Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వివక్షకు గురవుతున్న బేడ బుడగ జంగాలు

-పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం

బేడ బుడగ జంగం- పేరుతో పిలువబడుతున్న కులం నేడు ఎలాంటి అభివృద్దికి నోచుకోకుండా వుంది వారి జీవితాలలోకి తొంగిచూస్తే 75 ఎండ్ల స్వాతంత్య్రం ఎంతటి ఎక్కిరింతగానో కనిపిస్తుంది. బేడ బుడగ జంగం కులంగా మారకముందు పూర్తిగా వీరికి తెగ లక్షణాలున్నాయి. వేల సంవత్సరాల చరిత్రలో వీరి మూలాలు కనిపిస్తాయి.కథలు చెప్పుకుంటూ బిక్షాటన చేస్తూండే ఈ యాచక సంచార తెగ గత 20 సంవత్సరాల నుండి క్రమంగా స్థిరనివాసం వైపు నడుస్తున్నది. బారతీయ కుల సమాజంలో సహజంగా ఉండే అమానవీయపు కుల వ్యవస్థ లక్షణాలకు చాలా కాలం దూరంగా ఉన్నా ఈ తెగ గ్రామ జీవితాల్లో భాగం కావడం ప్రారంభం అయినాక జంగం కులంగా పరిణామం చెందినది.బేడ బుడగ జంగాలు వీర శైవాన్ని ఆచరించేవారు.వీరశైవం సన్నగిల్లిన తర్వాత జంగాలు అనేక కులాలుగా చీలిపోయినప్పుడు యాచకులుగా మారిన ఒక తెగకు బేడ జంగమని పేరు వచ్చింది.బేడ అనేపదానికి కన్నడ బాషలో యాచన అనే అర్థం ఉంది. వీరు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణ రాష్రాల్లో నివసిస్తున్నారు.ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో వీరు పిలవబడుతున్నప్పటికీ వీరి ఆచార సాంప్రదాయలు, జీవనవిధానంలో ఏకత్వం ఉంటుంది.

బుడగ జంగం వృత్తులు

బుడగ జంగం కులం గురించి దానిలోని వివిధ వృత్తుల గురించి చాలా తక్కువ మందికి తెలుసు ఈ తరం యువకులకు తెలిసే అవకాశం కూడా తక్కువే బ్రాహ్మణీయ కులవ్యవస్థలో జంగం వారు శూద్రులుగా వర్గీకరించబడ్డారు. శైవమత ప్రభావంతో.. జంగం కులం పేరుతో జంగం మెట్టు, జంగాలపల్లి వంటి పేర్లతో ఆంధ్రా, తెలంగాణలలో అనేక గ్రామాలు నిర్మించబడ్డాయి. కాలక్రమంలో ఆ గ్రామాల్లో జంగాలు లేకుండా పోయారు. 13వ శతాబ్దం చివరినుండి (వీరశైవం దెబ్బతిన్నతర్వాత) శూద్ర కులాలకు పురోహితులు గా పని చేస్తూ మాలజంగం, బుడిగె జంగం, బేడజంగం వంటి పేర్లతో వేరు వేరు కులాలుగా రూపాంతరం చెందినారు.వీర శైవ సాంప్రదాయానుసార జీవనులయిన జంగాలు ఆనాటి నుండి ఈనాటి వరకు నియమ నిష్టలను పాటిస్తూ తమ కుల ప్రత్యేకతను కాపాడుకుంటూ వస్తున్నారు. గురువులయిన ఈజంగాలు కొన్ని శూద్ర కులాల వద్ద ముఖ్యంగా శైవులయిన బిక్షుక కులాల వద్ద గురుదక్షణ తీసుకోవడం ఆచారంగా స్థిరపరిచారు. ఐదేళ్ళకోసారి బిక్షుక కులాలను కలిసి జోలెకు రూపాయి చొప్పున వసూలు చేసుకునే వాళ్ళు . బిక్షుక కులాల పురుడు, పెళ్లి వంటి కార్యక్రమాలు జంగాలు నిర్వహించేవారు. వీళ్ల వద్ద బియ్యం, పప్పులు చింతపండు వంటి వండని సామాగ్రిని సాహిత్యం పేరుతో పుచ్చుకునేవారు. జోలెకింతని తీపుకునే ఆచారం 1958 వరకు కొనసాగింది.

శైవ సంబంధమైన ముఠాల పేర్లే జంగం వారి ఇంటి పేర్లుగా ఉండడం గమనార్హం. నేడు రైతులుగా, వ్యవసాయ కూలీలుగా, దర్జీలుగా, బుట్టలు నేసేవారిగా, పూలమ్మేవారిగా పట్టణాల్లో రోజువారి కూలీలుగా బతుకుతున్నారు. కొంతమంది ఇంకా కుల వృత్తిని నమ్ముకుని పలురకాలుగా దుర్బరమైన జీవితం గడుపుతున్నారు.

జంగాలు నేడు వారి వారి వృత్తులు లేక ప్రత్యామ్నాయం లేక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో ఇనాటికి సంచార జీవితంలో చాలామంది ఉండటం వల్ల జనాభాలెక్కల్లోకి వీరు రావడం లేదు. తెలతెల్ల వారక ముందే గంటలూపుతూ శంఖం ఊదుతూ దీవెనెలందించే బాలసంతువేషంతో పాటు..తుపాకి రాముడు,బ్రహ్మణ వితాంతంతు,కోయపంతు,ముత్తిపంతు ఏక తార పంతు, మొదలైన ఏకవ్యక్తి కళా ప్రదర్శనల ద్వారా జంగాల జీవితం తెల్లారిపోయింది.

33 రకాల వేషాలువేసి అద్భుతమైన బుర్రకథలు, జానపదాల ద్వారా చరిత్రను తమ నాటకాల మీద రాసుకొని తిరిగి భవిష్యత్‌ తరాలకు అందించిన అత్యంత ప్రతిభ కలిగినవి వీరి కళలు.ఏ ఆదరవు లేని చిన్న సమూహాలుగా బిక్షాటన చేస్తున్న స్త్రీలపై అత్యాచారాలకు ఒడిగట్టారు. క్రమంగా వీరి కళలన్నీ అధిపత్య వర్గాల వశమైనాయి. గొప్ప కళా వారసత్వ సంపదను సమాజానికందించిన వీరికి ఈ వ్యవస్థ ఎటువంటి సహాయాన్ని అందించలేదు. కనీస గౌరవ మర్యాదలు యివ్వలేదు. వారి కళలేమో అద్బుతమైనాయి.కాని వారి స్పర్శ ఈ వ్యవస్థకు అంటరానిదిగా ముట్టరానిదిగా తయారైంది.

బెడ బుడగ జంగాలను ప్రభుత్వం ఆదుకోవాలి:శ్రీపాటి నాగరాజు

ఎస్సీ ఉపకులమైన బెడ బుడగ జంగాలను ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలని బెడ బుడగ జంగాల మండలాధ్యక్షుడు శ్రీపాటి నాగరాజు డిమాండ్ చేశారు. శనివారం పత్రిక విలేకరులతో మాట్లాడుతూ మా కులం వారికి వృత్తిపరంగా ఎలాంటి ఆదరణ లేకపోవడంతో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని, ప్రభుత్వం తమకు తగిన విధంగా ప్రోత్సాహకాలు అందించి తమ కులస్తులను ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరారు.ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణమే స్పందించి బెడ బుడుగు జంగాల పై ఆలోచన చేస్తే బాగుంటుందని పలువురు నేతలు కూడా కోరుకుంటున్నారు.