు. మిర్యాలగూడ టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి ఆశిస్తున్నారు. ఆలేరు నుంచి గొంగిడి సునీత ప్రాతినిధ్యం వహిస్తుండగా… ఈ టికెట్ కోసం మునుగోడు ఎన్నికల ముందు బీఆర్‌ఎ్‌సలో చేరిన బిక్షమయ్యగౌడ్ కూడా పోటీ పడుతున్నారు. భువనగిరి ఎమ్మెల్యేగా పైళ్ల శేఖర్‌రెడ్డి ఉండగా…ఎలిమినేటి సందీ్‌పరెడ్డి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నాగార్జునసాగర్‌లో నోముల భగత్ సిటింగ్‌గా ఉండగా… ఎమ్మెల్సీ కోటిరెడ్డి టికెట్ రేసులో ఉన్నారు. దేవరకొండ టికెట్‌ను మున్సిపల్ మాజీ చైర్మన్ దేవేంద్రనాయక్, రిటైర్డ్ మునిసిపల్ కమిషనర్ రామావత్ ధన్‌సింగ్ ఆశిస్తున్నారు.
ఖమ్మంలో నువ్వా? నేనా?
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు సీట్లలో నువ్వా? నేనా? అన్నట్టుగా పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో పాలేరులో కాంగ్రెస్ తరఫున గెలిచి బీఆర్‌ఎ్‌సలో చేరిన కందాల ఉపేందర్‌రెడ్డి స్థానాన్ని మాజీ మంత్రి, గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిన తుమ్మల నాగేశ్వర్‌రావు బలంగా ఆశిస్తున్నారు. కమ్యూనిస్టులతో పొత్తు ఖాయమని కేసీఆరే ప్రకటించిన నేపథ్యంలో ఈ సీటును సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీర భద్రం కూడా అడగనున్నారు. వైరా నుంచి గత ఎన్నికల్లో స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచిన రాములు నాయక్ బీఆర్‌ఎ్‌సలో చేరగా…అక్కడినుంచి మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ టికెట్ రేసులో ఉన్నారు. సత్తుపల్లి నుంచి టీడీపీ తరఫున గెలిచిన సండ్ర వెంకటవీరయ్య.. ఆ తర్వాత బీఆర్‌ఎ్‌సలో చేరారు. 2018 ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీచేసి ఓడిపోయిన పిడమర్తి రవి, మరోనేత మట్టా దయానంద్ ఈ సారి పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. ఇక కొత్తగూడెం బీఆర్‌ఎ్‌సకు చిక్కుముడిలా తయారైంది. ఇక్కడ వనమా వెంకటేశ్వర్‌రావు సిటింగ్‌గా ఉండగా… జలగం వెంకట్రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టికెట్ బరిలో ఉన్నారు.
వామపక్షాలతో పొత్తు నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కూడా ఇక్కడి నుంచే బరిలోకి దిగాలన్న ఆకాంక్షతో ఉన్నారు. ఇల్లందులో కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్‌ఎ్‌సలో చేరిన హరిప్రియ సిటింగ్‌గా ఉండగా… మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య టికెట్ ఆశిస్తున్నారు. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావుకు బదులుగా తనకే టికెట్ ఇవ్వాలని గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిన పాయం వెంకటేశ్వర్లు టికెట్ ఆశిస్తున్నారు. ఇక, ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. వరంగల్ తూర్పు నుంచి నన్నపనేని నరేందర్ సిటింగ్ ఎమ్మెల్యేగా ఉండగా..ఇక్కడినుంచి మాజీ ఎంపీ గుండు సుధారాణి టికెట్ ఆశిస్తున్నారు. పరకాలలో సిటింగ్ చల్లా ధర్మారెడ్డి ఉండగా…రైతు రుణవిముక్తి కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు సీటు ఆశిస్తున్నారు. భూపాలపల్లి టికెట్ ఇవ్వాలని మాజీ స్పీకర్ మధుసూధనాచారి బలంగా అడుగుతున్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యేగా శంకర్‌నాయక్ ఉండగా… ఎంపీ మాలోతు కవిత ఇదే స్థానం అడుగుతున్నారు. డోర్నకల్‌లో సిటింగ్‌గా రెడ్యానాయక్ ఉండగా… మంత్రి సత్యవతి రాథోడ్ టికెట్ ఆశిస్తున్నారు.
కరీంనగర్, ఆదిలాబాద్‌లో కొన్ని స్థానాల్లోనే
కరీంనగర్ జిల్లాలోని మానకొండూర్‌లో రసమయి బాలకిషన్ సిటింగ్‌గా ఉండగా… కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎ్‌సలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, బీఆర్‌ఎస్ నేత ఓరుగంటి ఆనందం టికెట్ రేసులో ఉన్నారు. చొప్పదండిలో సుంకె రవిశంకర్ సిటింగ్‌గా ఉండగా..ఇక్కడి నుంచి ఒక జడ్పీటీసీ సభ్యుడు, కరీంనగర్‌కు చెందిన ఒక కార్పొరేటర్ టికెట్ ఆశిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్‌ఎ్‌సలో చేరిన ఆత్రం సక్కు ఉండగా…గత ఎన్నికల్లో ఆ స్థానం నుంచే టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన కోవా లక్ష్మి టికెట్ ఆశిస్తున్నారు. బోథ్‌లో రాథోడ్ బాపూరావు సిటింగ్‌గా ఉండగా…ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ జనార్దన్ రాథోడ్ టికెట్ అడుగుతున్నారు. బైంసాలో సిటింగ్ ఎమ్మెల్యే విఠల్ ఉండగా.. టీఎ్‌సఐడీసీ చైర్మన్ సముద్రాల వేణుగోపాలాచారి టికెట్ ఆశిస్తున్నారు.
నిజామాబాద్, మెదక్‌లో తక్కువ పోటీ
ఉమ్మడి నిజామాద్ జిల్లాలో సిటింగ్‌లకు పెద్దగా పోటీలేదు. కామారెడ్డిలో మాత్రం విప్ గంప గోవర్థన్‌కు బదులుగా తనకు సీటు ఇవ్వాలని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్ అడుగుతున్నారు. అంతకుమించి ఈ జిల్లాలో పెద్దగా పోటీలేదు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ జిల్లాలోను టికెట్ల కోసం పెద్దగా పోటీ లేదు. ఒక్క నర్సాపూర్‌లో మాత్రం సిటింగ్ మదన్‌రెడ్డి స్థానంలో తనకు అవకాశమివ్వాలని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు. పటాన్‌చెరువు సీటు కోసం ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి పోటీపడుతున్నారు