సామాజిక సమస్యలపై అక్షరంతో యుద్ధం చేసిన ప్రజాకవి కాళోజీ

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో నవంబర్ 14(నిజం న్యూస్)
సమకాలీన, సామాజిక సమస్యలపై నిక్కచ్చిగా, నిర్మోహమాటంగా పాలకులపై అక్షరాయుధాలను సంధించి ఎదిరించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు అని సాహితీవేత్త శ్రీనివాసాచార్యులు అన్నారు. ఆదివారం స్థానిక కాచరాజు మినీ హాల్ లో జరిగిన కాళోజీ నారాయణరావు వర్థంతి సందర్భంగా, ఘణంగా నివాళులు అర్పించారు. సమాజంలోని అన్యాయాలను సహించలేక నా గొడవ లో “అన్యాయాన్ని ఎదిరిస్తే – నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే – నా గొడవకు ముక్తి ప్రాప్తి, అన్యాయాన్ని ఎదిరించిన వాడే- నాకు ఆరాధ్యుడు” అని నినదించిన మహా కవి కాళోజీ నారాయణరావు అని వారన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలోని రట్టిహళ్ళి గ్రామం లో జన్మించిన కాళోజీ కుటుంబం ఆ తర్వాత వరంగల్ జిల్లా మడికొండ లో స్థిరపడ్డారు. కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ,కన్నడ, మరియు ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యం కల్గిన కవి కాళోజీ నారాయణరావు అని వారన్నారు.1930 సంవత్సరాలో గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొని 1939, మరియు 1943లో జైలు జీవితం గడిపిన గొప్ప ఉద్యమకారుడు కాళోజీ అని వారన్నారు.1969 ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ద్వారానే తెలంగాణ కు న్యాయం జరుగుతుందని వారన్నారు. మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు,పి. వి. నర్సింహారావు, సురవరం ప్రతాపరెడ్డి మరియు జమలాపురం కేశవరావు లాంటి గొప్ప గొప్ప నాయకులతో ప్రత్యేకంగా కలిసి ఉద్యమంలో పాల్గొన్న మహా నాయకుడు కాళోజీ నారాయణరావు అని వారన్నారు.1953 సంవత్సరంలో తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గా ఎన్నికైన కాళోజీ,1958 లో ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి శాసనమండలి కి ఎన్నికైనారు. కాళోజీ సేవలను గుర్తించిన కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్,1992లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ తో గౌరవించడం మనల్ని మనం గౌరవించుకోవడమే అని వారన్నారు. తెలంగాణ కవుల సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కాచరాజు జయప్రకాష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సామాజిక ఉద్యమ నాయకులు, కవులు, పాలకుర్తి రాంమూర్తి, బట్టు రామచంద్రయ్య, చందుపట్ల వెంకటేశ్వరరావు, జి.రాజ్యలక్ష్మి, కృష్ణమూర్తి, దరిపెళ్ళి ప్రవీణ్ కుమార్ , కొడారి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.