శిథిలావస్థలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆగస్టు 17(నిజం న్యూస్) కొన్నిచోట్ల నిరుపేదల సొంతింటి గూడు కల ఇప్పట్లో నెరవేరేలా కన్పించడం లేదు. ఇండ్లను పంపిణీ చేస్తారని ఎదురుచూస్తున్న ఆశావాహులకు నిరాశ తప్పడం లేదు. చాలా చోట్ల డబుల్ బెడ్రూం ఇండ్లు ఇంకా నిర్మాణ దశ దాటడం లేదు. నిర్మాణాలు పూర్తయిన వాటి పంపిణీలోనూ అంతులేని జాప్యం జరుగుతోంది. కొత్తగూడెంలోని పలు ప్రాంతాల్లో నిర్మాణం పూర్తయిన ఇండ్లు మందుబాబులకు అడ్డాగా మారాయి. మరికొన్ని చోట్ల ప్రారంభానికి ముందే శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం తమకు డబుల్ ఇండ్లు కేటాయిస్తుందని ఆశ పెట్టుకున్న పేద కుటుంబాలు ఇంకా కిరాయి ఇళ్లలోనే మగ్గుతున్న పరిస్థితి నెలకొంది. రామవరం లోని ప్రశాంత్ నగర్ పంచాయతీలో గల డబుల్ బెడ్ రూములు ఇప్పటికీ మొదలై ఏడు సంవత్సరాల కావస్తున్న నిర్మాణం పూర్తికాక శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. సగం పూర్తయిన ఇళ్లల్లో మొత్తంపిచ్చి మొక్కలు పెరిగి అడవులను తలపిస్తున్నాయి.ఒక్కటంటే ఒక్క ఇంటిని కూడా లబ్ధిదారులకు అందించిన పాపాన పోలేదు. డబుల్ బెడ్రుమ్ ఇండ్లకు వందల్లో దరఖాస్తులు వస్తుంటే నిర్మాణాలు మాత్రం పదుల సంఖ్యలోనే ఉంటున్నాయి. జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామంటూ ఎన్నికల సమయంలో అదరగొట్టిన ప్రజాప్రతినిధులు అనంతరం వాటి ఊసెత్తకుండా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. ఎన్నికల సమయంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పై వాగ్దానాలు ఇచ్చి , వాటిని ఇవ్వడంలో విఫలమవుతున్నారు. దీంతో స్థానిక ప్రజలు , ప్రజాప్రతినిధులకు ఎక్కడికక్కడ తమ అసంతృప్తి ని బాహాటంగానే వ్యక్తపరుస్తున్నారు. డబల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి సంవత్సరాలు గడుస్తున్న వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేయడంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు విఫలం కావడంతో అవి ప్రారంభానికి ముందే శిథిలావస్థకు చేరుకుంటుంన్నాయి. సొంత ఇల్లు లేక ఎంతో మంది పేరు ప్రజలు చిన్న చిన్న గుడిసెలు వేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. కొంతమంది సొంత ఇల్లు ఎప్పటికైనా వస్తుందని ఆశతో ఇంకా కిరాయి ఇళ్లలో జీవనం కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు మేల్కొని అర్హులైన పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ లని అందించాలని పలువురు కోరుకుంటున్నారు.