విద్యాశాఖ సంచాలకుల కార్యాలయంలో కనబడని సమాచార హక్కు బోర్డు

*రాష్ట్రస్థాయి కార్యాలయంలో అధికారుల నిర్లక్ష్యం*
హైదరాబాద్ డిసెంబర్ 18(నిజం న్యూస్)
ప్రభుత్వ యంత్రాంగాలన్నీ ప్రజలకు జవాబుదారీగా ఉండే విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా సమాచార హక్కు చట్టాన్ని దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకువచ్చినా ఇంకా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల సమాచార హక్కు చట్టం అమలులో వెనుకబడి పోతుంది. ఇదేమీ మండల జిల్లా స్థాయి కార్యాలయాల నిర్లక్ష్యం అనుకుంటే మనం పొరపడినట్లే. సాక్షాత్తూ రాష్ట్ర స్థాయి కార్యాలయంలోనే కావడం గమనార్హం. సమాచార హక్కు చట్టం గురించి ప్రజలకు స్వచ్ఛందంగా అందించాల్సిన బాధ్యతను అధికారులు ఏవిధంగా అందిస్తున్నారో ఈ కార్యాలయంలో అధికారుల నిర్లక్ష్యాన్ని చూస్తే అర్థమవుతుంది. కమీషనర్ మరియు డైరక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం అమలు సంగతి అటుంచితే కనీసం పౌర సమాచార అధికారుల వివరాలు తెలిపే బోర్డ్ కూడా ఏర్పాటు చేయలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గంగాధర కిశోర్ కుమార్ అనే సమాచార కార్యకర్త తాను ఐదు నెలల క్రితం పెట్టిన దరఖాస్తుకు ఎలాంటి సమాధానం రాకపోవడంతో తెలంగాణ రాష్ట్ర డైరక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయానికి వెళ్లి ఆరా తీయగా తన దరఖాస్తును ఎవరూ పట్టించుకోలేదని అర్థమైంది. పౌర సమాచార అధికారుల వివరాలు మూడు అంతస్తులు తిరిగినా ఎక్కడా కనిపించకపోవడంతో సిబ్బందిలో ఒకరిని అడిగాడు. అతను గ్రౌండ్ ఫ్లోర్ లో పెద్ద బోర్డ్ ఉంటుందని నవ్వుతూ బదులిచ్చాడు. కానీ గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా సమాచార అధికారుల వివరాలు తెలిపే బోర్డ్ ఎక్కడా లేదు. నిరాశగా ద్విచక్ర వాహనాలు నిలిపే స్థలం నుండి వస్తుండగా ఆ పక్కనే ఓ చెట్టు క్రింద చెత్తలో అనాధగా దర్శనమిచ్చింది సమాచార బోర్డ్. అది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పటిది. రాష్ట్ర స్థాయి కార్యాలయంలోనే సమాచార హక్కు చట్టం పరిస్థితి ఇలా ఉంటే ఇక జిల్లా, మండల స్థాయి కార్యాలయాల్లో ఎలా ఉంటుందో ఊహించవచ్చు. తెలంగాణ మోడల్ స్కూల్ జాయింట్ డెరైక్టర్ కు సమాచార కమిషన్ పదహారు వేల రూపాయల జరిమానా విధించి నెల రోజులు కూడా కాలేదు. అయినా అధికారుల చర్యలలో ఎలాంటి మార్పూ రాలేదు. రాష్ట్ర స్థాయి కార్యాలయాల్లో, ఉన్నతాధికారుల దృష్టిలో కూడా సమాచార హక్కు చట్టంపై చిన్న చూపు ఉందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది. ఇకనైనా తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ ఈ విషయంపై దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి పరిస్థితుల్లో మార్పు వస్తుంది.