ధాన్యం బిల్లుల చెల్లింపులు వేగవంతం చేయాలి కలెక్టర్

నిజామాబాద్ రూరల్ నవంబర్ 28, (నిజం న్యూస్ ):
కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి సేకరించిన ధాన్యానికి సంబంధించి బిల్లుల చెల్లింపులను వేగవంతం చేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ వివిధ అంశాలపై కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేసిన నిర్ణీత వ్యవధిలోపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని డీసీఓ సింహాచలం, డీఆర్డీఓ చందర్, మెప్మా పీడీ రాములు ను ఆదేశించారు. కాగా, శాఖాపరమైన పనులు
పెండింగ్లో ఉండకుండా, వెంటదివెంట పూర్తి చేయాలని అధికారులకు హితవు పలికారు. హరితహారం కార్య క్రమానికి అన్ని శాఖలు ఎనలేని ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి కార్యాలయం ఆవరణ పచ్చదనంతో కళకళలాడాలని, రహదారులకు ఇరువైపులా మొక్కల పెంపకం, నిర్వహణ సక్రమంగా జరిగేలా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ సూచించారు. పోడు భూములకు సంబంధించి డివిజనల్ స్థాయి సమావేశాలను సోమవారం సాయంత్రం నాటికే పూర్తి చేయాలని ఆర్డీఓలను ఆదేశించారు.