Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గతితప్పిన స్వాతంత్య్రం… దగా పడిన గిరిజన తెగలు

భద్రాద్రి బ్యూరో, ఆగస్టు 18 (నిజం న్యూస్):*

”భారతదేశం అనేక తెగల, జాతుల సంగమస్థానం” అన్నారు బ్రిటిష్‌ మానవ శాస్త్రవేత్త వెరియర్‌ ఎల్విన్‌. ఇప్పటికి కేంద్ర ప్రభుత్వం 705 తెగలను షెడ్యూల్డ్‌ తెగలుగా గుర్తించింది. 2011 జనాభా లెక్కల సేకరణ ప్రకారం దేశంలో ఎస్‌టీల జనాభా 10.45 కోట్లు. అంటే 8.6శాతం ఉన్నారు. హర్యానా, పంజాబ్‌, ఢిల్లీ, పుదుచ్చేరి మినహా మిగతా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ గిరిజన తెగలు విస్తరించి ఉన్నాయి.

షెడ్యూల్‌ ఏరియా / ప్రాంతం

వలస పాలకులు 200 గిరిజన తెగలను దొంగతనాలు, దోపిడీలు చేసి జీవించేవారుగా వర్గీకరిస్తూ క్రిమినల్‌ ట్రైబ్స్‌ ఆఫ్‌ ఇండియా చట్టం చేశారు. 1874లో షెడ్యూల్‌ జిల్లాల చట్టం వచ్చింది. అనేక పోరాటాలు, తిరుగుబాట్లు జరిగాయి. ఫలితంగా తెగలు నివసించే కొన్ని ప్రాంతాలను బ్రిటిష్‌ చట్టాల అమలు నుండి మినహాయించారు. ఆ ప్రాంతాలనే షెడ్యూల్‌ ప్రాంతాలుగా పిలిచారు. ఆర్టికల్‌ 244(1) అమలుకోసం భారత రాజ్యాంగంలో 5వ షెడ్యూల్‌ చేర్చటం ద్వారా తెగలకు ప్రత్యేక హక్కులు సంక్రమించాయి. ప్రస్తుతం 1. గుజరాత్‌, 2. రాజస్థాన్‌, 3. మహారాష్ట్ర, 4. మధ్యప్రదేశ్‌, 5. తెలంగాణ, 6. జార్ఖాండ్‌, 7. ఛత్తీస్‌ఘడ్‌, 8. ఆంధ్రప్రదేశ్‌, 9. ఒడిస్సా, 10. హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలలో గిరిజన ప్రాంతాలు 5వ షెడ్యూల్‌గా ఉన్నాయి. ఇక్కడ పాలన గ్రామసభ, గిరిజన సలహా మండలి (టీఏసీ) ద్వారా జరుగుతుంది. ఆర్టికల్స్‌ 244(2), 275(1) అమలు కోసం భారత రాజ్యాంగంలో 6వ షెడ్యూల్‌ ద్వారా తెగలకు స్వయంపాలనా హక్కులు లభించాయి. ప్రస్తుతం 6వ షెడ్యూల్‌లో అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాలలోని గిరిజన జిల్లాలు ఏర్పడినవి. ఈ స్వయం పాలిత జిల్లా కౌన్సిల్స్‌కు విడిగా ఎన్నికలు జరగుతాయి. ఈ కౌన్సిల్స్‌కు పన్నులు వేసే అధికారం కూడా ఉన్నది. పెసా (ూజుూ ఏ) చట్టం 5, 6 షడ్యూల్‌ ప్రాంతాల పరిపాలన కోసం పార్లమెంట్‌ చేసిన ప్రత్యేక ఏర్పాటు.

 

*గిరిజన తిరుగుబాట్లు – స్వాతంత్య్ర పోరాటం*

 

రాజకీయంగా ఈ గిరిజన పోరాటాలు సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలు. గిరిజన తెగలు భూమి, అడవిపై, సాంప్రదాయపు హక్కులను కాపాడుకోవడానికి చేసిన పోరాటాలు. 1857 సిపాయిల తిరుగుబాటుని ప్రథమ స్వాతంత్య్రపోరాటమని బ్రిటిష్‌ చరిత్ర కారులు పేర్కొన్నారు. కానీ దీని కంటే చాలా ముందే విదేశీ పెత్తనాన్ని, దోపిడీని ఎదిరించి సాగిన పోరాటాలు జరిగాయి. వీటిలో గిరిజన తెగలు చేసిన తిరుగుబాట్లు ముఖ్యమైనవి. ఉదాహరణకు.. 1.పహారియాల తిరుగుబాటు (1778-80). 2. ముండాల తిరుగుబాటు (1789-1901). 3. ఆంధ్ర ఏజెన్సీలో రంప, మంప గ్రామాలలో కోయలు తిరుగుబాటు (1803).4. సంతాల్‌ తిరుగుబాటు (1855-56). 5. అల్లూరి సీతారామరాజు నేతృత్వంలోని మన్య విప్లవం (1922-24). 6. కొమరం భీం నేతృత్వంలోని గోండుల తిరుగుబాటు (1940-41). ఇలా మద్రాస్‌ ప్రెసిడెన్సీకి, ఈస్ట్‌ ఇండియా కంపెనీకి, బ్రిటష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన పోరాటాలు, తిరుగుబాట్లు అన్నీ ఓడిపోయాయి. అనేకమంది వీరులు నేలకొరిగారు. కాని దేశానికి స్వాతంత్య్రం తేవడంలో పునాది రాళ్లయ్యారు. అయితే వలసపాలకులు రెండు వ్యూహాత్మక పరిష్కారాలు అమలు చేశారు. 1. తిరుగుబాట్లు అణచివేయటం, నాయకులను చంపటంతో పాటు ఈ ఉద్యమాలు లేవనెత్తిన సమస్యలపై తెగల ఆంకాక్షలు నెరవేరుస్తామంటూ పలుచట్టాలు చేయటం, పాలసీలు ప్రకటించటం. 2. గిరిజన తెగల విశ్వాసాలను మార్చటం, వారిలో సత్ప్రవర్తన కలిగించే పునరుజ్జీవ ఉధ్యమాలు చేపట్టడం. క్రైస్తవ మత వ్యాప్తి కూడా ఇందులో ఒక భాగం.

భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో తెగల సమాజం ఉన్న ప్రతిచోట పెట్టుబడిదారీ వ్యవస్థ వేగంగా చొరబడలేకపోయింది. తెగల సమాజం ఇంకా కొత్త రాతియుగం నాటి ఉత్పత్తి స్థాయిని దాటి రాలేకపోవటంతో తెగల సమాజంలో వ్యక్తిగత ఆస్థి విధానం బలపడలేదు. 6వ షెడ్యూల్‌ రాష్ట్రాలలో భూమి ఇంకా సమిష్టి తెగ ఆస్థిగానే ఉంది. వ్యక్తుల పేరున పట్టాలుండవు. 5వ షెడ్యూల్‌ గల మన రాష్ట్రంలో కూడా బ్రిటిష్‌ కాలంలో ఏజెన్సీ ప్రాంతాలలో భూమి తెగల సమిష్టి ఆస్థిగానే ఉండేది. ముఠాదారీ వ్యవస్థ ఏర్పరిచి, షెడ్యూల్‌ భూములను కొలిచి, పన్ను కట్టగలిగిన వాడికి ఇచ్చారు. అలా గిరిజన ప్రాంతాలలో బ్రిటిష్‌ వారి రైతువారీ విధానం వచ్చింది. 1959లో ముఠాదారీ వ్యవస్థ చట్టం రద్దయింది. కాని భూమి గిరిజన తెగల సమిష్టి యాజమాన్యంలోకి మాత్రం రాలేదు.

 

*స్వాతంత్య్రం తర్వాత*

 

అల్లూరి సీతారామరాజు అనుచరుడు, విశాఖపట్టణం నుండి ఎం.పి.గా ఏకగ్రీవంగా ఎన్నికైన గాంమల్లు దొరను సభకు పరిచయం చేస్తూ ప్రధాని నెహ్రూ గిరిజన తిరుగుబాట్లను శ్లాఘించారు. దేశంలో గిరిజన అభివృద్ధికి సంబంధించిన సైద్ధాంతిక చర్చ పెద్దయెత్తున జరిగింది. ఒక వాదన ఈ తెగల సమాజంలో మనం జోక్యం చేసుకోరాదు, వారిని ఆ స్థితిలోనే వదలివేయాలని. రెండో వాదనేమో వారిని వెంటనే నాగరిక సమాజంలో కలపాలని. బలవంతంగానైనా వారిని అభివృద్ధి చేయాలని.

నెహ్రూ ఈ రెండు వాదనలను తిరస్కరించి, తాను కొన్ని ప్రతిపాదనలు చేశారు. నెహ్రూ ప్రతిపాదించిన ఈ ఐదు అంశాలనే గిరిజన పంచశీల అంటారు. భారత పాలక వర్గాలు ప్రతిపాదించి, చర్చించి అమలు చేస్తామని హామీ ఇచ్చిన ప్రణాళిక కూడా ఇదే…1. గిరిజనులు తమ సొంత మేదస్సుతో అభివృద్ధి అయ్యేందుకు అనుమతించాలి. 2. భూమి, అడవి విషయంలో గిరిజనుల హక్కులను గౌరవించితీరాలి. 3. పరిపాలన, అభివృద్ధికి గిరిజన బందాలకు శిక్షణ ఇవ్వాలి. బయటవారిని మరీ ఎక్కువ మందిని ప్రవేశపెట్టరాదు. 4. గిరిజనుల సామాజిక, సాంస్కతిక సంస్థలను చెదరగొట్టకుండా గిరిజనాభివృద్ధిని చేపట్టాలి. 5. గిరిజనాభివృద్ధి సూచికలో వారి నాణ్యమైన జీవితాలను చూడాలి తప్ప ఖర్చు పెట్టిన డబ్బులు కాదు.

కాగితాలపై గిరిజన తెగల ఆశలను, ఆకాంక్షలను ప్రతిబింభిస్తోంది ఈ పంచశీల. కానీ పంచశీల అమలుకు యంత్రాంగం ఏది? కేంద్రం రాష్ట్రాలకు వదిలేసింది. రాష్ట్రాలు తమకు కేటాయించిన బడ్జెట్‌ను కూడా ఖర్చు పెట్టలేకపోతున్నాయి. ఖర్చు పెట్టిన చోట గిరిజనేతర ప్రాంతాలలో వెచ్చిస్తున్నారు. ఉదాహరణకు కేంద్రం కేటాయించిన ”సబ్‌ ప్లాన్‌ నిధులు” ఏ రాష్ట్రం ఎక్కడ ఖర్చు పెట్టిందో తెలిపే అంకెలు వార్షిక నివేదికలలో కనిపిస్తాయి.

 

*75ఏండ్ల స్వరాజ్యం – గిరిజన తెగల అభివృద్ధి!*

 

పాలకుల దృష్టిలో గిరిజన సమస్య – కేవలం శాంతి భద్రతల సమస్య మాత్రమే. నాటి కాంగ్రెస్‌ నుండి నేటి బీజేపీ వరకు పాలక పార్టీల వైఖరి ఇదే. ఒక రకంగా ఇది వలస పాలకుల నుండి వారు వారసత్వంగా పొందిన వైఖరి. ఒక పురోగామి విధానం ప్రకటించారు. దానిని పంచశీల అన్నారు. కాని దాన్ని అమలు చేసే మంత్రిత్వ శాఖను ఎందుకు ఏర్పాటు చేయలేదు? గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కేంద్రంలో ఎప్పుడు ఏర్పడింది? ఎంఓటీఏ (మినిస్ట్రీ ఆఫ్‌ ట్రైబల్‌ ఎఫైర్స్‌) అక్టోబరు 1999న ఏర్పడింది నిజం కాదా? స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి సెప్టెంబరు 1985 వరకు హౌం మంత్రిత్వ శాఖలో ”ట్రయిబల్‌ డివిజన్‌” గా పనిచేసేది. సెప్టెంబరు 1985 నుండి మే 1998 వరకు సంక్షేమ శాఖలో ఉండేది. మే 1998 నుండి సెప్టెంబరు 1999 వరకు సాధికారత, సామాజిక న్యాయశాఖలో గిరిజన సంక్షేమం, అభివృద్ధి అణిగిమణిగి ఉండేది. అంతెందుకు… 2000 సంవత్సరం వరకు 5వ షెడ్యూల్‌ ప్రాంతంలో ఓల్డ్‌ సిర్‌.పి.సి అమలు ఉండేది. ఫలితంగా గిరిజనుల అరెస్టు అయితే బెయిలుపొందే అవకాశం కూడా ఉండేదికాదు. 24 గంటలలోపు మేజిస్ట్రేటు ముందు ఉంచటంకాని, ఎఫ్‌.ఐ.ఆర్‌. కట్టడం గాని లేదు. నెలల తరబడి పోలీసు స్టేషన్లలో మగ్గేవారు. అనేక గిరిజన పోరాటాల ఫలితంగా ఇప్పుడు న్యూ సి.ఆర్‌.పి.సి.అమలవుతుంది.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 244(1), (2) మరియు ఆర్టికల్‌ 244(ఎ)లు గిరిజన ప్రాంతాల అభివద్ధి, గిరిజనుల సంక్షేమం గురించే చెపుతున్నాయి. కానీ, 5వ షెడ్యూల్‌, 6వ షెడ్యూల్‌ విధి విధానాలు మాత్రం అరకొరగానే అమలు జరగుతున్నాయి. 1970 తర్వాత రాష్ట్రాల స్థాయిలో ఐటీడీఏ/ఐటీడీపీ ప్రాజెక్టులు ప్రారంభించారు. విద్య, వైద్యం ఉపాధి రంగాలు వివిధ పథకాలు చేపట్టారు. 1975 నుండి ఎస్‌.టి. జనాభా నిష్పత్తి ప్రాతిపదికన ప్రత్యేక గ్రాంటు ప్రణాళికా బడ్జెట్‌లో కేటాయింపులు జరగుతున్నాయి. దీనిని సబ్‌-ప్లాన్‌ నిధులంటారు. భారత రాష్ట్రపతి నియమించిన యు.ఎస్‌.దేబర్‌, బి.డి.శర్మ కమిషన్స్‌ ఈ పథకాలను, ప్రణాళికలను సమీక్షించాయి. ఆశించిన అభివృద్ధి జరగలేదని అభిప్రాయపడ్డాయి. ఈ కమిషన్స్‌ రెండు అంశాలు ఎత్తి చూపాయి. 1. గిరిజన తెగల అభివృద్ధి అవసరాలు, వారి ఆకాంక్షలు, ఆందోళనలు క్రూరంగా అణిచివేయబడ్డాయి. 2. వారిని పెట్టుబడి దారీ మార్కెట్‌ వ్యవస్థకు ‘ఏర’గా వేశారు. గిరిజనుల సాంప్రదాయ భూములు గిరిజనేతర పెత్తందారులు, భూస్వాములు ఆక్రమించుకుంటున్నారు. గిరిజన తెగలలో భూమి లేని పేదలు పెరుగుతున్నారు. ఎల్‌.టి.ఆర్‌. చట్టాలు అమలు చేసే ప్రభుత్వాలే లేవు. ”గిరిజన తెగలకు జరిగిన చారిత్రక అన్యాయం” సరిచేస్తానంటూ వచ్చిన అటవీ హక్కుల చట్టం, ఎక్కువ రాష్ట్రాలలో అమలుకు నోచుకోలేదు. పైగా అటవీ భూములను కార్పొరేట్లు, క్రోనీ కేపిటలిస్టులకు కట్టబెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం సవరణ చట్టాలు తెచ్చింది. సీఎన్‌టీ, ఎస్‌పీటీ, ఎల్‌టీఆర్‌ చట్టాలను నిర్వీరియం చేసి తెగల అభివృద్ధిని దారిమళ్లించింది.

2019 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు 42 లక్షల మంది (20 రాష్ట్రాలలో) పోడు పట్టా ధరఖాస్తు దార్లను భూమి నుండి తొలగించమని ఆదేశించింది. ఇది ఎఫ్‌ఆర్‌ఏ- 2006 చట్టం స్ఫూర్తికి వ్యతిరేకం. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ షెడ్యూల్డ్‌ ప్రాంతాలలో 100శాతం ప్రయిమరీ స్కూల్‌ టీచర్లను స్థానిక ఎస్టీ అభ్యర్థులతోనే నింపాలనే జీవో 3ని కూడా 2020 మార్చిలో సుప్రీంకోర్టు రద్దు చేసింది. రాజ్యాంగం గిరిజన తెగలకిచ్చిన రిజిర్వేషన్లనే ప్రశ్నార్థకం చేసే ఇలాంటి తీర్పులు, వెలువడుతుండగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తేలు కుట్టిన దొంగలా మౌనంగా ఉంది.

 

*గిరిజన తెగల మతమేది?*

 

స్తూలంగా వారిది మిగులు లేని సమిష్టి ఉత్పత్తి వ్యవస్థ. ఉత్పత్తి కార్యకలాపాలలో పాల్గొనకుండా తినే అవకాశం లేదు. తాత్విక చింతనకు సమయం లేదు. మత భావజాలం తెగల సమాజంలోకి ప్రవేశించలేదు. అయితే తెగలకు ప్రకృతి ఆరాధన ఉంది. మాతృ గణాలలో తల్లి దేవతల ఆరాధన ఉండేది. ఒక్కమాటలో వారు హిందువులు కాదు, క్రైస్తువులు, బౌద్ధులు కానే కాదు. వారికి స్వంత ప్రార్థనా పద్ధతులు ఉన్నాయి. 99 శాతం గిరిజనులు ఆవు మాంసం తింటారు. వారి సంస్కృతి, భాషలు ప్రత్యేకం.

 

*జాతీయ గిరిజన విధానం – 2020*

 

ఇటీవల గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ”జాతీయ గిరిజన విధానం – 2020” అని ఒక పత్రం విడుదల చేసింది. ఈ పత్రం అసలు పంచశీల సూత్రాలకు విరుద్ధమైనది. భూమి, అడవి నుండి గిరిజనులను తరిమివేసి తొలగించి కార్పొరేట్లకు, అదీ తమ క్రోనీలకు కట్టబెట్టేలా చట్టాలను సవరించారు. అటవీ భూములను అటవీయేతర అభివృద్ధి పనుల కోసం కేటాయించేందుకు గ్రామ సభ – పబ్లిక్‌ హియరింగ్‌ లాంటి ప్రక్రియలను రద్దు చేశారు. ఇదేనా గిరిజన హక్కులను గౌరవించే పద్ధతి. ఒకే దేశం, ఒకే భాష అనే బీజేపీ వైఖరికి అనుకూలంగా గిరిజన భాషలకు రక్షణ అనేది పాలసీలోనే లేకుండా ఎత్తివేశారు. ప్రణాళికా సంఘం రద్దు, పబ్లిక్‌ రంగ సంస్థల అమ్మివేత, చదువుకున్న గిరిజన యువత ఉపాధి అవకాశాలను దెబ్బతీయవా? పోడుసాగు పర్యావరణానికి ప్రమాదకరమట! వ్యక్తిగత సాగు భూసారాన్ని, చిన్న చిన్న కమతాలు భూ గర్భ జలాలను క్షీణింపజేస్తాయట! ఈ పాలసీ గిరిజనాభివృద్ధికే కాదు, దేశాభివృద్ధికి కూడా గొడ్డలిపెట్టు? మన పోరాటం సహకార, సోషలిస్టు ఉత్పత్తి విధానం వైపు సాగాలి. ఆచరణాత్మక పరిష్కారం అదే.