మద్యం సీసాల కింద నలుగుతున్న పీసా చట్టం

*తీర్మానాలు వ్యతిరేకం… నిర్వహణకు అనుకూలం*
*నాలుగొందలకు పైగా బెల్టు షాపులు – పట్టించుకోని అధికారులు*
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ( నిజం న్యూస్) జులై 30:
ఏజెన్సీ ప్రాంతాల్లో పీసా చట్టం అమలు ఎండమావిని తలపిస్తుంది. పేరుకు పీసా గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేస్తున్నారు కానీ వాటిని అమలు చేయడంలో మాత్రం తీవ్రమైన నిర్లక్ష్యం కనిపిస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో మద్యం విక్రయాలను పరిశీలిస్తే పీసా గ్రామసభ తీర్మానాలను ఏవిధంగా బుట్టదాఖలు చేస్తున్నారో అర్థమవుతుంది. బెల్టు షాపులకు వ్యతిరేకంగా పీసా గ్రామసభలో తీర్మాలు చేసినా అవి అమలు కావడంలేదు. మండల పరిధిలో నాలుగు మద్యం దుకాణాలకు అనుకూలంగా పీసా గ్రామసభ తీర్మానాలు చేసినా బెల్టు షాపులను మాత్రం అనుమతించబోమని తీర్మానించారు. కానీ ఇప్పుడు మండలం మొత్తం పరిశీలిస్తే దాదాపు నాలుగొందలకు పైగా బెల్టు షాపులు నడిపిస్తున్నారు. ఈ విషయమై మండల పరిధిలోని కొందరు మహిళల అభ్యర్థించడంతో జిల్లాకు చెందిన అంతర్జాతీయ మానవ హక్కులు మరియు నేర నిరోధక సంస్థ సభ్యుడైన గంగాధర కిశోర్ కుమార్ ములకలపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి మద్యం దుకాణాలు, బెల్టు షాపుల వివరాల కోసం సమాచార హక్కు చట్టం క్రింద దరఖాస్తు చేశాడు. వారు ఈ దరఖాస్తును పాల్వంచ ప్రోహిబిటెడ్ అండ్ ఎ క్సైజ్ శాఖ వారికి బదిలీ చేశారు. వారిచ్చిన సమాచారం ప్రకారం ములకలపల్లి మండలంలో నాలుగు మద్యం దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి పీసా గ్రామసభ తీర్మానాలు చేశారు కానీ బెల్టు షాపులను వ్యతిరేకించారు. అయినప్పటికీ మండల పరిధిలోని ఏ గ్రామాన్ని పరిశీలించినా బెల్టు షాపులు దర్శనమిస్తున్నాయి. అసలు బెల్టు షాపులు లేని గ్రామమే లేదంటే అతిశయోక్తి కాదు. ప్రతి గ్రామంలో ఐదుకంటే ఎక్కువ బెల్టు షాపులు నిర్వహిస్తున్నా అధికారులు కానీ పీసా నిర్వాహకులు కానీ పట్టించుకోవడంలేదు. పంచాయతీ కార్యదర్శుల వద్ద కూడా బెల్టు షాపుల వివరాలు లేవంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
*చట్టం ఏం చెబుతుందంటే….:-*
ఏజెన్సీ ప్రాంతాల్లో పీసా చట్టం గిరిజనులకు వరం లాంటిది. గిరిజన జనాభాలో ఎక్కువ భాగం ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంతో గ్రామ పాలనను కలిగి గ్రామసభను అన్ని కార్యకలాపాలకు కేంద్రంగా చేసుకుంటూ స్వీయ పాలనను అందించేందుకు పీసా చట్టం ఉద్దేశించబడింది. పీసా చట్టం ప్రకారం గ్రామపంచాయితీ పరిధిలోని సామాజిక ఆర్థికాభివృద్దిపై తయారు చేసే ప్రణాళికలు పథకాలు ప్రాజేక్టులను వాటి అమలుకు ముందే గ్రామసభ తప్పకుండా అమోదించాలి. చిన్న తరహ ఖనిజాలను పరిశీలించి ఎవరికైనా గ్రాంట్ చేసేందుకు వేలికితీతకు పీసా గ్రామసభ అమోదం తప్పనిసరిగా ఉండాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో భూముల బదలాయింపు నిరోధించడానికి, అన్యాక్రాంతమైన భూములను తిరిగి రాబట్టడానికి, మత్తు పదార్థాల అమ్మకం మరియు సేవించడంపై నిషేధం లేదా క్రమబద్దీకరణ లేక నియంత్రణ చేసే అధికారం పీసా గ్రామసభకు ఉంటుంది. అంతేకాక మరే ఇతర చట్టాలలోని ప్రోవిజన్లు పీసా చట్టంలోని ప్రోవిజన్లకు విరుద్ధంగా ఉన్నప్పటికీ పీసా చట్టానిదే పైచేయిగా ఉంటుంది. కానీ విశేషమైన అధికారాలున్న పీసా చట్టం ప్రభుత్వ నిర్లక్ష్యం వలన నీరుగారి పోతుంది.