Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తెలంగాణ లో విలీన /విమోచన / విముక్తి దినోత్సవం జరపాలనే డిమాండ్లు

సెప్టెంబర్ నెల వచ్చిందంటే చాలు తెలంగాణ లో విలీన /విమోచన / విముక్తి దినోత్సవం జరపాలనే డిమాండ్లు మోగుతాయి.

1948 సెప్టెంబర్ 18 న నిజాం సంస్థానాన్ని ఇండియాలో కలిపేసుకున్నారు కనుక ఆ తేదీన ఉత్సవం జరపాలని ఆ డిమాండ్ చేసేవారి కోరిక. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగిన కాలంలో ” తెలంగాణ విలీన దినోత్సవం ఎందుకు జరుపరని ఎన్నో సభలు సమావేశాల్లో టీఆరెస్ అధినేత కేసీఆర్ నిలదీసాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విలీన దినోత్సవాన్ని బరాబర్ జరుపుతామని ప్రకటించాడు. కానీ అధికారంలోకొచ్చాక ఆమాటే మరిచాడు. నేడు తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని మంచి ఊపు మీద ఉన్న బీజేపీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిజాం సంస్థాన విలీన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతామని ప్రకటించటంతో టీఆరెస్ ఆత్మరక్షణలో పడింది. ఆవెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ తామూ జరుపుతామని ప్రకటించాడు. కానీ జాతీయ సమైక్యతా దినంగా జరుపుతానని చెప్పాడు. ఈ దిక్కుమాలిన దినం ఏంటో మరి.

సరే అది విమోచన /విలీన/ విముక్తీ దినోత్సవం ఏదైనా కానీయండి ఆ రోజుకు ముందు కొన్నేళ్లుగా ఆ తరువాత మూడేళ్లపాటు తెలంగాణ ప్రజలు జరిపిన పోరాటం గురించి కమ్యూనిష్టు పార్టీలు తప్ప మిగతా పార్టీలు ఏమని చెపుతాయి. ముఖ్యంగా ఈ దినోత్సవాన్ని జరపాలని గగ్గోలు పెడుతున్న బీజేపీ చెప్పుకోవటానికి ఏముంది. ఆనాడు ఈ పార్టీ కానీ దీని పూర్వాశ్రమమైన జనసంఘ్ కానీ లేవే. నాడు వీరు పిండప్రాయంగా కాదుకదా కనీసం అండప్రాయంగా కూడా లేరే. వీరి జనకులైన సంఘ్ పరివార్ కు సంస్థానంలో ఉనికి కూడా లేదే. ఇలా ఏ చరిత్రా లేని వీరు విలీనం గురించి దానికి దారితీసిన పోరాటాలు, ఆతరువాత జరిగిన పోరాటం గురించి ఏం చెపుతారు? ఇక టీఆరెస్ నిన్నమొన్న పుట్టిందేనాయే. ఇలాంటి వీరు విలీనంకు ముందు ఏళ్లతరబడి సాగిన వెట్టిచాకిరీ, దోపిడీ, దౌర్జన్యాలు, అణచివేత, తిరుగుబాట్లు, ప్రతిఘటనలు, బలిదానాలు, సాయుధ పోరాటం, ప్రాణత్యాగాలు దొరలను, భూస్వాములను పటేల్లు పట్వారీలను ప్రజలు తరిమికొట్టటం, భూ పంపిణీల గురించి చెప్పగలరా? విలీనం తరువాత కమ్యూనిష్టులపై ఇండియన్ సైన్యం జరిపిన దమనకాండ గురించి నోరేత్తగలరా? పల్లెలోదిలి పారిపోయిన దొరలు భూస్వాములు ఖద్దరు టోపీలతో రాబందుల్లా మళ్ళీ పల్లెలపై వాలి సాగించిన దుర్మార్గాలు దౌర్జన్యాలు భీభత్సం గురించి పన్నెత్తి చెప్పగలరా? కేసీఆర్ ఇప్పటికే ఎన్నోసార్లు మా నిజాం నవాబ్ చాలా మంచోడు అని నెత్తిన పెట్టుకున్నడు. కాంగ్రేస్ వారేమో నవాబ్ ను చాలా గౌరవించి ఆయనకు ఎలాంటి నొప్పి కలగకుండా చూసారు. బీజేపీ వారికేమో అసలు ఆ పోరాటంతో సంబంధమే లేదు. కానీ వీరు ముగ్గురూ విలీన దినోత్సవం పాట అందుకోవటమంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే. నిజాం సంస్థానానికి, సంస్థానం లోని భూస్వాములు దొరలు జాగిర్దార్లు మక్తేదార్లు దేశ్ ముఖ్ లకు ఎదురోడ్డి నిలిచి పోరాడింది, అనేక కష్టానష్టాల పాలైంది, బలైంది, ప్రాణాలతో పాటు అనేక త్యాగాలు చేసింది కమ్యూనిష్టులు. వారి త్యాగాలను ఈ పార్టీలత్రయం కీర్తించగలదా?

దరిలేని బానిస చాకిరి

నరహంతకుల గుండాగిరి

ఇకవద్దని ఇకరద్దని

పోరాడి నేలకు ఒరిగిన

రణధీరులారా అని పాడగలవా?

శ్రమశక్తి భువినిండాలని

నరజాతి కలపండాలని

యుగస్రష్టలై కమ్యూనిష్టులై

పోరాడినేలకు ఒరిగిన

ధృవతారాలారా అని గానం చేయగలవా?

మతమూఢ విశ్వాసాలను

కులజాతి విద్వేషాలను

నిరసించుతూ ఎదిరించుతూ

పోరాడి నేలకు ఒరిగిన

యువశూరులరా అంటూ అంజలి ఘటించగలరా

ఫిరంగి మీద మీసం దువ్వి

తుపాకిపై తొడకొట్టి నిలబడి

గుద్దుకు గుండెను బద్దలు చేసి

తన్నుకు టోపీ మిన్నుకు లేపిన

సై సై ఓ తెలంగాణ వీరుడా

నీవెత్తిందే ఎర్రా జెండా అని మీసం మెలేయగలవా?

తెలంగాణని పేరు చెప్పితే

ఢిల్లి కోటలో గుండె జల్లుమను

తెల్లదొరలె ఈ తెలంగాణకు

టోపీలెత్తి సలాము కొట్టిరి

సై సై ఓ తెలంగాణ వీరుడా

నీవెత్తిందే ఎర్రజెండా అని ప్రకటించగలవా?

గోలకొండ ఖిల్ల క్రింద నీ ఘోరి కడతాం కొడకో నైజాము సర్కారోడా అన్న పాటకు గొంతు కలపగలవా?

రావినారాయణరెడ్డి, ఆరుట్ల సోదరులు,ఆరుట్ల కమలా దేవి, చకిలం లలితమ్మ, కాంచనపల్లి సోదరులు,Makhdum moinuddin , రాజ్ బహదూర్ గౌర్ , కే ఎల్ మహేంద్ర,గురువారెడ్డి,బద్దం ఎల్లారెడ్డి, చిట్యాల ఐలమ్మ,నల్లా నర్సింహులు, కూనూరు అచ్చమాంబ , వరంగల్ కమలమ్మ, దాయం రాజిరెడ్డి,భీంరెడ్డి నర్సింహా రెడ్డి, దేవులపల్లి వేంకటేశ్వర రావు,ధర్మ భిక్షం , కట్కూరి రాంచంద్రా రెడ్డి, మల్లు స్వరాజ్యం, ఉరి శిక్ష పడిన 12 మంది యోధులకు, బోడేపూడి వేంకటేశ్వర రావు,చిర్రావూరి లక్ష్మినర్సయ్య, మద్దికాయల ఓంకార్, నల్లమల గిరిప్రసాద్, దొడ్డా నర్సయ్య, బైరాంపల్లి మల్లారెడ్డిగూడెం అమరులకు, రజబలి, నంద్యాల నర్సింహా రెడ్డి, ఛింతలపుడి రాములు ఇంకా అనేకనేక మంది అమరులకు యోధులకు జోహార్లు అర్పించగలరా. వారు జరిపిన వర్గ శత్రునిర్ములనను ప్రజా పీడక భూస్వాముల హత్యలను కొనియాడగలరా? విలీనం జరిగిన తరువాత తెలంగాణ ప్రజలు ఎందుకు ఆయుధాలు పట్టుకోవాల్సి వచ్చింది, వారిలో మూడు వేలమంది ఎందుకు అమరులయింది చెప్పగలరా? వేలాది మృత వీర సమాధుల పుణ్యక్షేత్రం ఈ తెలంగాణ రా అని గొంతేత్తి పాడగలరా? ఆ మహత్తర సాయుధపోరాట స్ఫూర్తితో ఈ పార్టీలు పనిచేయగలవా?

కేవలం ఓట్ల రాజకీయ వేటలో పవిత్రమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను దినోత్సవం పేరుతో వక్రీకరించ చూస్తున్నాయి ఈ పిశాచ పార్టీలు.

దినోత్సవం జరపటంపై అభ్యంతరం లేదు.కానీ దానిపై కానీ ఆ దినోత్సవంలో మాట్లాడే అర్హత హక్కు కానీ ఈ మూడు పార్టీలకు లేవు. పైన నేను కోరిన విధంగా మాట్లాడితే తప్ప లేకుంటే లేదు. బీజేపీ కి అసలు మాట్లాడే హక్కే లేదు. ఆ అర్హత హక్కు కేవలం కమ్యూనిష్టులకే ఉన్నాయి. జాతీయ సమైక్యతా దినం అనే దిక్కుమాలిన మాటలు చెప్పి తప్పించుకోకుండా విమోచన /విలీనం /విముక్తి పేరున ఏదో ఒకటి జరిపి కమ్యూనిష్టుల చేతనే మాట్లాడించాలి. మిగతావారు మాట్లాడితే పైన నేను అడిగినవన్నీ చేయాలి. ఏదో ఒకరోజు కాకుండా ప్రతి మండల కేంద్రంలో వారోత్సవాలు జరపాలి.ఎందుకంటే తెలంగాణా సాయుధరైతాంగ పోరాటం పై తెలంగాణ లోని ప్రతి ఇంటికీ ఒక కథ ఉంది. ప్రతి పల్లెకు ఒక చరిత్ర ఉంది.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని నాలుగేళ్లుగా అజ్ఞాతవాసంలో ఉంటూ చివరకు ఒక కాంగ్రేస్ నాయకుడు ఇచ్చిన సమాచారంతో 1950 వ సంవత్సరంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రస్తుత సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం బొత్తలపాలెం గ్రామంలో పట్టుబడిన మా అమ్మ ? కోట తిరుపతమ్మ. ( అజ్ఞాతవాసంలో పట్టుబడి ఆమె కోర్టుకు హాజరైనప్పుడు తీసిన ఫోటో ) మా నాన్న కోట నారాయణ, మా మేనమామ ఛింతలపుడి రాములూ సాయుధ పోరాట యోధులే. మా మేనమామ దళ సభ్యునిగా ఉంటూ అనారోగ్యానికి గురైతే చికిత్స కోసం అతన్ని పార్టీ వారు బెంగుళూరు లో ఒక వైద్యశాలలో చేర్పించారు. అక్కడినుండి అతను ఇంటికీ ఉత్తరం వ్రాస్తే దాన్ని పోలీసులు పట్టుకుని బెంగుళూరు వెళ్లి అరెస్ట్ చేసి తీసుకొస్తారు.