జోరుగా అక్రమంగా మొరం త్రవ్వకాలు

జోరుగా అక్రమంగా మొరం త్రవ్వకాలు
– హుమ్నాపూర్ లో గుట్ట మాయం…
– రైస్ మిల్ కు తరులుతున్న మొరం…
– మైనర్ లతో ట్రాక్టర్ డ్రైవింగ్…
– అభివృద్ధి పనుల పేరిట మొరం పక్కదారి…
నిజం న్యూస్ :- వర్ని మండల కేంద్రంలోని హుమ్నాపూర్ గ్రామ శివారులో గుట్టల్లో అక్రమ మొరం త్రవ్వకాలు చేస్తూ ఓల్డ్ వర్ని బ్రిడ్జి దగ్గర గల రైస్ మిల్లుకు భర్తీ చేస్తున్నారు. మైనర్ లతో ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తూ, ట్రాక్టర్ లలో మొరాన్ని తరలిస్తున్నారు.ఈ మొరం త్రవ్వకాలు జోరుగానే సాగుతున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులకు మాత్రం పట్టింపు లేకుండా మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అలాగే మొరం తవ్వకాలకు మైనింగ్ అధికారుల నుండి ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండానే యదేచ్ఛగా నిరంతరం త్రవ్వకాలు చేస్తున్నారు. ప్రవేటు వారికీ మొరం అవసరం కావడంతో కాంట్రాక్టర్లు యథేచ్ఛగా తవ్వకాలు చేస్తున్నారు. కానీ నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్లు జిల్లా యంత్రాంగం నుంచి మొరం త్రవ్వకాలు చేసుకోవడానికి సంబంధిత శాఖల అధికారుల సిఫార్సుతో ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు ఆధారంగా మండల తహసీల్దార్ లు ప్రత్యేక అనుమతులు మంజూరు చేస్తారు. కానీ ఇవన్నీ పాటించకుండానే కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా ఎక్కడ ప్రభుత్వ భూములు, కొండలు, గుట్టలు ఉంటే అక్కడ అక్రమంగా మొరం త్రవ్వకాలు చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాల్లోని గుట్టలను, అసైన్మెంట్ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా మొరం త్రవ్వకాలు చేస్తూ దర్జాగా దందా కొనసాగిస్తున్నారు.
ఒక్కో టిప్పర్ మొరంను రూ. 2 వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. వార్త కవరేజ్ కోసం వెళ్ళిన విలేకరులపై మొరం మాఫియా దారులు దురుసుగా వ్యవహరించారని సదరు విలేకరి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా వర్ణి తహసీల్దార్ విట్టల్ ను చరవాణి ద్వారా వివరణ కోరగా మొరం త్రవ్వకాలు చేస్తున్నట్టు తనకు సమాచారం ఇవ్వడం జరిగిందని అనుమతులు ఏమి తీసుకోలేదని, ప్రతిదానికీ అనుమతులు అవసరమా అని చరవాణి ద్వారా సమాధానం ఇవ్వడం జరిగింది. రైస్ మిల్ కు మొరం త్రవ్వకాలు చేసి అమ్ముకుంటున్నారని విషయం దృష్టికి తీసుకెళ్లగా దీనిపై చర్యలు తీసుకుంటామని సమాధానమిచ్చారు. ప్రజలు అక్రమార్కులను నిలదీస్తే ప్రభుత్వ పనులకు తీసుకున్నామంటూ సమాధానం చెబుతున్నారు. అయితే అధికారుల అండదండలతోనే మొరం అక్రమ దందా కొనసాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.