చట్టాలపై అవగాహన పెంచుకుని, నేర రహిత సమాజం కోసం కృషి చేయాలి*. జిల్లా న్యాయమూర్తి …వి.బాల భాస్కర్ రావు

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో నవంబర్ 07(నిజం న్యూస్)
ప్రజలందరూ చట్టాలపై అవగాహన పెంచుకొని, సమాజంలో నేరాలు జరగకుండా చూడాలని జిల్లా న్యాయమూర్తి, భువనగిరి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ బాల భాస్కర్ రావు కోరారు.ఆదివారం మండలంలోని అనంతారం గ్రామంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సు లో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా న్యాయ సేవల గురించి ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలని జిల్లా లో మొదటి సదస్సు అనంతారం గ్రామంలో నిర్వహిస్తున్నామన్నారు. విద్యా హక్కు చట్టం-2009 ప్రకారం బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలని,పిల్లలచేత పనులు చేయిస్తే చట్ట ప్రకారం లక్ష రూపాయల జరిమానా, రెండు సంవత్సరాల జైలుశిక్ష విదిస్తారని ఆయన తెలిపారు.పిల్లలపై అఘాయిత్యాలు రోజురోజుకి పెచ్చరిల్లిపోతున్నాయని,వాటి నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. పిల్లలను ఆడ,మగా అని వివక్ష లేకుండా పెంచాలని ఆయన కోరారు. వంద రూపాయల విలువ కంటే ఎక్కువ భూమిని కొనుగోలుకు,ధరణి పోర్టల్ ద్వారా తహసిల్దార్ కార్యాలయం లో మాత్రమే క్రయ విక్రయాలు జరుపాలని ఆయన కోరారు. భూముల సమస్యలను కోర్టు ద్వారా పరిష్కారం చేసుకోవాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందాలని ఆయన కోరారు. వయో వృద్ధుల సంరక్షణ చట్టం -2007 ప్రకారం వారి తల్లిదండ్రుల బాగోగులు పిల్లలు తప్పనిసరిగా చూడాలని ఆయన కోరారు. చట్టం దృష్టిలో అందరూ సమానమేనని, ఒకరు ఎక్కువ,ఒకరు తక్కువ కాదని ఆయన అన్నారు. ప్రజలందరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, అందుకు న్యాయ విజ్ఞాన సదస్సు లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అనంతరం చట్టాలపై అవగాహన కల్పించేందుకు కరపత్రాలు పారా లీగల్ వాలంటీర్లు పంపిణీ చేశారు.ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ చిందం మల్లికార్జున్, భువనగిరి రూరల్ ఎస్ఐ రాఘవేందర్, ఎంపిటిసి సామల వెంకటేష్,ఉప సర్పంచ్ విఠల్ వెంకటేష్, పంచాయతీ కార్యదర్శి నర్సింగ్ రావు, ప్యానల్ అడ్వకేట్ శంకర్, పారా లీగల్ వాలంటీర్లు కొడారి వెంకటేష్, కానుగంటి శ్రీశైలం, మాటూరి బాలేశ్వర్, మండల న్యాయ సేవాధికార సంస్థ బాధ్యులు నర్సింహ్మరావు, వార్డు సభ్యులు, విబికె పద్మ, అంగన్వాడీ కార్యకర్త విజయలక్ష్మి, సూపర్వైజర్లు, మహిళలు, గ్రామ ప్రజలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.