ముఖ్యమంత్రి ఎంచుకున్న లెంకలపల్లిలో అభివృద్ధి లెక్కెంత…?

*దళిత వాడలో ఇంటింటికి రాని మిషన్ భగీరథ నీళ్లు..*
*బిందెడు నీళ్ళ కోసం బారులు తీరిన జనం*
*మురుగుకాలువలు లేక బురదతో నిండిన రోడ్లు..*
*ప్రతిరోజు ప్రచారంలో మందు విందు..*
లెంకలపల్లి…మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండలంలో ఓ సాధారణ వ్యవసాయాధారిత గ్రామం.మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా లెంకలపల్లి గ్రామానికి ఇంచార్జ్ గా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యతలు తీసుకోవడంతో ఒక్కసారిగా రాష్ట్రం మొత్తం ఈ గ్రామంపై దృష్టి సారించింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంచుకున్న గ్రామంలో
నిజం న్యూస్ బ్యూరో ఓటర్ల ఉద్దేశ్యాన్ని,ఇక్కడి సమస్యలను,తెరాస పాలనను తెలుసుకునే ప్రయత్నంలో చేసిన సర్వేలో భాగంగా ఈ క్రింది విషయాలు వెల్లడయ్యాయి.
740 కుటుంబాలు ఉన్న లెంకలపల్లిలో 1826 మంది ఓటర్లున్నారు.వారిలో పురుషులు 904 కాగా,మహిళలు 922 మంది ఉన్నారు.వీరేగాక కొత్త ఓటర్లుగా నమోదు అయిన వారు మరో 50 మంది వరకు ఉంటారు. ఉపఎన్నిక నగారా మోగడంతో ఊరంతా వివిధ పార్టీల నాయకుల రాకపోకలతో కోలాహలంగా మారింది. పార్టీల ప్రచార పర్వంతో,రోజుకో నాయకుని రోడ్డుషోతో పల్లెటూరు హోరెత్తుతుంది.మద్యం,మాంసం వాసనలతో గుప్పుమంటుంది.
*దళితవాడ వెతలు*
ఊరిచివర ఉన్న దళిత వాడలకు వెళ్లిన నిజం న్యూస్ బృందానికి బురదమయమైన రోడ్లు దర్శనం ఇచ్చాయి….మురికి కాలువల నిర్మాణం చేపట్టక పోవడం వలన చిన్నపాటి వర్షానికి కూడా రోడ్లు జలమయమవుతున్నాయని జనం తమ గోడును వెళ్లబోసుకున్నారు.
*మిషన్ భగీరథ నల్లాలో,మురికి నీళ్లు*
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టుకు సంబంధించిన ఓవర్ హెడ్ ట్యాంక్ ఎస్సీ కాలనీ పక్కనే ఉన్నప్పటికీ,దళితవాడలో ఇంటింటికి మిషన్ భగీరథ రక్షిత మంచి నీళ్లు అందటం లేదని తేలింది.కాలనీ మొత్తం ఒకే కుల్లాయి దగ్గర మంచి నీళ్ళు పట్టుకుంటున్నారు.అవి కూడా అపరిశుభ్రంగా వస్తున్నట్లు స్థానిక మహిళలు తెలిపారు.ఇంటి పనులన్నీ వదిలిపెట్టి నీళ్ల కోసం బారెడు లైన్లో నిలబడాల్సిన పరిస్థితి ఉందని స్థానిక అడబిడ్డలు వాపోయారు.
ఇక గ్రామంలోని మూడో వార్డులో నీటి సరఫరా, రక్షిత త్రాగునీరు గురించి గ్రామ అధికారులకు ఎన్నిసార్లు నివేదించినా రాలేదని 50వేల రూపాయల సొంత ఖర్చుతో పైప్ లైన్ వేసుకున్నాం అని కల్వరి అంజయ్య తెలిపారు.
*మూడెకరాల భూమి ఉత్త ముచ్చటే*
భూమిలేని నిరుపేద దళితులకు ప్రభుత్వం ఇస్తామన్న మూడెకరాల భూమి ఇప్పటివరకు ఎవరికీ అండలేదని,దళిత బంధు పథకం మొదలెయ్యి రెండేళ్లు కావస్తున్నప్పటికీ ఏ ఒక్కరికీ లబ్ది చేకూరలేదని తేలింది.
*రైతు బంధు నిజమైన రైతుకు బంధువవ్వాలి*
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలలో రైతు బంధు పథకం గ్రామంలోని పట్టదారులందరికీ అందుతున్నప్పటికీ అధిక శాతం ఉన్న కౌలు రైతులకు ఏమాత్రం ఉపయోగకరంగా లేదని,కౌలు రైతులకు అండగా ఉండేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
మరోవైపు ప్రభుత్వం అందిస్తున్న సబ్సీడీ ఎరువులు,మందులు సరిపోను రావడం లేదని వాపోయారు.రైతు రుణమాఫీ ప్రకటన హామీగానే మిగిలిందని,వ్యవసాయానికి మేలు చేసేలా త్వరలో నిర్ణయం తీసుకోవాలని గ్రామ రైతులు కోరుతున్నారు.
*ఫించను ఠంచనుగా రావాలె*
ఇక ఆసరా ఫించన్ల విషయానికొస్తే ఇంటికి ఒకరికి మాత్రమే అందుతున్నట్లుగా తెలిపారు. ఇది అందరికీ అమలుచేయాలని,కొత్త ఫించన్ల మంజూరీలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లుగా తేలింది. వచ్చే ఫించన్లు నెల మధ్యలో ఇస్తున్నారని తెలిపారు.
రాజ గోపాల్ రెడ్డి రాజీనామా తర్వాతే పెండింగ్లో ఉన్న ఫించన్లకు,కళ్యాణలక్ష్మీ కేసిఆర్ కిట్ల డబ్బులకు మోక్షం లభించిందని కొంతమంది గ్రామస్థులు అన్నారు
*బ్యాంకులోనే ఆగిన గొర్ల డబ్బులు…*
ఇవే కాకుండా గొల్ల కురుమలకై చేపట్టిన
గొర్ల పంపిణీ పథకం ద్వారా గతంలో లబ్ది చేకూరని వారికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయగానే యుద్ధ ప్రాతిపదికన లక్షా ఏభై వేల రూపాయలు గోళ్లకురుమల అకౌంట్లలో జమైనట్లుగా తెలిసింది.
*గీతకు చేయూత*
గీత కార్మికులను కదిలించగా…అర్హులైన వారికి ఫించన్ అందుతున్నట్లుగా,ఇంకొంత మందికి అందాల్సి ఉందని తెలిసింది.
*గరం మీదున్న విద్యార్థినియుద్యోగులు*
గ్రామంలో ఉన్న విద్యార్థులు,నిరుద్యోగులు తెరాస ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు.సకాలంలో ఉద్యోగ నోటిఫికేషన్లు వేయని కారణంగా ఎంతోమంది ఉద్యోగావకాశాలు కోల్పోయి నేడు చిన్న చితకా పనులు చేసుకుంటూ జీవితాన్ని వెళ్లదీశస్తున్నామని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
మహిళా సంఘాలకు మరింత తోడ్పాటును అందించాలని కోరారు.
*గ్రామస్థుల డిమాండ్స్,ప్రధాన సమస్యలు*
రైతులు పొలాలాలకు వెళ్లేలా డొంక రోడ్లను బాగుచేయలని,అవసరమైన చోట,వాగుల వెంట బ్రిడ్జీలు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.
మోతాశి కుంటలో పూడిక తీయించి. కట్టను నిర్మించాలని కోరారు.
గ్రామంలో పశువైద్యశాలను ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
అదే విధంగా అందరికీ ఉపయోగపడేలా కమ్యూనిటీ హల్ నిర్మించాలని కోరుకుంటున్నారు.
విద్యార్థులకు ఉపయోగ పడేలా గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయాలని కోరారు.
సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ కాలువల నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని కోరుతున్నారు.
ఈ సమస్యలన్నీ తీర్చే వారికే తమ మద్దతు ఉంటుందని గ్రామస్థులు తెలిపారు.మరి నవంబర్ 6వ తేదీన లెంకలపల్లి ఓటరు ఎవరికి మద్దతు ఇచ్చారో వేచి చూడాలి.
వినోద్ హిందూస్థానీ. M.A.MCJ
నిజం న్యూస్ బ్యూరో,మునుగోడు