అక్రమ కట్టడాలపై దిగొచ్చిన మై హోమ్ సిమెంట్స్!
*మహా మర్మం…తేటతెల్లం*
*అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలు చేపడుతున్నారంటూ వరుస కథనాలు ప్రచురించిన మీడియా.
*డిటిసిపి అప్రువల్ లేకుండానే అక్రమనిర్మాణాలు.
*ఇప్పటికే 60% మేర అపార్ట్మెంట్లు 20% మేరా యూనిట్-4 ప్లాంట్ నిర్మాణం.
*ప్రాజెక్టు నిర్మాణంలో పెద్దఎత్తున సవరణలకు మైహోం నానాయాతన.
*కేంద్ర ప్రభుత్వం జారీచేసిన పర్యావరణ అనుమతుల ఉల్లంఘన.
*అనుమతుల కోసం మేళ్లచెరువు జిపిలో తాజాగా మంగళవారం దరఖాస్తు.
*మేళ్లచెరువు:-* ఎట్టకేలకు మైహోం యాజమాన్యం దిగొచ్చింది. యూనిట్-4 నిర్మాణాలకు ఎటువంటి అనుమతులు లేవని ఒప్పుకుంది.నిన్నటి వరకు అన్ని అనుమతులు ఉన్నాయంటూ జిపి తీర్మానం అవసలేదని బుకాయించిన మైహోమ్ సంస్థ దిగొచ్చింది.పాలకవర్గంతో పనిలేదన్న మైహోం యాజమాన్యం తిరిగి సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు గ్రామపంచాయతీకి తీర్మానం ఇవ్వండి మహాప్రభో అంటూ తాజగా మంగళవారం దరఖాస్తు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా అనుమతులు పొందిన భూమిలో కాకుండా ప్రభుత్వ, సీలింగ్,భూదాన్ భూములు ఉన్న వివాదాస్పద భూముల్లో నిర్మాణాలు చేపడుతున్నారని మీడియా పెద్ద ఎత్తున వరుస కథనాలు ప్రచురించింది.అనుమతులు ఒకచోట నిర్మాణాలు మరోచోట చేపట్టింది. ఇట్టి నిర్మాణాలకు ఎటువంటి అనుమతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేయలేదు. కట్టడాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన పర్యావరణ అనుమతులకు విరుద్దంగా ఉన్నాయంటూ పనులు నిలిపివేయాలని ఇప్పటికే అధికార యంత్రాంగం నిర్మాణాలను అడ్డుకుంది. నిర్మాణాలు అక్రమ కట్టడాలేనని అంతర్మదనం చేసుకున్న మైహోం యాజమాన్యం తాజాగా అనుమతులు జారీ చేయాలంటూ గ్రామపంచాయతీ మెట్లెక్కింది. మంగళవారం నాడు అనుమతుల కోసం పలు సర్వే నెంబర్లతో యూనిట్-4, గెస్ట్ హౌస్ ఉద్యోగుల నివాసగృహాల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకుంది. గతంలోనే టీఎస్ఐపాస్,డిటిసిపి అప్రూవల్ తో అన్ని అనుమతులు పొందే నూతన సిమెంట్ ప్లాంట్ నిర్మాణాలు చేపడుతున్నాం అన్న మైహోం సంస్థ, ఎటువంటి డిటిసిపి పత్రాలు లేకుండానే మళ్లీ నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది. ఇప్పటికే ఈ అనుమతులకు సంబంధించిన ప్లాంట్ నిర్మాణం 20శాతం, అపార్ట్మెంట్ నిర్మాణం 60శాతం పూర్తయింది.వివాదాస్పద భూదాన భూముల్లో చేపడుతున్న కట్టడాలు అక్రమనిర్మాణాలే అని మైహోమ్ యాజమాన్యమే నిర్ధారణకు వచ్చింది.ఈ నేపథ్యంలో ఇప్పటికే హుజుర్నగర్ ఆర్డిఓ మేల్లచెరువు రెవిన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 1057 లోపల ప్రభుత్వ సీలింగ్ భూముల్లో మైహోం సంస్థ నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించి అంతర్గతంగా మైహోం చేపడుతున్న నిర్మాణాలు అక్రమమే అని తేల్చినట్టు సమాచారం.
*అన్ని అక్రమ నిర్మాణాలు*
మైహోమ్ చేపడుతున్న నిర్మాణాలన్ని అక్రమమే అని స్పష్టమైంది. మైహోమ్ సంస్థ 80 ఎకరాల విస్తీర్ణంలో సర్వేనెంబర్లు 1068,1069,1072లలో నిర్మాణానికి గతంలోని ప్రజాభిప్రాయసేకరణ నిర్వహించి కేంద్ర ప్రభుత్వం నుండి పర్యావరణ అనుమతులు పొందింది. అయితే నిర్మాణాలు మాత్రం వివాదాస్పద సర్వే నెంబర్లు 1057,876,1080, 1081,1084,1060,1066,1067, 1094, 1095,1096,1097, 1098,1099,1071, లలో చేపట్టింది. సర్వేనెంబర్ 1057లో గల 113 ఎకరాల భూదాన్ భూముల్లో, 18.06 ఎకరాల ప్రభుత్వసీలింగ్ భూముల్లో, ఇతర సర్వేనెంబర్లలో గల వివాదాస్పద ప్రభుత్వ,సీలింగ్ భూములు మైహోం సంస్థ ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమనిర్మాణాలు చేపట్టింది. ఈభూముల్లో మొదటి నుండి వివాదం నెలకొంది. గతంలోని మైహోమ్ సంబంధించిన కొన్ని నిర్మాణాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో మైహోం నూతన నిర్మాణాలకు రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు ఎటువంటి అనుమతులు జారీ చేయలేదు.లేఅవుట్, అపార్ట్మెంట్ల నిర్మాణాలకు ఎటువంటి డిటిసిపి అప్రూవల్ తీసుకోకుండా నిర్మాణాలు చేపట్టింది.ఈ సర్వేనెంబర్లలో నిర్మాణాలపై మైహోం సంస్థ స్థానికంగా పెద్దఎత్తున విమర్శలు ఎదుర్కొంది.
మేళ్లచెరువు ఆగస్టు 2 (నిజం న్యూస్)
*దిగిచ్చిన మైహోం*
ఇప్పటికే చాలావరకు నిర్మాణాలు పూర్తి చేసిన మైహోం నిర్మాణాలు అక్రమ కట్టడాలని మీడియాలో పెద్ద ఎత్తున వరుస కథనాలు ప్రచురితం కావడంతో ఆ సంస్థ ఎట్టకేలకు దిగివచ్చింది. సర్వేనెంబర్ 1068,1069,1072లో పూర్తి విస్తీర్ణం 40ఎకరాలు మాత్రమే ఉండగా గతంలోని పవర్ ప్లాంట్ నిర్మాణాలు చేపట్టారు.పర్యావరణ అనుమతులు పొందిన సర్వేనెంబర్ గల భూమిలో కాకుండా వివాదాస్పద భూముల్లో మైహోం సంస్థ నూతన ప్లాంట్ నిర్మాణాలు చేపట్టింది. వివాదాస్పద భూముల్లో నిర్మాణాలపై పెద్ద ఎత్తున విమర్శలు, వివాదాలు నెలకొనడంతో దిగివచ్చిన మైహోం సంస్థ ఇతర సర్వే నెంబర్లల్లో నిర్మాణాల కోసం ఇటీవల దరఖాస్తు చేసుకుంది. ప్రాజెక్టు నిర్మాణ ప్రదేశం, విస్తీర్ణం మార్పులు-చేర్పులు నిబంధనలకు విరుద్ధమని, మరల ప్రజాభిప్రాయసేకరణతో పాటు అన్ని అనుమతులు పొందాలని అధికార యంత్రాంగం పేర్కొంది.