చెట్ల పొదల్లో దొరికిన పసి పాపను ప్రభుత్వమే పెంచుతుంది

– బాలల సంఘం నాయకులు కొడారి వెంకటేష్

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జూలై 17(నిజం న్యూస్)

తుర్కపల్లి మండలం లోని వెంకటాపురం – దత్తాయిపల్లి మార్గం లోని చెట్ల పొదల్లో దొరికిన పసి పాప (8 రోజుల) పూర్తి బాధ్యతను ప్రభుత్వమే తీసుకొని పెంచుతుందని బాలల హక్కుల సంఘం నాయకులు కొడారి వెంకటేష్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పిల్లలు అవసరం లేదని భావించిన తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏరియా ఆసుపత్రి లో ఏర్పాటు చేసిన “ఊయల” లో వేసి వెళ్ళాలని ఆయన కోరారు. గత రెండు సంవత్సరాల క్రితం ఏరియా ఆసుపత్రి లో ప్రారంభమైన “ఊయల” పై అధికారులు ప్రచారం చేయకపోవడం వలన ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆయన అన్నారు. ఏరియా ఆసుపత్రి లో ఏర్పాటు చేసిన ఊయల ఊగడం లేదన్నారు.పిల్లలు అవసరం లేదని భావించిన కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను చెట్ల పొదల్లో, మురికి కాలువలో, చెత్త కుప్పల వద్ద వదిలి పోవడం చాలా బాధాకరం అని ఆయన అన్నారు. శనివారం సాయంత్రం దొరికిన పసి పాపను మెరుగైన వైద్యం కోసం డాక్టర్ల సలహా మేరకు హైదరాబాద్ కు తరలించారని ఆయన తెలిపారు. సంతానం కలిగే అవకాశం లేని తల్లిదండ్రులు ఏరియా ఆసుపత్రికి వచ్చి శనివారం దొరికిన పసి పాపను సాదుకుంటామని ఆస్పత్రి సిబ్బందిని దత్తత ఇవ్వాలని అడుగుతున్నారని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “చట్ట బద్దత తోకూడిన దత్తత” పై అవగాహన లేకపోవడం వల్ల తల్లిదండ్రులు ఆస్పత్రికి వచ్చి పసి పాప కోసం ఆరాతీస్తున్నారని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్ట బద్దత తోకూడిన దత్తత పై అవగాహన కల్గించే విషయం లో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. మినిస్ట్రీ ఆప్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, డెవలప్మెంట్ ఇండియా ఆధ్వర్యంలో దేశంలో కొన్ని ఏజెన్సీ లు ఏర్పాటు చేసి చట్ట బద్దత తోకూడిన దత్తత ( సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ)ను సి ఏ అర్ ఏ ద్వారా సంతానం లేని దంపతులకు దత్తత ఇస్తున్నారని ఆయన తెలిపారు. దత్తత కు అర్హతలు కల్గిన తల్లిదండ్రులు పిల్లల దత్తత కోసం కలెక్టరేట్ లోని జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ అధికారి కార్యాలయం లో సంప్రదించాలని ఆయన కోరారు. మరియు cara.nic.in ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. *చట్ట బద్దత తోకూడిన దత్తత*(సి ఏ అర్ ఏ). దత్తత కు తల్లిదండ్రులకు కావాల్సిన అర్హతలు. (1). తల్లిదండ్రుల సంవత్సరం ఆదాయం లక్ష రూపాయలు మించి ఉండాలి .(2) సంతానం లేని దంపతులు భవిష్యత్తులో పిల్లలు కలగరని ప్రభుత్వ వైద్యుల చేత దృవీకరణ పత్రం ఉండాలి.(3) దంపతులు నివసించే ప్రాంతాల్లోని ఇద్దరు పరిచయస్తుల దృవీకరణ పత్రం ఉండాలి.(4) దంపతులకు చెందిన ఆధార్ కార్డులు, పాన్ కార్డులు ఉండాలి.(5) దంపతులకు దీర్ఘకాలిక వ్యాధులు ఉండరాదు.(6) దంపతుల ఇద్దరు వయస్సు కలిపితే 90 సంవత్సరాలు లోపు ఉంటే 0-6 నెలల పాప/ బాబు దత్తత గా పొందే అవకాశం ఉంటుంది.90 సంవత్సరాల పైబడిన వారికి 5 సంవత్సరాల నుండి 8 సంవత్సరాలలోపు వయస్సు గల పాప/ బాబు ను దత్తత గా పొందే అవకాశం ఉంటుంది. దంపతుల ఇద్దరి వయస్సు కలిపితే 100 సంవత్సరాలు దాటితే 8 సంవత్సరాల పైబడిన పాప/ బాబు ను దత్తత పొందవచ్చు. భవిష్యత్తులో ఎలాంటి అవరోధాలు లేకుండా, చట్ట బద్ధంగా దత్తత తీసుకుని దంపతులు సంతానలేమి సమస్యలు అధిగమించవచ్చు. ఈరకంగా తీసుకొనే దత్తత కు సుమారు 60 వేల రూపాయల వరకు ఖర్చు తల్లిదండ్రులు భరించాల్సి ఉంటుంది.