గురుకులాల్లో గురువుల కొరత

9,096 పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదం*
*నెలలు గడుస్తున్నా పత్తాలేని నోటిఫికేషన్*
*కోచింగ్ సెంటర్ల ముందు వేల మంది నిరుద్యోగులు*
పోతుగంటి సంపత్ కుమార్ యదాద్రి జిల్లా బ్యూరో అక్టోబర్ 3 (నిజం న్యూస్) తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం నెలలు గడుస్తున్నా నోటిఫికేషన్ మాత్రం విడుదల చేయలేదు. దీంతో దరఖాస్తు చేసుకునేందుకు ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు నిరాశ తప్పడంలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో సుమారు 80 వేల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టిన ప్రభుత్వం గురుకుల విద్యా సంస్థల్లోనూ నియామకాలు చేపడతామని ప్రకటించింది. ఆర్థిక శాఖ నుంచి ఇప్పటికే గురుకులాల ఖాళీలకు ఉత్తర్వులు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నెలలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ గురుకుల సొసైటీల పరిధిలో బోధన సిబ్బంది కేటగిరీలో మొత్తం 9096 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు(ట్రిబ్) ద్వారా ఈ నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇక నోటిఫికేషన్ రావడమే తరువాయి అని ఉద్యోగార్థులు సంతోషించారు. కానీ ఇప్పటి వరకు గురుకుల విద్యా సంస్థల నియామకాలపై ఎలాంటి సమాచారం లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం బీసీ గురుకుల విద్యాసంస్థలు 261 ఎస్సీ 230 ఎస్టీ 105 కాగా మైనారిటీ గురుకుల విద్యా సంస్థలు 207 ఉన్నాయి. వీటిలో బీసీ గురుకుల సొసైటీలోనే అత్యధిక పోస్టులు భర్తీ కానున్నాయి. మొత్తం 9096 పోస్టుల్లో బీసీ గురుకుల సొసైటీ పరిధిలోని స్కూళ్లలో3,870, ఎస్సీ గురుకుల సొసైటీలో 2267, ఎస్టీ గురుకుల సొసైటీలో 1514, మైనారిటీ గురుకుల సొసైటీలో 1445 చొప్పున పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. ఇందులో ఆర్ట్ టీచర్ మ్యూజిక్ టీచర్ అసిస్టెంట్ లైబ్రేరియన్ కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ హెల్త్ సూపర్వైజర్ జూనియర్ లెక్చరర్ లైబ్రేరియన్ ఫిజికల్ డైరెక్టర్ ప్రిన్సిపల్స్ టీజీటీ వార్డెన్ తదితర పోస్టులు ఉన్నాయి. కానీ ఇందుకు నోటిఫికేషన్ మాత్రం జారీ చేయడంలేదు. నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కావాలంటే ముందుగా ఆయా గురుకుల సొసైటీ కార్యదర్శులు ట్రిబ్కు ఇండెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. మార్పులు చేర్పుల అనంతరం ట్రిబ్ ఆయా పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తుంది. కానీ ఇప్పటివరకు ఒకటి రెండు సొసైటీల నుంచి ట్రిబ్కు కనీసం ఇండెంట్లు కూడా అందలేదు. దీంతో అసలు నోటిఫికేషన్ వెలువడుతుందో లేదోనని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు.