Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అమరవీరుల ఆశయాలకు తిలోదాకాలిస్తున్న రాష్ట్ర సర్కార్

ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిక
పోలీస్ కిష్టయ్యకు నివాళులర్పించిన మాజీమంత్రి ఈటెల

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వందలాదిమంది బలిదానాలు చేసుకుని తీసుకువచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని అమరవీరుల ఆశయాలకు విరుద్ధంగా కొనసాగిస్తూ అమరుల బలిదానాలకు వారి ఆత్మ త్యాగాలకు విలువ లేకుండా చేస్తున్న సర్కారు తీరుపై మాజీ మంత్రి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.తెలంగాణ ఉద్యమ మలిదశ పోరులో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం యువకులు బలికావద్దని తన ఆత్మహత్యతోనైనా తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలని తపనతో సెల్ టవర్ ఎక్కి తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని బలిదానం చేసిన పుట్టకొక్కుల కిష్టయ్య ముదిరాజ్ 13వ వర్ధంతి సభను పురస్కరించుకొని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద ఏర్పాటుచేసిన సంస్మరణ సభలో ఈటెల పోలీస్ కిష్టయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం ఎందరో మంది యువతి,యువకులు ఆత్మహర్పణం చేసుకుంటే ప్రస్తుత ప్రభుత్వం వారి ఆశయాలు కనుగుణంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు నీళ్లు, నిధులు నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనుసరిస్తున్న విధానాల వల్ల కొందరు మాత్రమే బాగుపడుతున్నారని మిగతావారు ఇలాంటి ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులకు గురవుతున్న సర్కారు పట్టించుకోవడంలేదని ఆయన విమర్శించారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పడితే తమ కలలు సాకారం అవుతాయని నమ్ముకున్న కోట్లాది తెలంగాణ ప్రజలను ముఖ్యమంత్రి పూర్తిగా వంచిస్తూ నియంతృత్వంగా వ్యవహరిస్తూ పరిపాలన సాగించడాన్ని ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు.నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పిన ముఖ్యమంత్రి ఆయన కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తూ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువకులను పూర్తిగా మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేని పరిస్థితిలో ముఖ్యమంత్రి ఉన్నాడని ఇందుకు నిదర్శనం నిరుద్యోగ యువతీ యువకులకు తమ ప్రభుత్వం ఏర్పడితే 3016 నిరుద్యోగ భృతి కల్పిస్తానని ఇంతవరకు కల్పించకపోవడం నిరుద్యోగ యువకులను మోసం చేయడమేనని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతుందని ఈ పాలనకు చరమగీతం పాడకుంటే తెలంగాణ ప్రజలు మరింత వెనక్కి వెళ్లాల్సి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అందుకు విరుద్ధంగా నియంతృత్వ పాలన కొనసాగిస్తున్న రాష్ట్ర సర్కారును సాగనంపేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న సంగతి ముఖ్యమంత్రి మర్చిపోవద్దని ఈటెల హెచ్చరించారు.తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చొప్పరి శంకర్ ముదిరాజ్, ముదిరాజ్ సంక్షేమ పరిషత్ అధ్యక్షులు అల్లదుర్గం సురేష్ ముదిరాజ్ తదితరులు మాట్లాడుతూ ముదిరాజులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఆసక్తి కనబరచడం లేదని ఆరోపించారు. గత మూడు నాలుగు దశాబ్దాలుగా ముదిరాజులు బీసీ డీ నుండి బీసీఏలోకి మార్చాలని ఉద్యమాలు చేపడితే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవో నెంబర్ 15 ద్వారా 2009లోనే ముదిరాజులను బీసీఏలోకి మార్చగా దానిని కొందరు హైకోర్టుకు వెళ్లి కొట్టి వేయించారని అన్నారు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు వారు వివరించారు ఇటీవలనే దాదాపు 12 సంవత్సరాల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత ముదిరాజులను బీసీ ఏలోకి చేర్చే అంశాన్ని బీసీ కమిషన్ వద్ద తేల్చుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బీసీ కమిషన్ ద్వారా ముదిరాజులను బీసీఏలోకి మార్చాలని వారు డిమాండ్ చేశారు. బీసీఏ సాధన తో పాటు రాష్ట్రంలో ముదిరాజుల పై జరుగుతున్న సామూహిక అత్యాచారాలు సాంఘిక బహిష్కరణలు ఇతర దాడులను వెంటనే అరికట్టాలని లేనిపక్షంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ముదిరాజ్ సామాజిక వర్గ వ్యతిరేక చర్యలపై అన్ని సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు దేవ్ సాంబయ్యముదిరాజ్, మెపా నల్లగొండ జిల్లా అధ్యక్షులు కట్ల సైదులు ముదిరాజ్,వి కే మహేష్ ముదిరాజ్ ,సుధాకర్ ముదిరాజ్ , తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర మహిళా విభాగం మాజీ కన్వీనర్ కోలా వనిత ముదిరాజ్, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు సలెందర్ శివయ్య ముదిరాజ్, ఓయు జేఏసీ నాయకులు మద్దెల సంతోష్ముదిరాజ్ ,లక్ష్మీ గారి ఆంజనేయులు ముదిరాజ్ ,పండుగ ప్రభాకర్ శివకుమార్ ముదిరాజ్, మత్స్య సహకార సంఘం అధ్యక్షులు పందిరి శ్రీనివాస్ ముదిరాజ్ ,ముదిరాజ్ వాణి సంపాదకులు ఉప్పరి నారాయణ ముదిరాజ్ గ్రేటర్ హైదరాబాద్ యువజన విభాగం అధ్యక్ష కార్యదర్శులు పోల్కం ప్రశాంత్, గుండు నరసింహ, మహిళా నాయకురాలు నీరజ ముదిరాజ్ సోషల్ మీడియా ఇంచార్జ్ శివకుమార్ ముదిరాజ్, ఉజ్జయిని మహంకాళి ఆలయ సభ్యులు దాకి అశోక్ ముదిరాజ్ ,పటాన్చెరుకు చెందిన పి నరసింహ ముదిరాజ్ ,నాయకులుబొమ్మరాగోని రాజు ముదిరాజ్,బండి కృష్ణ ముదిరాజ్ మహిళా నాయకురాలు కోట్ల పుష్పలత ముదిరాజ్, నిజామాబాద్ జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి జక్కం కార్తీక్ ముదిరాజ్ ఈటెల యువసేన ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ సలేంద్ర క్రాంతి కుమార్ ముదిరాజ్, అల్లం శ్రీనివాస్ ముదిరాజ్ తో పాటు రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన ముదిరాజ్ సంఘం ప్రతినిధులు పాల్గొని పోలీస్ కిష్టయ్యకు నివాళులు అర్పించినారు.