Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గుబులు పుట్టిస్తున్న…. ఏజ్ బార్

*వయోపరిమితి పెంచినా ఉద్యోగం అందని ద్రాక్షే*

*నోటిఫికేషన్ లేదు….ఉద్యోగం రాదు*

యాదాద్రి జిల్లా బ్యూరో* ఆగస్టు 19 (నిజం న్యూస్) రాష్ట్రంలో సుమారు ఒక లక్షా తొంభై వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని అంచనా. కానీ కేవలం గ్రూప్-1 పోలీసు ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక మిగతా ఉద్యోగాల గురించి ప్రకటనలే తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు పడటంలేదు ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వడంలో చేస్తున్న తీవ్రమైన జాప్యం వలన వయోపరిమితి పెంచినా కూడా ఉద్యోగం అందని ద్రాక్షగా మిగిలిపోయింది. రాష్ట్రంలో నాలుగు సంవత్సరాల నుండి ఎలాంటి నోటిఫికేషన్ వెయ్యకపోవడంతో నిరుద్యోగుల వయో పరిమితి పోగొట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం లక్షా తొంభై వేల పైచిలుకు ఉద్యోగాలకు సరైన సమయంలో నోటిఫికేషన్లు రాక నిరుద్యోగులు వయోపరిమితి పెంచినా ఉద్యోగాలకు అర్హత లేక నిరుద్యోగుల ఆశలు అడియాశలయ్యాయి. ఇటీవల టెట్ ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని చెప్పినా ఇప్పటివరకు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. గ్రూప్ 2,3,4 నోటిఫికేషన్ల ఊసే లేదు. దీనివల్ల వయోపరిమితి దాటిపోయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులు ఆశలు అడియాశలు అవుతున్నాయి. తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. కానీ

తెలంగాణ ప్రభుత్వం 2019కల్లా 1.12 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పింది. కానీ ప్రభుత్వాన్ని కేసీఆర్ హామీలను ఎవ్వరూ నమ్మడం లేదని ప్రతిపక్షాలతోపాటు నిరుద్యోగుల నిరసనలు చూస్తుంటే అర్థమవుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారమే రాష్ట్రంలో 8.4 లక్షల మందికిపైగా నిరుద్యోగులున్నారు. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో పాతిక వేల ఉద్యోగాలు భర్తీ చేశామని అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వం కేవలం పదహారు వేల ఉద్యోగాలే ఇచ్చిందని ప్రభుత్వం చెప్పిందొకటి చేసిందొకటి అని గగ్గోలు పెడుతున్నాయి

నీళ్ళు,నిధులు,నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాక నియామకాల ఊసే లేకపోవడం వలన నిరుద్యోగులు మానసికంగా కూడా ఒత్తిడికి గురి అవుతున్నారు. ప్రభుత్వం ఆలస్యం చేయడం వల్ల నిరుద్యోగులు లక్షల రూపాయలు నష్టపోతున్నారు. ప్రైవేటు ఉద్యోగాలు మానేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవడం కోచింగ్ సెంటర్లకు వేలకు వేలు దారపోయడం వల్ల అటు ఉద్యోగం రాకపోగా ఇటు అప్పులపాలై వేదన పడుతున్నారు. ఉద్యోగాల కోసం చంటి పిల్లలను కూడా వదిలి ప్రిపేర్ అవుతున్నవారు చాలామంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం 2014 లో సమగ్ర కుటుంబ సర్వే చేసినపుడు సుమారు ఎనిమిది లక్షల మందికి పైగా తాము ఏ రకమైన ఉద్యోగం చేయడం లేదని తెలిపారు. 2012-2022 మధ్యలో రాష్ర్టానికి 50.9 లక్షల మంది నిపుణుల అవసరం ఉన్నట్టు జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ తన నివేదికలో వెల్లడించింది కానీ తెలంగాణ ప్రభుత్వ నివేదికలు మాత్రం ప్రస్తుతం అంత పెద్ద ఎత్తున నైపుణ్యం ఉన్న కార్మికులు రాష్ట్రంలో అందుబాటులో లేరని ప్రస్తుతం నైపుణ్య అభివృద్ధికి సరిపడా మౌలిక వసతులు కూడా లేవని నివేదిక ఇవ్వడం ఆశ్చర్యపరుస్తుంది. దీనివలన ఎంతోమంది నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

నిరుద్యోగం కారణంగా 2016 నుంచి 2019 వరకు తెలంగాణలో 165 మంది ఆత్మహత్యలు చేసుకున్న కేసులు నమోదయ్యాయని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తేలి వెల్లడించారు. లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి  సమాధానం ఇచ్చారు. తెలంగాణలో 2016లో 24 మంది, 2017లో 45, 2018లో 40, 2019లో 56 మంది ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. కాగా దేశవ్యాప్తంగా కూడా నిరుద్యోగం కారణంగా ఆత్మహత్యలు పెరిగాయని, 2016లో 2298 కేసులు నమోదవ్వగా… 2019 నాటికి అవి 2851కి చేరాయని వెల్లడించారు. 2017లో 2404, 2018లో 2741 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసి చూసి కొందరు నిరుద్యోగులు ఆందోళన, మానసిక వేదనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రాణాలు తీసుకుంటున్నారు. పోయిన సంవత్సరం మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బబ్బెరు చెలక గ్రామానికి చెందిన అసంపల్లి మహేశ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.టీచర్ ట్రైనింగ్ చేసిన మహేశ్ కొద్దిరోజులుగా నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నాడు. అయినా ఫలితం లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇక ఉద్యోగం రాదన్న మనస్తాపంతో.. ఇప్పటికైనా ఉద్యోగాల నోటిఫికేషన్లు ప్రకటించాలంటూ సీఎం కేసీఆర్‌కు లేఖ రాసి మరీ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా ఉద్యోగాల కోసం ప్రాణాలు అర్పించిన నిరుద్యోగ యువకుల కుటుంబాలకు ఈ ప్రభుత్వం ఏమని సమాధానం చెప్తుంది. వాళ్ళను ఎలా ఓదారుస్తుంది. లక్షల్లో ఉద్యోగాలంటూ రాజకీయ ప్రకటనలు గుప్పించి అమలు చేయడంలో మాత్రం చిత్తశుద్ధి చూపకపోవడం వలన ఎన్నో కుటుంబాలు బలౌతున్నాయి. రెండవసారి అధికారంలోకి వచ్చాక కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ఇక మూడవసారి అధికారం చేజిక్కించుకోవడం కోసం ఎన్ని ఎత్తులు వేసినా అవన్నీ గెలుపుకోసం చేసే జిమ్మిక్కులేనని ప్రజలు భావించడం ఖాయం. ఇప్పటికే వయోపరిమితి పెంచినా అర్హత కోల్పోయిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంది.ఆ సంఖ్య రానరానూ మరింత పెరుగుతుంది. ఈ సమయంలో నిరుద్యోగ యువతకు భరోసా ఇచ్చేది ఎవరు. ఉద్యోగాల కోసం ఎదురు చూసి చూసి చివరికి ఆ ఉద్యోగానికి అర్హత కూడా కోల్పోతున్న యువతరం కూలి పనులకు వెళ్లాల్సి వస్తుంది.