డ్రాప్ రో-బాల్ జాతీయ క్రీడాకారిణి కి సన్మానం

నిజం న్యూస్, చండూరు, ఈనెల 18 నుండి 20వ తేదీ వరకు ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో జరిగిన 13వ సీనియర్ నేషనల్ డ్రాప్ రో-బాల్ ఛాంపియన్ షిప్- 2022 పోటీలలో స్థానిక గాంధీజీ విద్యాసంస్థల తొమ్మిదవ తరగతి విద్యార్థిని ఎం.డి. రుక్సార్ పాల్గొని ప్రతిభ చాటడంతో ఎంఈఓ గురువారావు, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు గురువారం పాఠశాలలో అభినందించారు. ఉత్తర ప్రదేశ్, పాండిచ్చేరి రాష్ట్రాలతో గెలుపొంది, సెమీఫైనల్ లో హిమాచల్ ప్రదేశ్ చేతిలో ఓటమి చెందింది. జాతీయస్థాయి పోటీలలో పాల్గొని సెమీఫైనల్ వరకు పోరాట స్ఫూర్తిని కనబరిచిందన్నారు. అలాగే ఈ విద్యార్థిని అభినందించడంతోపాటు 22న జనవిజ్ఞాన వేదిక తెలంగాణ వారు చెకుముకి సైన్స్ సంబురాలు- 2022లో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మండల స్థాయి చెకుముకి టాలెంట్ పరీక్షలో గాంధీజీ విద్యాసంస్థలకు చెందిన ఎం.లత 10వ తరగతి, బి. స్ఫూర్తి 9వ తరగతి, T. నేహశ్రీ 8వ తరగతి ముగ్గురు విద్యార్థులు మండల మొదటి ర్యాంకు సాధించినందుకు గాను పాఠశాలలో ఏర్పాటుచేసిన అభినందన సభలో మండల విద్యాధికారి గురువారావు విద్యార్థుల్ని ఘనంగా సన్మానించి, అభినందించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఉన్న గాంధీజీ విద్యాసంస్థలు జాతీయ క్రీడాకారులను తయారు చేస్తున్నందుకు అభినందిస్తూ, ఎం.డి. రుక్సార్ ను రాబోయే రోజుల్లో జాతీయస్థాయిలో తెలంగాణ రాష్ట్రం తరఫున పాల్గొని, ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో గెలుపొందాలని ఆశించారు.

ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపాల్ చెరుపల్లి రామయ్య, స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ వినోద్ కుమార్, ట్రైనర్ రెహమత్, వెంకట్రావు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.