Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

స్వచ్ఛమైన జీవితం అనుభవించే తెగ ఆదివాసీ తెగలు

*ఘనంగా*

*ప్రపంచ ఆదివాసీ దినోత్సవం*

*- స్వచ్ఛమైన జీవితం అనుభవించే తెగ ఆదివాసీ*

*- మనుగడకు ఎన్ని అవాతారాలు ఎదురవుతున్నా, అభివృద్ధికి దూరంగా ఉంటున్నా.. అడవినే నమ్ముకుని అక్కడే ఉండిపోతున్నారు.*

*- జీవనం, సంస్కృతి, సంప్రదయాలలో వైవిధ్యం ఉంటుంది.*

*భద్రాద్రి బ్యూరో, ఆగస్టు 9 (నిజం న్యూస్):*

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు.: ఆదిమ గిరిజన తెగల్లో ద్రావిడ జాతికి చెందిన ఆటవిక తెగ చెంచు. చెట్టు అనే పదం నుంచి చెంచు వచ్చినట్లు పరిశోధకులు చెబుతారు. వీరి చరిత్ర, సంస్కృతి, సమకాలీన వ్యవహారాలపై చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. 17వ శతాబ్దంలో ఫెరిస్టా అనే చరిత్రకారుడు చెంచుల జీవనం గురించి అధ్యయనం చేశారు. 1943లో హెమండార్ఫ్‌ రాసిన పుస్తకంలో చెంచుల ప్రస్థావన ఉంది. దేశంలో అత్యంత వెనుకబడిన తెగగా నల్లమల చెంచులను ప్రభుత్వం గుర్తించింది. వీరి జనాభా నానాటికీ క్షీణిస్తోంది. వీరి సంరక్షణకు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేశారు. అయినా ఆశించిన ఫలితాలు రావడం లేదు.

*గూడేల్లో నివాసం*

చెంచు కుటుంబాలు నివసించే ప్రాంతాలను పెంటలుగా పిలిచేవారు. నల్లమలో దోమలపెంట, సున్నిపెంట, చదరంపెంట తదితరాలు ఇందుకు ఉదాహరణ. పెద ్దపెంటలను గూడేలు అనేవారు. గూడేలలో స్థిర వ్యవసాయం ఉండేది. పెంటల్లో అటవీ ఫలసాయ సేకరణ, వేటపై ఆధారపడుతున్నారు. నల్లమల చెంచుల మాతృభాష తెలుగు అయినా, ప్రత్యేక యాస, మాండలికం మిళితమై ఉన్నాయి. బయటి ప్రపంచంతో చాలాకాలంగా పరిచయాలు ఉన్నాయి. దీతో సులభంగానే కలిసిపోయి, సంభాషిస్తున్నారు. కానీ మౌలిక వసతులు, అభివృద్ధి పరంగా చాలా వెనుకబడ్డారు. పెంటల్లో నేటికీ అనారోగ్యం, పోషకాహార లోపం, ఆర్థిక వెనుకబాటుతనం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. వారి సాంస్కృతిక వారసత్వం మాత్రం ఉన్నతస్థాయిలో ఉందని చారిత్రక, సమకాలీన అంశాలు రుజువు చేస్తున్నాయి.

*రెండు తెగలు*

చెంచుల్లో అడవి చెంచులు, ఊర చెంచులు అన్న తెగలు ఉన్నాయి. నల్లమలలో కృష్ణానదికి ఇరువైపులా ఉండే కొండ, లోయ ప్రాంతాల్లో నివసించేవారిని అడవి చెంచులు, కొండచెంచులు అని పిలుస్తారు. గ్రామాల్లో తిరుగుతూ భిక్షాటన చేసేవారిని ఈర చెంచులు అంటారు. వీరినే కృష్ణ చెంచులు, చెంచుదాసరులు అని కూడా పిలుస్తారు. వీరు ప్రత్యేకమైన వేషాధారణలో గంట (లోహపు పలక) వాయిస్తూ గ్రామాల్లో సంచరిస్తారు. గ్రామస్థులు ఇచ్చిన బట్టలు, పెట్టిన భోజనంతో జీవితం గడిపేస్తారు.

 

అయితే ఆధునిక కాలంలో అడవి చెంచులు, ఊర చెంచుల జీవనంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పూర్తిగా అడవుల్లో నివసించేవారి పరిస్థితి ఇప్పటికీ దయనీయంగానే ఉంది. బక్కపలచగా, పొట్టిగా, చెదిరిన ఉంగరాల జట్టు, అమాయకపు ముఖం, సప్పిడి ముక్కు, నలుపు లేక రాగిరంగు చర్మంతో ఉంటారు. ఎప్పుడూ అడవిలో సంచరిస్తూ అటవీ ఫలసేకరణ, చిన్న జంతువుల వేట ద్వారా జీవనం సాగిస్తున్నారు. వీరి కుటుంబాలు చిన్నవిగా ఉంటాయి. భార్య, భర్త, చిన్నపిల్లలు, సాయంగా కుక్క ఉంటాయి.

*ఇప్పటికీ ఓలి*

చెంచులది ప్రద్యేకయైున వ్యవస్థ. వరుడికి కట్నం ఇవ్వరు. వధువుకు వోలి ఇచ్చే ఆచారం ఉంది. పెంళ్లిలో ఆర్బాటాలు కనిపించవు. ఉన్నంతలో ఆడుతూ పాడుతూ సంతోషంగా జరిపిస్తారు. ఇంటిపేరు, గోత్రం పరిగణలోకి తీసుకుని ఆరుబయటే వివాహాలు చేసుకుంటారు. చెంచులకు సంబంధించి మొత్తం 26 గోత్రాలు ఉన్నాయి. అర్తి(అరటి), నిమ్మల(నిమ్మచెట్టు), కుడుముల (వంటకం), పులచెర్ల (పెద్దపులి), ఉడతల (ఉడత), తోకల(తోక), మేకల (మేక), ఉత్తలూరి లాంటి ఇంటిపేర్లు ఉన్నాయి. ప్రకృతి దగ్గరగా జీవించే వీరి మతాచారాలు కూడా ప్రకృతిలో ముడిపడి కనిపిస్తాయి.

 

వివాహం, మరణం వంటి సందర్భాల్లో తమ తెగ ఆచారాలను పాటిస్తారు. తమ సరిహద్దు అటవీ ప్రాంతంలో ఫలసాయంపై ఆ గూడేల వారికే హక్కు ఉండేది. పండ్లు, బంక తదితరాలను ఇచ్చే చెట్లను సామాజిక ఆస్తి కింద అనుభవిస్తారు. చెంచుల్లో కుల పంచాయతీ బలంగా ఉంటుంది. సామాజిక జీవనానికి సంబంధించిన అన్ని విషయాల్లో పెద్దల జోక్యం ఉంటుంది. కులాచారాలు పాటించని వారికి జరిమానాలు విధించడం, కొన్నిసార్లు వెలియ్యడం వంటి ఆచారాలు కొనసాగుతున్నాయి.

పుణ్యక్షేత్రాలతో బంధం

నల్లమలలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన శ్రీశైలం, అహోబిలం దేవాలయ స్థలపురాణాల్లో చెంచుల గురించి ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఆ వివరాల ప్రకారం, చెంచులు తమ కులదైవాలైన మైసమ్మ, యాదమ్మ, గురవయ్యను పూజిస్తారు. జాతరలనూ నిర్వహించేవారు. శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి అసలు పేరు మల్లన్న. మల అంటే కొండ, పెద్దలను గౌరవంగా పిలిచేందుకు ఉపయోగించే పదం అన్న. మల్లన్న అంటే కొండమీద ఉన్న అన్న అని అర్థం. చెంచులు మల్లన్నే తమ మొదటి దేవుడని దేవుడుగా విశ్వసిస్తారు. మల్లన్న నుంచి పుట్టిన సంస్కృత పద రూపమే మల్లికార్జునుడు అని అంటారు. శ్రీశైలంలో ఉన్న వృద్ధ మల్లికార్జునుడే చెంచు మల్లన్న అని కొందరి నమ్మకం.

 

*స్వామి రూపం చెంచు* దేవతల్లాగే ఒక రాయి ఆకారంలో ఉంటుంది. శ్రీశైలం ఆలయ ప్రాకారంపై చెంచులు వేటాడుతున్న శిల్పాలు మల్లన్నతో వారి అనుబంధానికి నిదర్శనం. శ్రీశైలానికి రోడ్డు లేని రోజుల్లో అడవి మార్గంలో భక్తులకు చెంచులే సాయపడేవారని బ్రిటీష్‌వారు రికార్డుల్లో పొందుపరిచారు. అడవి జంతువుల నుంచి కాపాడుతూ, భక్తులిచ్చే కానుకలతో కొందరు జీవనం గడిపేవారని చరిత్రలో ఉంది. నేటికి శ్రీశైలంలో చెంచు సంప్రదాయాలతో సంక్రాంతి పర్వదినం రోజున మల్లన్నకు కల్యాణం నిర్వహిస్తున్నారు. అహోబిలం క్షేత్ర చరిత్రలో కూడా చెంచుల ప్రస్థావన ఉంది.

 

హిరణ్యకశివున్ని వధించిన తర్వాత ఉగ్రనారసింహుడు ఇంకా ఉద్రేకంతో అడవిలో సంచరిస్తుంటే లక్ష్మీదేవీ చెంచిత రూపంలో వచ్చి శాంతిపజేశారన్నది ఒక విశ్వాసం. పాల్కురికి సోమనాథుడు ‘పండితారాధ్య చరిత్ర’లో చెంచు జాతి గురించి ప్రస్థావించారు. శ్రీశైలానికి వచ్చిపోయే భక్తులకు చెంచులు అండగా నిలిచేవారని, నడవలేని వారిని కావిళ్లతో మోసేవారని, వారికి ఆహారం, మంచినీరు సమకూర్చేవారని పేర్కొన్నారు.

*శాంతి కాముకులు*

చెంచులు ఏ కార్యం తలపెట్టినా ముందుగా చెంచులక్ష్మిని పూజిస్తారు. ఆమెను శక్తి స్వరూపిణిగా కొలుస్తారు. చెంచిత అంటే వేటకు గుర్తు. లక్ష్మి అంటే శాంతి. జీవనం కోసం వేట, శాంతియుత జీవనం అనే అద్భుత సందేశం ఇందులో ఇమిడి ఉంది. చెంచులు ఇతరులను గౌరవిస్తారు. సభ్యతగా నడుచుకుంటారు. అమాయకంగా ఉంటారు.

ఐటీడీఏ ఉన్నా..

నల్లమల చెంచుల అభివృద్ధి కోసం శ్రీశైలం కేంద్రంగా *1988లో ఐటీడీఏ* కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. గ్రూప్‌-1 అధికారిని పీడీగా నియమించి అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. గృహాలు, తాగునీరు, విద్య, వైద్యం, వ్యవసాయం, నైపుణ్య శిక్షణ, ఉపాధి, ఇంజనీరింగ్‌ సేవలు అందిస్తున్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్‌ప్లాన్‌ రూ.కోట్లు వెచ్చిస్తున్నాయి. అయినా చెంచుల జీవనం మెరుగుపడలేదు.

చాలా గూడేల్లో తాగునీరు, రోడ్డు, విద్యుత్‌ సౌకర్యం లేవు. శ్రీశైలం ఐటీడీఏ పరిధిలోని జానాలగూడేం, పెచ్చెర్వు, నాయనిచెర్వు, చదరంపెంట, ప్రకాశం జిల్లాలో చిన్నారుట్ల, పెదారుట్ల, చింతలముడిపి, గుండంచెర్ల, చెన్నపాలెం, శాంతినగర్‌, గౌతమబుద్ధుని చెంచు కాలనీ, ఇష్టకామేశ్వరి, అల్లీపాలెం, దద్దనాల, గారంపెంట, తెలుగురాయునిచెర్వు, అలాటం, గుంటూరు జిల్లాలో జెండాపెంట గూడేల్లో విద్యుత్‌ సౌకర్యం లేదు. జానాల, చదరంపెంట, పెచ్చెర్వు, పాలుట్ల చెంచు గూడేలకు రోడ్డు లేదు. అత్యవసర వైద్యానికి జోలె కట్టుకుని రోగిని తీసుకువస్తారు. అపరిశుభ్రత కారణంగా వర్షాకాలంలో వ్యాధులు ప్రబలుతున్నాయి. పౌష్టికాహరం లేక, నాటు వైద్యానికి అలవాటుపడి, మద్యానికి బానిసలై అనేక మంది అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు.

*నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం*

ప్రపంచ వ్యాప్తంగా ఆదివాసీలు అంతరించిపోతున్న తరుణంలో వారి సంరక్షణ దిశగా ఐక్యరాజ్యసమితి చర్యలు చేపట్టింది. ఏటా ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించాలని 1994లో ప్రకటించింది. 1997లో గిరిజనులకు ప్రత్యేక చట్టాలు, హక్కులను కల్పిస్తూ.. ప్రపంచ దేశాల ప్రతినిధులను తీర్మానానికి ఆహ్వానించింది. 143 ఐరాస సభ్యుదేశాలు ఓటింగ్‌లో పాల్గొనగా 125 దేశాల ప్రతినిధులు తీర్మానాన్ని ఆమోదించారు. 14 మంది తటస్థ వైఖరి తెలపగా, కేవలం నలుగురు వ్యతిరేకించారు. అప్పటి నుంచి గిరిజన హక్కులు, వారికి ప్రభుత్వాలు కల్పిస్తున్న రాయితీల గురించి అవగాహన కల్పించేందుకు ఏటా ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

కొమరం లక్ష్మణరావు. (వ్యవసాయ విస్తరణ అధికారి)

1982 ఆగస్టు 9న జెనివాలో 26 మంది స్వతంత్ర మానవ హక్కుల నిపుణులతో వర్కింగ్ గ్రూప్ సమావేశం ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగింది. ఆగస్టు 9న ఆదివాసీ ప్రజల దినోత్సవంగా సమావేశం అంతర్జాతీయంగా గుర్తించింది. దేశంలో 461 రకాల ఆదివాసీ తెగలు ఉండగా.. 92% వరకు అటవీ ప్రాంతంలో వ్యవసాయం, వేట, అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తున్నారు. దేశంలో ప్రస్తుతం 12 కోట్ల మంది ఆదివాసీలు ఉండగా., తెలంగాణలో 12 లక్షల మంది గిరిజన జనాభా ఉంది. గూడెంలలో చెంచు పెంటల్లో ఆదివాసీలు మానవ సమాజం తొలి బిడ్డలైన గోండు, కోయ, కోలాం, పర్ధన్, నాయక్ పోడు, మన్నెవారు, కొండరెడ్డి, చెంచు, మొదలగు ఆదిమ తెగలు ఉన్నాయి. కానీ ఇప్పటికీ అభివృద్ధి కి ఆమడ దూరంలోనే ఉన్నారు. కావున ఇకనైనా ప్రభుత్వాలు ఆదివాసుల పట్ల చొరవ చూపాలని కోరుకుంటున్నాను.

*(ఆట) నాయకులు రవిబాబు (జిల్లా ఆర్గనైజింగ్-సెక్రటరీ)*

1994 నుండి 2004 వరకు అంతర్జాతీయ ఆదివాసీ దశాబ్దాలుగా ప్రకటించింది. అయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. సంక్షేమ, సంరక్షణ ప్రకటనల నీడన అభివృద్ధి నినాదం చాటున ఆదివాసీ ప్రాంతంపై నిరుద్యోగుల జీవితాలను విధ్వంసకాండ జరుపుతుంది. 2020 ఏప్రిల్ 24న అతి ముఖ్యమైన జి. వో. నెం. 3 ని సుప్రీంకోర్టు కొట్టివేసి, ఆదివాసీ నిరుద్యోగుల జీవితాలను మరియు 29 జి.వో ల భవితవ్యంను ఆగమ్యగోచరం చేసింది. ఆదివాసీలకు రాజ్యాంగంలో చట్టాలు, హక్కులు ఉన్నప్పటికీ భూమి అన్యాక్రాంతం కాబడుతుంది. ఆదివాసీ చట్టాలు అమలుకు నోచుకోవడం లేదు. ఆర్థికంగా, సామాజికంగా ఆదివాసీలు దోపిడీకి గురి అవుతున్నారు. కావున ఆదివాసీలు అంతా ఉద్యమించాలని కోరారు.

ఆల్లెం, కోటి. తుడుండెబ్బ (రాష్ట్ర ప్రచార కార్యకర్త)

తెలంగాణ ఆవిర్భావంలో ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను తాకట్టు పెట్టి ఆదివాసీలను బలి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం పేరుతో దశాబ్దాలుగా ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములలో మొక్కలు నాటి, ట్రెంచ్ లు కొట్టి దౌర్జన్యం చేసి, తప్పుడు కేసులు పెట్టి భూములను లాకుంటున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో *జల్-జంగల్- జమీన్* లతో పాటు కొండలు, ఖనిజాలు, ఆదివాసీల సహజ హక్కులను రాజ్యాంగ రక్షణ చట్టాలను కాలరాస్తున్నారు. రాష్ట్రపతిగా ఆదివాసీ మహిళను ఎన్నుకొని వెంటనే ఫారెస్ట్ (సంరక్షణ) నియమావళి-2022 కొత్త చట్టాన్ని చేసి అడువులపై అధికారాన్ని కేంద్రం హస్తగతం చేసుకుంది. ఎన్ని యుగాలు మారినా, ఎన్ని తరాలు మారినా ఆదివాసీలు ఆదిమ మానవుడిగానే మిగులుతున్నారు. కొమరం భీం నిజాం నిరంకుశ పాలనపై స్వయం పాలనకై ఏవిధంగా తిరుగుబాటు చేసి ఆఖరి శ్వాస వరకు పోరాడినారో.. అదే విధంగా మళ్ళీ తిరుగుబాటు ఉద్యమమాలు చేపడితేనే షెడ్యూల్డ్ ప్రాంతంలో ఆదివాసీల మనుగడ కొనసాగుతుందని తెలియజేశారు.