చండూరులో 100 పడకల ఆసుపత్రి లేనట్లే ?

చండూరు ,నవంబర్ 2 (నిజం న్యూస్), చండూరులో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు అయ్యే అవకాశాలు లేనట్లుగా తెలుస్తోంది . మంత్రి కేటీఆర్ గురువారం మునుగోడులో జరిగిన సమీక్ష సమావేశంలో నియోజకవర్గంలో అందరికీ అనువైన చోట ఎమ్మెల్యే నిర్ణయం మేరకు 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు అవుతుందంటూ ప్రకటించారు. దీంతో చండూరులో ఏర్పాటు అనుమానంగా మారింది. అయితే ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాత్రం చండూరులో 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామంటూ ఇటీవల చండురులో జరిగిన సమీక్ష సమావేశంలో వెల్లడించారు. చండూరు మండల కేంద్రం చుట్టుపక్కల మండలాలకు అనుకూలమైన దూరంలో ఉన్నందున చండూరులోనే 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలంటూ స్థానికులు కోరుతున్నారు. అత్యవసర వైద్య సేవలు అవసరపడితే నల్గొండ లేదా హైదరాబాద్ వరకు వెళ్లాల్సి వస్తోందని అక్కడికి వెళ్లేసరికి జరగాల్సిన నష్టం జరుగుతుందంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి హరీష్ రావు ఇచ్చిన మాట మేరకు చండూర్ లోనే ఏర్పాటు చేయాలని ఈ మేరకు స్థానిక ప్రజాప్రతినిధుల సైతం కృషి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వంద పడకల ఆసుపత్రి నియోజకవర్గం లో ఎక్కడ ఏర్పాటు చేస్తారనేది వేచి చూడాల్సి ఉంది.