Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అమ్మకానికి ఎర్రజెండా..?

మునుగోడు సభలో సీపీఐ నేత పల్లా అగచాట్లు

*- ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉంటే..*

*- పోడుభూములపై పోరాటం*

*- సేవ్ డెమోక్రసి – సేవ్ కాన్స్టీట్యూషన్*

*- కత్తులతో పొత్తులు*

*- ఆ పొత్తు ఖరీదు తమ్మినేని కృష్ణయ్య ప్రాణం*

*- కమ్యూనిస్టులు కనుమరుగు కాక తప్పదా…!*

 

*భద్రాద్రి బ్యూరో, సెప్టెంబర్ 01 (నిజం న్యూస్):*

నిన్నటిదాకా ఆయనది నిరంకుశపు పాలన ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన కూనీకోరు.. తెలంగాణను చెరబట్టిన చీడపురుగు.. కుటుంబ పాలనతో తెలంగాణను దోచుకున్న అవినీతి పరుడు, ధనికరాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన మూర్కుడు. ఇవన్నీ కమ్యూనిస్టులు నిన్నటి వరకు కేసీఆర్ ను గురించి మీడియా ముఖంగా పలు సందర్భాలలో చేసిన వాఖ్యలు. ఫామ్హౌస్ నుంచి పిలుపు రాగానే రాత్రికి రాత్రికే కేసీఆర్ ను కమ్యూనిస్టులు నిప్పుతో శుద్ధి చేసారు. ఆయనకు పట్టిన అవినీతి చెదలను కాగడాతో కాల్చివేశారు. ఇప్పుడు వారి దృష్టిలో తెలంగాణ అభివృద్ధి ప్రధాత, ప్రగతిశీల నాయకుడు. అసలు కమ్యూనిస్టు పార్టీలెక్కడున్నాయి. అవి ఎప్పుడో తోక పార్టీలు అయిపోయాయని వ్యాఖ్యానించిన కేసీఆర్ ఇప్పుడు ఆ తోకలను నోట్ల కట్టలతో కట్ట కట్టే పనిలోపడ్డారు.

 

మునుగోడు సభలో సీపీఐ నేత పల్లా అగచాట్లు

 

మునుగోడు సభలో సిపిఐ నాయకుడు పల్లా వెంకటరెడ్డి టీఆర్ఎస్ తో వారి పొత్తును సమర్ధించుకోవడానికి ఆయన పడిన అగచాట్లు చూసి జనం నవ్వుకుంటున్నారు. వేదిక మీదనుంచి సిగ్గువిడిచి మాట్లాడడం చూసిన వారు ఈసడించుకుంటున్నారు. బీజేపీని ఓడించడానికే టిఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నామని, దేశ వ్యాప్తంగా బీజేపీని వ్యతిరేకించడమే తమ సిద్ధాంతమని అదే మా విధానమని చెప్పడం చూస్తే వారు ఎంతగా దిగజారిపోయారో అనిపిస్తుంది. అసలు కమ్యూనిస్టులు ఎప్పడు పుట్టారు. బీజేపీ ఎప్పుడు పుట్టింది. ఈ దేశంలో బీజేపీ పార్టీ రాక మునుపే కమ్యూనిస్ట్ పార్టీలు అరువు తెచ్చుకున్న సిద్ధాంతంతో పుట్టుకొచ్చాయి. అలాంటి పార్టీలు వారి తర్వాత చాలా సంవత్సరాలకు పుట్టిన బీజేపీని వ్యతిరేకించడమే వారి సిద్ధాంతమని చెప్పడం చూస్తే వారిలో మిగిలిన కమ్యూనిజం ఎంత అనే ప్రశ్న ఉద్భవించక మానదు.

బీజేపీ మతతత్వ పార్టీ అనీ, వారిని వ్యతిరేకించడానికి లౌకిక శక్తులు ఏకం అవ్వాలనే ఉదేశ్యంతో టిఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాం అని నొక్కి వక్కాణించారు. మరి ఒక మతం పేరిట పుట్టిన ఎంఐఎం పార్టీతో పొత్తులో వున్న టిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా లౌకిక పార్టీ అవుతుందో కమ్యూనిస్టులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఆ మాటకొస్తే ఎవరికి నచ్చిన మతాన్ని వారు ఆచరించే స్వేచ్ఛ ఉన్న ఈ దేశంలో అసలు దేవుడే లేడని పిడివాదం చేసే కమ్యూనిస్టులు, అధిక సంఖ్యలో ఉన్న హిందువుల సంస్కృతిని, సాంప్రదాయాలను, నమ్మకాలను హేళన చేసే కమ్యూనిస్టులు లౌకిక వాదులు ఎలా అవుతారో ఓసారి ఆత్మ విమర్శ చేసుకుంటే మంచిది. అన్యమతాలను గౌరవించని కమ్యూనిస్టులకు లౌకికశక్తుల ఏకీకరణ గురించి మాట్లాడే హక్కు లేదని గమనించాలి.

ప్రజా సమ్యసల పరిష్కారం కోసమే మేము ఇన్ని రోజులు టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా పోరాటాలు, ఉద్యమాలు చేసాం కాని కేసీఆర్ ను గద్దె దించడానికి కాదు అని వాఖ్యానించారు. మరి 2018 శాసనసభ ఎన్నికల్లో దేనికోసం టిఆర్ఎస్ వ్యతిరేఖంగా పోటీ చేసిన మహాకూటమిలో భాగం అయ్యారు. ఈనాటి మీ మాటలు వింటే ఆనాడు మీరు మీ భాగస్వామికి ఎంత నిబద్దతో పని చేశారనేది అర్థం అవుతుంది. బేషరతుగా టిఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నాం అని సిగ్గువిడిచి చెపుతున్న మీరు ప్రజా సమస్యలకు ఎలా పరిష్కారం చూపించగలరు.

 

*ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉంటే..*

 

మీలో నిజంగా ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉంటే పోరాటంలో స్వార్ధం లేకపోతే, మునుగోడు ఎన్నికలకు ఇంకా రెండు మూడు నెలల సమయం ఉన్న నేపథ్యంలో పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపిస్తేనే కేసీఆర్ కు మద్దతు ఇస్తామని తెగేసి చెప్పేవారు. పేదలకు రెండు పడకల గదుల ఇళ్లు ఇవ్వండి అప్పుడు మా మద్దతు ఇస్తామని తేల్చి చెప్పేవారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించమని కోరేవారు. ఆర్టీసీ కష్టాలను తీర్చండి అని నిలదీసేవారు. కనీసం ఏదో ఒక సమస్యకు పరిష్కారం చూపమని కోరేవారు. కానీ అలాచేయకుండా బేషరతు మద్దతు టిఆర్ఎస్ కు ఇస్తున్నారంటే మీరు కచ్చితంగా కరెన్సీ నోట్లకు సాగిలబడ్డారని అర్థం అవుతుంది…! మీరు చెపుతున్నట్టుగా నిజంగా పేదప్రజల పట్ల కమ్యూనిస్టులకు ప్రేమఉండి ఉంటే, మీ ప్రజాపోరాటాలలో నిజాయితీగా నిఖార్సుగా ప్రభుత్వంతో కొట్లాడి ఉంటే హుజుర్ నగర్, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ కు మద్దతు ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే అవి కేసీఆర్ ను గద్దె దించే ఎన్నికలు కాదు, అక్కడ బీజేపీ, టీఆర్ఎస్ కు ప్రధానపోటీదారు కాదు. ఆ ఎన్నికల్లో కేసీఆర్ ని ఓడించి ఉంటే అధికార మదంతో కళ్ళు నెత్తికెక్కిన కెసిఆర్ దిగి వచ్చి పరిపాలనలో మార్పులు చేసుకునేవారు. ఆ రెండు ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలవడంతో కేసీఆర్ ప్రతి పక్షాలను విశ్వాసంలోకి తీసుకోకుండా తనకు నచ్చిన ధోరణిలో పాలన చేసుకుపోతున్నాడు. దీనికి కమ్యూనిస్టులు కూడా ఒక కారణం అనేది గుర్తిస్తే వారి మనుగడకు కూడా మంచిది.

 

*పోడుభూములపై పోరాటం*

 

పోడు భూములపై పోరాటం చేస్తున్న పోటుగాళ్లుగా వారికే వారే కితాబిచ్చుకున్న కమ్యూనిస్టులు మరి నిన్నగాక మొన్న పోడుభూముల కోసం పోరాటం చేస్తున్న *గిరిజన ఆదివాసీలను ప్రభుత్వం లాఠీలతో అమానుషంగా కొట్టిన విషయాన్నీ మరిచారా.?* మహిళలను బూటుకాళ్ళతో తన్నుతూ ఈడ్చుకెళ్ళిన సంఘటనలు ప్రజలు మరువక ముందే మీరు గిరిజనులకు ఏ న్యాయం జరిగిందని కేసీఆర్ బూటుకాళ్ళ దగ్గర చేరారు.

ఆర్టీసీ కార్మికులు వారి సమస్యల పరిష్కరానికి సమ్మె చేస్తుంటే అక్కడ మీ జెండాలతో ప్రత్యక్షమై వారిని రెచ్చగొట్టి ఎందరో కార్మికుల ఆత్మబలిదానాలకు పురిగొల్పిన మీరు ఇప్పడు ఆ చావులకు కారణమైన కేసీఆర్ చంకలో చేరిపోయిన వైనం చూస్తుంటే కమ్యూనిజం కంపు కొడుతుంది. చనిపోయిన ఆర్టిసి కార్మికుల కుటుంబాలకు కమ్యూనిస్టులు ఏమని సమాధానం చెబుతారు. వారి ఆత్మ ఘోషకు సమాధానం ఎవరు చెబుతారు. ఆ నాడే కొవ్వొత్తుల ర్యాలీలతో, సంతాప సభలతో మీ బరువు దించేసుకున్నామని నిస్సిగ్గుగా సరిపెట్టుకున్నట్టున్నారు. కేసీఆర్ ఇసుక మాఫియాను, డ్రగ్ మాఫియాను నడిపిస్తున్నారని విమర్శించిన నారాయణ మరి ఇప్పడు వాటిలోనుండి కేసీఆర్ ను ఏవిధంగా పునీతులను చేశారో మనకు తెలియదు. ఓ సందర్భంలో టిఆర్ఎస్ గెలిస్తే చెవి కోసుకుంటాను అన్న నారాయణ మరి ఇప్పుడు మునుగోడులో టిఆర్ఎస్ ను గెలిపించడానికి మద్దతు ఇస్తున్న వేళ ప్రజలు టిఆర్ఎస్ ను ఓడిస్తే ఏమి కోసుకుంటారో అని ప్రజలు అడిగితే ఇప్పడు నారాయణగారు ఏం సమాధానం చెబుతారు.

ప్రగతి శీల, క్రియాశీల శక్తులు ఏకం కావాలనే ఉద్దేశ్యంతోనే సిపిఐ, సిపిఎం పార్టీలను పొత్తుకు ఆహ్వానించామని ఈ అపవిత్ర అవకాశవాద పొత్తును సమర్ధించుకున్న కేసీఆర్ సమాధానం చెప్పవలసిన ప్రశ్నలు ఉన్నాయి. అసలు కమ్యునిస్తులు ఈ దేశంలో ఏనాడన్నా ఆర్థిక సంస్కరణలను ఆహ్వానించిన దాఖలాలు ఉన్నాయా పరిశోదించుకోండి. ఈ దేశంలో కంప్యూటర్ ని వ్యతిరేఖించారు, సెల్ ఫోన్లను వ్యతిరేకించారు. కార్పొరేట్ కంపెనీలు వద్దంటారు. పొద్దునలేస్తే అంబానీ, ఆదానీలను తిట్టిపోస్తారు. మళ్ళీ వాళ్ళే అంబానీ జియో సిమ్ కార్డు ను కార్పొరేట్ కంపెనీలు తయారు చేసే స్మార్ట్ ఫోనులో వేసుకుని వాట్సాప్, ఫేస్ బుక్ లలో అడ్డగోలు పోస్టిoగులు పెడతారు. వీళ్ళు ఎలా ప్రగతిశీల నాయకులౌవుతారో కేసీఆర్ చెప్పాలి. అసలు కమ్యూనిస్టులే లేరు, వాళ్ళు తోక పార్టీలని విమర్శించిన కేసీఆర్ కమ్యూనిస్టులు బాహుబలులెప్పుడయ్యారో, క్రియాశీల శక్తులెలా అవుతారో సమాధానం చెప్పాలి.

 

*సేవ్ డెమోక్రసి – సేవ్ కాన్స్టీట్యూషన్*

 

చాడా వెంకట రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సేవ్ డెమోక్రసి, సేవ్ కాన్స్టీట్యూషన్ అనే నినానాధంతో బీజేపీని వ్యతిరేకించడానికి టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పడం వారి సిగ్గు మాలిన దిగజారుడు తనానికి నిదర్శనం. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతూ ప్రభుత్వ అధికారుల్ని వాడుకుని ప్రజల తరుపున కొట్లాడుతున్న ప్రతిపక్ష నాయకులపై కేసులు పెడుతూ నిర్బంధాలు చేస్తూ, అసలు ప్రజలకు నిరసన తెలిపే హక్కులేదన్నట్లుగా ఇందిరా పార్క్ దగ్గర నుండి ధర్నా చౌక్ ని ఎత్తివేసిన కేసీఆర్ ఈ రాజ్యాంగాన్ని ఎలా కాపాడతాడో చెప్పాలి. ప్రజాసమస్యల పట్ల నివేదించడానికి ప్రగతిభవన్ ముందు పడిగాపులు కాస్తే గేటు దగ్గరకు కూడా రానివ్వకుండా కుక్కల్ని చూసిన విధంగా కమ్యూనిస్టులను చూసిన కేసీఆర్ మీకు ఇప్పడు ప్రజాస్వామ్య పరిరక్షడికులా ఎలా కనపడుతున్నాడు. తెలంగాణా వచ్చాక దేవరకొండ నియోజక వర్గం నుండి గెలిచినా ఒక్కగానొక్క సిపిఐ ఎమ్మెల్యే ను అప్రజాస్వామ్యకంగా సంతలో పశువులాగా కొన్న కేసీఆర్ ఏకోణంలో ప్రజస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాడో చాడా సమాజానికి చెప్పాలి. నోట్ల కట్టల మహిమ మీ బుర్రలను మైకంలోకి నెట్టేసింది కాబోలు. కమ్యూనిస్ట్ నాయకుల పిలుపునందుకుని ఎన్నో ధర్నాలు, ఉద్యమాలు చేసిన కమ్యూనిస్ట్ కార్యకర్తల మీద టిఆర్ఎస్ ప్రభుత్వం కేసులు పెడుతుంటే మీరేమో ఇలా సూటుకేసులకు అమ్ముడు పోవడం ఎన్నికలొచ్చినప్పుడల్లా పరిపాటి అయిపోయింది. కనీసం తెలంగాణా సమాజానికి సమాధానం చెప్పకపోయినా మీ కమ్యూనిస్ట్ కార్యకర్తలకైనా సర్ది చెప్పండి లేదంటే రానున్న కాలంలో అమ్ముకోవడానికి ఈ కాసిన్ని ఓట్లు కూడా మిగలవు. మీరు ఎప్పుడు ఏ పార్టీతో పొత్తులో వుంటారో మీ కార్యకర్తలకు కూడా అర్థంకాని పరిస్థితి నెలకొని వుంది. కాంగ్రెస్ విధానాలు తప్పన్నారు, టీడీపీతో సహజీవనం చేశారు. తూచ్ కాంగ్రెస్ భేష్ అన్నారు, వారితో కొంతకాలం సహవాసం చేసారు. ఇప్పుడు టిఆర్ఎస్ శబాష్ అంటూ వీరితో ఇప్పడు సంసారానికి సిద్ధం అయ్యారు. జనం మాత్రం దీనికి వేరే పేరు పెట్టుకుంటున్నారు. మీరేమో రాజకీయ చాణక్యం అని, చారిత్రక అవసరం అని అందమైన పేర్లు పెట్టుకుని చెవులు మూసుకుంటున్నారు.

ఆ నాటితరం కమ్యూనిస్టు నాయకులు పేదప్రజల కోసం ఆస్తులను అమ్ముకుని త్యాగాలు చేసి కొట్లాడితే, పేదప్రజల పేరుచెప్పుకుని ఇప్పటి తరం కమ్యూనిస్టు నాయకులు కడుపునింపుకుంటున్నారు, ఆస్తులను కూడ బెట్టుకుంటున్నారు. నానాటికి దిగజారిపోతున్నారు. ఇవేపోకడలను అనుసరిస్తే కాలగర్భంలో కలవడానికి ఎంతో సమయం పట్టదు.

 

*కత్తులతో పొత్తులు*

 

ఖమ్మం జిల్లా రూరల్ మండలం తెల్దారుపల్లి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడు తమ్మినేని క్రిష్ణయ్యను దారుణంగా హత్య చేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ కేసు విషయంలో కేసు విచారణ జరుగుతున్న తీరు, కెసియార్ మునుగోడు సభలో సిపిఎం పార్టీతో కూడా పొత్తు ఉంటుందని చేసిన వ్యాఖ్యలు అనేక అనుమానాలను కలిగిస్తున్నాయి. ఈ కేసులో బాధిత కుటుంబం, హత్య చేయించింది తమ్మినేని వీరభద్రం అతని సోదరుడు తమ్మినేని కోటేశ్వరరావు అని ఆరోపిస్తున్న నేపథ్యంలో, కేసీఆర్ గొప్పగా చెప్పే తెలంగాణా పోలీసు వ్యవస్థ హత్య జరిగి వారం రోజులు గడుస్తున్నా కుట్రలో భాగం ఉన్న తమ్మినేని కోటేశ్వరరావు ఎల్లంపల్లి నాగయ్యలను పట్టుకోవడంలో విఫలం అవడం, ఎఫ్ఐఆర్ లో ఏ1 గా వున్న తమ్మినేని వీరభద్రం తమ్ముడు తమ్మినేని కోటేశ్వర రావు పేరు రిమాండ్ రిపోర్టులో ఏ9 గా చేర్చడం, ఏ2 గా వున్న సిపిఎం గ్రామ కార్యదర్శి రంజాన్ పేరు ఏ8 గా పేర్కొనడం, చిన్న చిన్న కేసులలో కూడా మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టే పోలీసులు నింధితులను అరెస్ట్ చేసిన రోజే కోర్టులో హాజరు పరచడం వంటివి చూస్తుంటే అసలు ఈ హత్య ప్రగతి భవన్ కు సమాచారం ఇచ్చే జరిగిందా అని అనుమానం కలుగక మానదు.

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సొంత ఊరు తెల్దారుపల్లి. కొన్నేళ్ల క్రితం వరకు ఆ ఊర్లో ఆయన చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా సాగింది. తమ్మినేని కృష్ణయ్య సిపిఎం పార్టీనుండి బయటకు వచ్చి తమ్మినేని వీరభద్రం సోదరులను ఎదురించి నిలబడ్డాడు. అప్పటి వరకు ఆ ఊర్లో ఎన్నికలే జరగలేదు. ఎప్పడు సిపిఎం పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే వాడు. అలాంటిది 2019 ఎంపిటిసి ఎన్నికల్లో తమ్మినేని కృష్ణయ్య భార్యను సిపిఎం పార్టీకి వ్యతిరేఖంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయించి భారీ మెజారిటీతో విజయం సాధించాడు. తదనంతరం జరిగిన టేకులపల్లి సహకార సంఘ ఎన్నికల్లో సిపిఎం పార్టీ అభ్యర్థిపైన ఘనవిజయం సాధించాడు. దేశ వ్యాప్తంగా కనుమరుగవుతున్న కమ్యూనిస్ట్ లకు, ప్రత్యేకించి తమ్మినేని వీరభద్రంకు సొంత ఊర్లో పరాభవం ఎదురవడంతో కడుపు రగిలిపోయింది. పగతో రగిలిపోతున్న వారికి మునుగోడు ఎన్నికల రూపంలో అవకాశం దొరికింది. గత కొంత కాలంగా బీజేపీ రూపంలో టిఆర్ఎస్ గట్టి పోటీని ఎదుర్కుంటున్న సందర్భంలో వచ్చిన ఎన్నిక కావడంతో అక్కడ కమ్యూనిస్టులకు కొంత బలం వుండడంతో వారి సహాయాన్ని కోరారు కేసీఆర్. ఫలితంగా టిఆర్ఎస్- సిపిఎం పొత్తుకు బీజం పడింది.

 

*ఆ పొత్తు ఖరీదు తమ్మినేని కృష్ణయ్య ప్రాణం..?*

 

ఆ పొత్తు ఖరీదు తమ్మినేని కృష్ణయ్య అని రాజకీయ పరిశీలకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకే స్వంత పార్టీనేతను అత్యంత పాశవికంగా చంపితే, అందులోనూ టిఆర్ఎస్ ఉనికే లేని ఆ ఊర్లో గులాబీ జెండాను నిలబెట్టిన నేతను చంపితే, కేసీఆర్ సన్నిహితుడు తుమ్మల నాగేశ్వర రావు అనుచరుడు హత్య గావించబడితే, హత్య చేయబడ్డ కుటుంబానికి అండగా నిలబడాల్సిన ప్రభుత్వం హత్యకు కుట్రదారులని అని ఆరోపించబడుతున్న తమ్మినేని వీరభద్రంకు (1+1) రక్షణ ఏర్పాటు చేసిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. తుమ్మల మినహా టిఆర్ఎస్ నాయకులెవరు కనీసం దీనిని ఖండించక పోవడం చూస్తుంటే దీనివెనుక ఎన్ని శక్తుల హస్తం ఉందో అని స్వంత పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం స్వంత పార్టీ నేతల ప్రాణాలనే పణంగా పెట్టి రాజకీయాలు చేస్తున్న కేసిఆర్ తీరును చూసి టిఆర్ఎస్ కార్యకర్తలు ఆలోచనలో పడ్డారు.

అసలు తెలంగాణ ఉద్యమంలో చివరి నిమిషం వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన సీపీఎం పార్టీతో పొత్తును కేసీఆర్ క్రియశీల, ప్రాగతి శీల శక్తుల ఐక్యత పేరుతో సమర్ధించుకోవచ్చును గాక, కానీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న కుటంబాలు గోషిస్తాయి, ఉద్యమాలు చేసిన తెలంగాణ బిడ్డలు కేసీఆర్ కు వ్యతిరేకంగా గర్జిస్తాయి.

 

*కమ్యునిస్టులు కనుమరుగు కాక తప్పదా..?*

 

ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిజం ఒక జీవన పద్ధతిగా విఫలమైనది. కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఏర్పడిన చాల దేశాలలో ఆర్థిక వ్యవస్థ అతి కొద్ది సమయంలోనే కుప్పకూలింది. ప్రజలనుండి తీవ్రమైన వ్యతరేకతను మూటగట్టుకుంది. వారి నియంతృత్వ పోకడలు వ్యక్తి స్వేచ్ఛను హరించి వేసాయి. హింసను ప్రోత్సహించాయి. సహజ జీవన పద్ధతికి వ్యతిరేక పద్ధతులలో మానవుడు ఎక్కువకాలం మనజాలడని నిరూపించాయి. అందుకే ప్రపంచంలో కమ్యూనిజం కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. చైనాతో పాటు ఒకటి రెండు దేశాల్లోనే ప్రస్తుతం కమ్యూనిస్టు ప్రభుత్వాలు వున్నాయి. అవికూడా నియంతల చేతుల్లో మగ్గిపోతున్నాయి. మనదేశ ప్రజల జీవన పద్దతికి ఏమాత్రము సరిపోని పద్ధతులవి. చైనాలో వర్షం వస్తే మన దేశంలో గొడుగు పట్టే కమ్యూనిస్టులు ఈ దేశ ప్రయోజనాలను కోరుకుంటాయని అనుకోవడం భ్రమే అవుతుంది. గతించిన సిద్ధాంతాలను వల్లేవేస్తూ, గత చరిత్రను బాకాలు ఊదుతూ కాల గర్భంలో కలిసిపోతున్న కమ్యూనిస్టుల మనుగడ ఇంకెంతకాలం సాగుతుందో రానున్న రోజుల్లో వారు పెట్టుకునే పొత్తులు, వేసే ఎత్తులు, చేసే జిత్తులు నిర్ణయిస్తాయి.