Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కేంద్ర ప్రభుత్వం పై నిందలు మోపడం కేసిఆర్ మానుకోవాలి

బోధన్, అక్టోబర్ 23, (నిజం న్యూస్ )

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీపథకం నిధులను నిబంధనలకు విరుద్ధంగ సుమారు రూ. 152 కోట్ల నిధులను దారిమళ్లించి కేంద్రంపై నిందలు మోపడం కేసీఆర్ ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనమని బిజెపి సీనియర్ నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన విలేకరుల సమావేశం లో మాట్లాడు తు ఉపాధి హామీ కూలీలకు కేంద్రమే నేరుగా వారి అకౌంట్లలో పైసలు వేసేలా చర్యలు చేపట్టడమే కాకుండా,.. కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్రాల ప్రభుత్వాలు సొంత స్కీమ్​లకు మళ్లించకుండా కట్టడి చేసేందుకు సిద్ధమవ్వడంతో కేసీఆర్ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోందన్నారు. అందుకే దొంగ దీక్షలు, నిరసనలకు పూనుకుందని చురకలు అంటించారు.

 

రైతులకు రుణమాఫీ చేయకుండా, రైతు సంక్షేమానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం స్కీములు, సబ్సిడీలు, ప్రోత్సాహకాలను అడ్డుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఉచిత ఎరువుల పేరుతో రైతులను ఏమార్చి.. ఫసల్ బీమా యోజన పథకానికి మోకాలడ్డుతూ అబద్ధాలతో కాలం వెల్లదీస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజులు వచ్చాయన్నారు. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని.. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తెస్తామని నమ్మబలికి చివరికి రైతులను నట్టేట ముంచి.. రైతులను మరోసారి మభ్యపెట్టేలా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం సిగ్గుమాలిన చర్య అన్నారు. ఇకనైనా బీఆర్ఎస్ తీరు మార్చుకోకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు దిమ్మతిరిగిపోయే తీర్పునిచ్చి.. కేసీఆర్ సర్కారును బంగాళాఖాతంలో కలుపుతారని ఆయన హెచ్చరించారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం, నరేంద్ర మోడీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లేలా జనంతోనే మనం- గడపగడపకు బిజెపి కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకునేలా నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ మద్దతు లభిస్తోంది. మేడపాటి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు బోధన్ నియోజకవర్గంలోని ఎరాజ్ పల్లి, బేలాల్, అమ్దాపూర్, ఊట్ పల్లి, రాజీవ్ నగర్ తండాల మీదుగా కొనసాగిన ఈ కార్యక్రమానికి బిజెపి శ్రేణులు, అభిమానులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. మేడపాటి గారు బోధన్ మండలంలోని పలు గ్రామాల్లో గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు వారు చెప్పిన కష్టాలు విన్నారు. కన్నీళ్లు తుడిచి అండగా మేముంటామనే భరోసా కల్పించారు. ఎక్కడికెళ్లినా టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక పాలనపై జనం మండిపడుతూనే, ఎనిమిదేండ్ల మోసానికి గుణపాఠం చెప్పేందుకు సిద్దమయ్యామని జనం అభిప్రాయం వ్యక్తం చేశారు.

 

నియోజకవర్గంలో ఏ గడపకెళ్లినా ప్రజా సమస్యలపైనే గోడు వెల్లబోసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, నిరంకుశ ధోరణితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పుకొచ్చారు. ఎనిమిదేండ్లలో ఎన్నో హామీలిచ్చి.. పేద ప్రజల కోసం చేసిందేమీ లేదంటూ కేసీఆర్ సర్కారుపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ లు నిర్మిస్తామని చెప్పి.. ఇంతవరకు అర్హులకు ఒక్క ఇల్లు కేటాయించలేదని ఎరాజ్ పల్లి, బేలాల్, ఊట్పల్లి వాసులు మండిపడ్డారు. నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్లు ఇవ్వకుండా, భృతి చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర వహిస్తోందని ఆగ్రహించారు. ధరణి నుంచి మొదలు.. భారీ ప్రాజెక్టులు, సర్కారీ పథకాల వరకు అన్నీ అవినీతిమయంగానే మారిపోయాయని,… అందుకే, దోపిడీ కేసీఆర్ సర్కారుకు బుద్ధి చెప్పాలంటే రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు రావాల్సిందేనంటూ ప్రజలు ఆకాంక్ష వ్యక్తం చేశారు.

 

జనంతోనే మనం- గడపగడపకు బిజెపి కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం అవినీతి, అరాచక, నిరంకుశ పాలనపై శ్రీ మేడపాటి ప్రకాష్ రెడ్డి విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ పేరుతో రాష్ట్రాన్ని దోచుకున్నది చాలక.. బీఆర్ఎస్​పేరుతో దేశాన్ని దోచుకోవడానికి కల్వకుంట్ల కుటుంబం బయల్దేరిందన్నారు. మితిమీరిపోయిన అవినీతితో తన కుటుంబంపై వస్తున్న ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కొత్త నాటకాలకు తెరదీస్తూ బిజెపిపై నిందారోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. అనేక రాష్ట్రాలు నరేంద్ర మోడీ ప్రభుత్వ పథకాలను చక్కగా వినియోగించుకుంటూ పురోభివృద్ధి సాధిస్తుంటే… కేసీఆర్ ప్రభుత్వం మాత్రం అవినీతిలో కొట్టుమిట్టాడుతూ ప్రజలకు అందాల్సిన సంక్షేమాన్ని మరిచిందన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రభుత్వ అప్పులు రూ.4 లక్షల కోట్లు దాటాయని.. అధికారం నిలుపుకోవడానికి అధికార పార్టీ చేస్తున్న అప్పులు రాష్ట్ర ప్రజల నెత్తి మీద భారమవుతున్నాయని మేడపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరికి దోచి పెడుతున్న సందర్భంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి బలమున్న వర్గాలకు తాయీలాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఈ అప్పులు చేస్తున్నట్టుగా కనిపిస్తోందని ఆరోపించారు.ఈ కార్యక్రమం బీజేపీ నాయకులు మోహనరెడ్డి, పట్టణ అధ్యక్షులు బాలరాజు, మండల అధ్యక్షులు పోశెటి, సుధాకర్ చారి, అశోక్, సుదర్శన్, తదితరులు పాలుగోన్నారు.