ప్రేమించలేదని యువతిపై కత్తితో దాడి.

నల్లగొండ జిల్లా ఇంచార్జి ఆగష్టు 09.(నిజంన్యూస్): ప్రేమ పేరుతో యువతిని వేధిస్తూ కత్తితో దాడి చేసిన ఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీటీఎస్ ఫారెస్ట్ పార్కులో మంగళవారం చోటుచేసుకుంది.
వన్ టౌన్ సీఐ రౌతు గోపి తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండలోని దేవరకొండ రోడ్డు లో నివసిస్తున్న రోహిత్ ఎన్జీ కాలేజీలో బీబీఏ సెకండియర్ చదువుతున్నాడు. రోహిత్ గత ఏడు నెలల నుంచి పానగల్‌కు చెందిన నవ్య అనే యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. మొహర్రం సందర్భంగా సెలవు కావడంతో నవ్య ఆమె స్నేహితురాలు శ్రేష్ఠ కలిసి ఫారెస్ట్ పార్క్‌లో తాయి అనే స్నేహితుడిని కలిసేందుకు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఫారెస్ట్ ఆఫీస్ దగ్గరకు వచ్చారు. తాయితో పాటు నవ్యను సతాయిస్తున్న రోహిత్ కూడా అక్కడకు వచ్చాడు.
నవ్య తో రోహిత్ ఒక ఇరవై నిమిషాలు మాట్లాడాలని, నవ్యను పక్కకి తీసుకెళ్లి తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై విచక్షణారహితంగా కడుపులో, చేతులపై, కాళ్ళపై, మొహంపై పొడిచి, అక్కడి నుంచి తన వెంట తెచ్చుకున్న వాహనాన్ని అక్కడే వదిలిపెట్టి పారిపోయాడు. బాధిత యువతిని వైద్యం కోసం సాయి రక్ష హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం ఆమె కండిషన్ పర్వాలేదు. కేసు నమోదు చేసుకొని నేరస్థుడి ఆచూకీ కోసం గాలిస్తున్నామని సీఐ తెలిపారు.