భర్తకు మరణ శాసనం రాసిన భార్య

*బిత్తరపోయే నిజాలు వెల్లడించిన పోలీసులు*
*ముదిగొండ సెప్టెంబర్22( నిజం న్యూస్*)
*ఆమెది పచ్చని సంసారం. భర్త తాపీ మేస్త్రీ. ఆమె మహిళలను కూలీకి తీసుకెళ్లే ముఠామేస్త్రీ. ఇద్దరు కుమార్తెకు పెళ్లిళ్లు చేసిన దంపతుల జీవితం.. ప్రశాంతంగా సాగుతోంది.* ఇంతలో భార్యను అనైతిక బంధం అల్లుకుంది. తాళిని ఎగతాళి చేసి.. నాతిచరామిని నవ్వులపాలు చేస్తూ.. విషబంధంలో చిక్కుకుంది. అంతటితో ఆగలేదు.అనైతిక బంధానికి అడ్డుగా ఉన్న భర్తను అంతమొందించేందుకు *భార్యే భర్త మరణశాసనం రాసింది.* సభ్యసమాజం తలదించుకునేలా భర్తపైనే విషప్రయోగం చేయించి అంతమొందించింది. మళ్లీ ఏమీ తెలియనట్టు కట్టుకున్న భర్త కానరాని లోకానికి వెళ్లాడంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది. మూడు ముళ్ల బంధాన్ని ముళ్లబంధం చేసి.. ఏడడుగుల అనుబంధాన్ని అభాసుపాలు చేస్తూ.. చివరకు నూరేళ్ల దాంపత్య జీవితాన్ని విషాదంలోకి నెట్టుకుంది. చివరకు హత్యకు అసలు సూత్రదారిగా పోలీసులకు చిక్కింది. ఇదీ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన ఇంజక్షన్ గుచ్చి జమాల్ సాహెబ్‌ను హత్య కోణంలో అసలు కథ.
*భార్య రాసిన మరణ శాసనం..* రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఇంజక్షన్ గుచ్చి జమాల్ సాహెబ్‌ను అంతమొందించిన హత్య కేసులో ప్రధాన సూత్రదారి మృతుడి భార్యేనని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్న భర్తను అంతమొందించేందుకు జమాల్ సాహెబ్ భార్య ఇమాంబీ.. పథక రచన చేసినట్లు పోలీసులు ఓ నిర్దరణకు వచ్చారు. అత్యంత విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. *చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన జమాల్ సాహెబ్ (48) తాపీ మేస్త్రీ* గా పనిచేసేవాడు. అతని *భార్య ఇమాంబీ (44) మహిళా కూలీలను పనులకు తీసుకెళ్లే ముఠామేస్త్రీ.* బొప్పారంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో మహిళా కూలీలను పనులకు తీసుకెళ్లేది. *ఆటో డ్రైవర్‌తో ప్రేమాయణం…* ఆటోలు మాట్లాడుకుని కూలీలను తీసుకెళ్లే సమయంలో అదే మండలంలోని నామవరం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌మోహన్ రావుతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. నాలుగేళ్లుగా వీరి మధ్య అనైతిక బంధం సాగుతుంది. ఈ విషయం భర్తకు తెలిసినప్పటి నుంచీ ఇమాంబీ అతనిపై కక్ష పెంచుకుంది. *అనైతిక బంధానికి అడ్డుగా ఉన్న భర్తను అంతమొందించాలని అనుకుంది.* ఇందుకోసం ఆమె పక్కాగా భర్త హత్యకు పథక రచన చేసింది.
*మొదటి ప్రయత్నం ఫెయిల్…* అనైతిక బంధంలో ఉన్న జమాల్ ఇమాంబీ-మోహన్ రావు గత రెండు నెలల క్రితం నుంచే జమాల్ హత్యకు పథకం రూపొందిస్తున్నారు. స్థానికంగా ఆర్‌ఎంపీ వైద్యుడి సాయంతో ఖమ్మంలోని ఓ మందుల దుకాణంలో అధిక మోతాదులో మత్తు ఉండే రసాయనం కొనుగోలు చేశారు. తొలుత ఇమాంబీనే భర్తకు ఇంజిక్షన్ చేసి చంపాలన్నది ప్రణాళిక. ఇందుకోసం మత్తు మందు డబ్బా… ఇంజక్షన్‌ను సుమారు రెండు నెలల పాటు ఇంట్లోనే ఉంచుకుంది. పలుమార్లు భర్తపై హత్యాప్రయోగం చేయాలనుకున్నా కొన్నిసార్లు వీలుకాలేదు. మరికొన్ని మార్లు ధైర్యం సరిపోలేదు. దీంతో జమాల్‌ను చంపేయాలని మోహన్ రావుపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. ఇంజక్షన్‌ను వెంకటేశ్ ద్వారా ఆయనకు చేరవేసింది.
*ఇమాంబీ ఓ మహానటి..* ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గయ్యపేట మండలం గండ్రాయిలో ఉంటున్న తన కుమార్తె ఇంటికి వెళ్లింది. అక్కడికి వెళ్లినప్పటి నుంచి తనను తీసుకెళ్లేందుకు రావాలని భర్తను కోరుతుంది. ఈనెల 19న ఉదయం స్వగ్రామం బొప్పారం నుంచి గండ్రాయికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. ఉదయం భర్త బైక్‌పై బయలుదేరుతాడని రాత్రే మోహన్ రావుకు ఇమాంబీ సమాచారం చేరవేసింది. అప్పటికే జమాల్‌ను అంతమొందించేంకు సిద్ధమైన మోహన్ రావు.. అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు సాయం తీసుకున్నాడు.
*రెండోసారి సఫలం…*
ట్రాక్టర్ డ్రైవర్‌గా ఉన్న వెంకటేశ్, గ్రామంలో ఆర్ఎంపీగా పనిచేస్తున్న వెంకట్‌ను పురమాయించాడు. బైక్‌పై వెళ్తున్న జమాల్‌కు ఇంజక్షన్ గుచ్చి చంపాలని ముందే వేసుకున్న పథకం ప్రకారం ఆయన్ను అనుసరించారు. ఏ సమయానికి ఎక్కడివరకు వచ్చాడో జమాల్ భార్య ద్వారా తెలుసుకుని ముందే కాపు కాశారు. *ముదిగొండ మండలం వల్లభి సమీపంలోకి రాగానే.. ఆర్‌ఎంపీ వెంకట్ బైక్‌పై లిఫ్ట్ ఇవ్వాలని కోరగా.. జమాల్ అతన్ని ద్విచక్రవాహనం ఎక్కించుకున్నాడు.* తర్వాత కాసేపటికే జమాల్‌కు వెంకట్ ఇంజక్షన్ గుచ్చి పారిపోతాడు. తనకు ఎవరో వెనుక నుంచి ఇంజిక్షన్ గుచ్చి పారిపోయారని స్థానికులకు జమాల్ చెప్పిన తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
*సవాల్‌గా తీసుకున్న పోలీసులు…*
తొలిరోజు విచారణలో పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించనప్పటికీ.. కేవలం 24 గంటల్లోనే ఈ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించడమే కాకుండా.. హత్యకేసులో సూత్రదారులు, పాత్రదారుల్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణలో భాగంగా కుటుంబసభ్యులపై పోలీసులకు అనుమానం వచ్చి.. భార్య సెల్ ఫోన్ కాల్‌డేటాను సేకరించారు. ఇందులో *హత్య జరిగిన రోజు తెల్లవారు జామున 4 గంటలకు ఇమాంబీ నుంచి ఎక్కువసార్లు మోహన్ రావు, వెంకటేశ్‌కు ఫోన్లు వెళ్లాయని* పోలీసులు గుర్తించారు. చింతకాని మండలం నామవరంలో ఉన్న వెంకటేశ్‌ను విచారించేందుకు పోలీసులు వెళ్లగా.. వాళ్లను ఏమార్చి అతడు పారిపోయాడు. దీంతో హత్య కేసుకు వీరి పాత్ర ఉన్నట్లు పోలీసులు ఓ అంచనాకు వచ్చారు.
*వ్యవహారం బయటకు ఇలా..*
హత్య కేసు తర్వాత అంతా ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకుని వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిపోయారు. మోహన్ రావు, వెంకటేశ్ స్వగ్రామం వెళ్లగా.. ఆర్‌ఎంపీ వైద్యుడు హైదరాబాద్ వెళ్లారు. హత్య తర్వాత ఖమ్మంలో ఓ బార్‌లో మద్యం సేవించిన తర్వాత ఎటువాళ్లు అటు వెళ్లిపోయారు. అనంతరం హత్య కేసులో ప్రధాన పాత్రదారులుగా మోహన్ రావు, వెంకటేశ్‌లు పోలీసులకు చిక్కారు. హైదరాబాద్‌లో ఉన్న ఆర్‌ఎంపీ వైద్యుడు వెంకట్‌ను సైతం పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. తర్వాత ఈ హత్యకు ప్రధాన సూత్రదారి ఇమాంబీ అని నిర్దరణకు వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
*పోలీసులపై ప్రశంసల జల్లు*
ఈ నలుగురితోపాటు విష రసాయనం విక్రయించిన ఖమ్మంకు చెందిన ఓ మందుల దుకాణం వ్యాపారిని సైతం అదుపులోకి తీసుకున్నారు. ఎనస్తీషియాకు ఇచ్చే రసాయనం అధిక మోతాదులో ఇవ్వడం, అది కూడా వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. సంచలనం రేపడంతో పాటు అందరినీ భయభ్రాంతులకు గురిచేసిన ఈ హత్య కేసును 48 గంటల్లోనే చేధించిన పోలీసులపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
*ఐదు కుటుంబాలకు తీరని వేధన..*
ఒక్క హత్య ఘటన మొత్తం ఐదు కుటంబాలకు తీరని వేదన మిగిలించింది. అనైతిక బంధం మోజులో భర్తను పోగొట్టుకున్న భార్య దిక్కులేనిదైంది. దీంతో పాటు కటకటాల పాలైంది. తనకంటూ కుటుంబం భార్యా పిల్లలతో హాయిగా ఉన్న మరో నలుగురి కుటుంబాలకు కష్టాలు తప్పడం లేదు. ప్రియురాలి మోజులో పడి మోహన్ రావు ఈ హత్య కేసులో ప్రధాన పాత్రదారిగా మారగా.. అసలు సంబంధంలేని డ్రైవర్ వెంకటేశ్, ఆర్ఎంపీ వైద్యుడు వెంకట్, మత్తు మందు విక్రయించిన మరో వ్యక్తి కటకటాల పాలు కావాల్సి వస్తుంది